అనగనగా ఒక అడవి. ఆ అడవిలో "చిన్నా" అనే జింకపిల్లకూ, చందూ అనే నక్కపిల్లకూ స్నేహం కుదిరింది. అవి రెండూ ఆ అడవిలో, ప్రతిరోజూ కబుర్లు చెప్పుకుంటూ తిరిగేవి. ఒకనాడు అవి అలా తిరుగుతూండగా, ఎక్కడినుండో పెద్దగా ఉరిమినట్టుగా, ఒక సింహం గర్జించింది. అది విన్న ఆ రెండూ ప్రాణభయంతో, పరుగులుతీసాయి. అలా పరిగెత్తుతుండగా చిన్నా కాలు బెణికి, కింద పడిపోయింది.
అప్పుడు భయంతో వణికిపోతూ, చిన్నా అరిచింది: " చందూ ! నేను పడిపోయాను. లేవలేకున్నాను. కాస్త వచ్చి సాయంచేయవా?" అని ఆత్రంగా అడిగింది. అప్పుడు చందూ "అమ్మో ! ఇప్పుడు నేను వచ్చానంటే, ఆ సింహం చేతికి నేనూ దొరికిపోయినట్టే ! నేను రాలేను బాబూ!" అని పారిపోయింది.
చిన్నాకు ఏమిచేయాలో దిక్కు తోచలేదు. అది ఏడుస్తూ అక్కడే పడిపోయింది. అంతలో సింహం రానే వచ్చింది. అది భయంతో వణుకుతున్న జింక పిల్లను చూసి "ఓ జింకపిల్లా ! భయపడకు. నేను నిన్ను ఏమీ చేయను. నాకు ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే నేను జంతువులను చంపుతాను. నాకిప్పుడు ఆకలిగా లేదు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు" అని చెప్పి వెళ్ళిపోయింది. జింకపిల్లకు పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టయింది. ’బ్రతుకు జీవుడా !’ అనుకొని, మెల్లిగా పైకి లేచి కుంటుతూ ముందుకు సాగింది.
ఇంతలో ఆ పక్కనుండి ’కాపాడండి... కాపాడండి...’ అని అరుపులు వినబడ్డాయి. ’అరె ! ఇవి చందూ అరుపుల్లాగా ఉన్నాయే!’ అని చిన్నా అటువైపుకు పరుగెత్తింది. చూడగా, చందూ అక్కడ ఒక బురద గుంతలో చిక్కుకొని అరుస్తున్నది. ’అయ్యో ! చందూ, బురదలో ఇరుక్కపోయావా ! రా...రా...రా...’ అంటూ చిన్నా, చందూని గుంతలోనుండి బయటకు లాగింది.
బయటకువచ్చిన చందూకి తన స్వార్థాన్ని తలుచుకొని సిగ్గేసింది. తన మొహాన్ని అది చిన్నాకు చూపలేకపోయింది. ’చిన్నా ! నువ్వు ఎంతో మంచివాడివి. నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు నేను నిన్ను కాపాడకున్నప్పటికీ, నన్ను మాత్రం నువ్వు కాపాడావు. నిజమైన మంచి స్నేహితుడివంటే నువ్వే. నన్ను క్షమించు’ అన్నది. ’మన మధ్య క్షమాపణలెందుకు మిత్రమా! పద, పోదాం’ అని చిన్నా అన్నది.
ఆపదలో ఉన్నప్పుడు ఆదుకొనేవాడే నిజమైన, మంచి మిత్రుడు. చేసిన తప్పును క్షమించగలిగేదే నిజమైన స్నేహం.