పూర్వం తూర్పుదేశంలో చెంబన్న, పడమటి దేశంలో మంబన్న అనే ఇద్దరు బలశాలులు ఉండేవారు. వారి బలాబలాలను గూర్చి చుట్టుపక్కలవాళ్ళు బహుగొప్పగా చెప్పుకొనేవారు. చెంబన్న,మంబన్నలు ఒకరినిగూర్చి మరొకరు విన్నారేకాని, వారు ఒకరినొకరు ఎన్నడూ చూసుకోలేదు.
ఒక రోజు చెంబన్న, మంబన్నను చూడడానికి బయలుదేరాడు. ప్రయాణానికన్నీ సిద్దంచెయ్యమన్నాడు భార్యను. చెప్పిందే తడవుగా చెంబన్న భార్య ఊరిలోని అమ్మలక్కలను అందరినీ అడిగి , పాత చీరలన్నీపోగుచేసి, ఒక బొంతగా కుట్టి, అందరి సాయంతో వంట చేసి, వరిబువ్వా, ముద్ద పప్పు, ఊరగాయ, నెయ్యీ వేసి బొంతనిండా సద్దిని కట్టించింది. ఆ సద్ది మూటను ఒక ఏనుగుమీదుంచి భర్తను సాగనంపింది.
చెంబన్న, ప్రయాణం చేసీ, చేసీ మాపటేళకు ఒక చోట ఆగి, సద్దిమూటను విప్పిభోజనం తిన్నాడు. భోంచేశాక బొంతను ఒక పెద్ద చింతమాను మీద ఆరేసి, మళ్ళీ తిరుగుప్రయాణంలో తీసుకోవచ్చునులే అనుకొని ప్రయాణాన్ని కొనసాగించాడు. సాయంత్రానికి మంబన్న ఊరిని చేరుకొని మంబన్న గురించి ఆరాతీయసాగాడు.
కట్ట మీద కూర్చున్న ఒక ముసలి తాతను మంబన్న ఇల్లు ఎక్కడుంటుందని అడిగాడు. అదిగో ! అక్కడ బిందెలో నీళ్ళు తెస్తోందే, ఆమే మంబన్న భార్య అని తాత చెప్పాడు. అపుడు చెంబన్న, మంబన్న భార్యతో మాట్లాడి తాను, మంబన్నను చూడాలనీ, అతనితో మాట్లాడాలనీ చెప్పాడు. సరే అని చెంబన్నను, మంబన్న భార్య వాళ్ళ ఇంటికి తీసుకపోయింది. "అన్నా! ఇప్పుడే వస్తాను, అలా ఆ మంచం వాల్చుకొని కూర్చో"మని చెప్పి లోపలికి వెళ్ళింది.
చెంబన్నకు అది అవమానంగా అనిపించింది. అయినా తప్పదుగదా. "ఒక ఊరి రెడ్డి మరోఊరి పాలేగాడు" , అనుకొని మంచం వాల్చబోయాడు. మంచం వంగలేదు. కొంచెం గట్టిగా ప్రయత్నించాడు. మంచం కదలనేలేదు. బలమంతా ఉపయోగించి చూసాడు. కానీ మంచాన్నిమాత్రం కదపలేకపోయాడు. ఇక మంచాన్ని చూస్తూ ఆశ్యర్యపోవడం చెంబన్న వంతయింది. ఇంతలో మంబన్న భార్య వచ్చి, కూర్చోమంటే అలా నిలబడ్డావేందన్నా? అంటూ వచ్చి తన చిటికెన వేలితో మంచాన్ని వాల్చింది. చెంబన్న ఆశ్యర్యంతో, "మంబన్న భార్యనే ఇంత బలవంతురాలే ! ఇక మంబన్న ఎంత బలవంతుడయి ఉంటాడో?" అనుకున్నాడు.
ఇంతలో మంబన్న భార్య వచ్చి, "ఆయన ఉదయం వస్తారు, మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉండండని, ఒక చాపా, రగ్గూ ఇచ్చి, ’ఇక్కడ పడుకొమ్”ని బయట ఒక అరుగును చూపించింది. అరుగు మీద పడుకున్న చెంబన్నకు, నిద్ర పట్టలేదు. "అమ్మో! ఉదయం వరకూ నేను ఇక్కడే ఉంటే మంబన్న చేతిలో నాకు పరాజయం తప్పదు" అనుకొని తెలవారకనే బయలుదేరి వెళ్ళిపోయాడు. అలా ఆయన వెళ్ళిన కొంతసేపటికే మంబన్న ఇంటికి వచ్చాడు. చెంబన్న వచ్చివెళ్ళిన విషయాన్ని భర్తతో చెప్పింది మంబన్న భార్య. అవునా ! అయ్యో ! నేను ఎంతకాలంనుండీ ఆయనను కలవాలనుకుంటున్నాను. ఇప్పుడే వెళ్ళి ఆయనను కలుసుకొంటానని బయలుదేరాడు.
చెట్టుపైకెక్కి, బొంతను విప్పుకొంటున్న చెంబన్నకు, గుర్రంపైవస్తున్న మంబన్న కనిపించాడు. అతనే కాబోలు మంబన్న! నన్ను ఓడించడానికే వస్తున్నట్టున్నాడు. ఆలస్యం చేస్తే నాకే ప్రమాదం అనుకొని త్వరగా చెట్టును దిగి, దాన్ని వేర్లతోసహా, పెకిలించేసుకొని, తన ఏనుగెక్కి ముందుకు పోయాడు. ఇది చూసిన మంబన్న, చెంబన్న తన మీదకు యుద్దానికి వస్తున్నాడేమోననుకొని, తనూ ఒక తాటి చెట్టును పెకలించుకొని దాన్ని భుజాన పెట్టుకొని, తన గుర్రాన్ని, దౌడుతీయించాడు. కొంత సేపటికి వారిద్దరూ, కలుసుకొని తమలో ఎవరు గొప్పో తేల్చుకోవాలనుకొన్నారు. గెలుపును నిర్ణయించే మధ్యవర్తి కోసం ఎదురుచూశారు. ఇంతలో అంబలి కుండను నెత్తిమీద పెట్టుకొనివస్తున్న సీతాలు వారికి కనిపించింది.
ఇద్దరూ అమె దగ్గరకు పోయి "అమ్మా ! మేమిద్దరం యుద్దం చేస్తాము. మాలో ఎవరు గొప్పో నువ్వు తేల్చాలి" అని అడిగారు. అందుకు సీతాలు "అమ్మో! నిన్ననే నా మొగుడు సద్ది ఆలస్యమైందని మక్కిలు విరగదన్నాడు. ఇక ఈ రోజూ ఆలస్యమయితే, అంతే సంగతి. అంతగా కావాలంటే, మీరిద్దరూ నాభుజాలమీదకెక్కి పోట్లాడండి. నేను వెళుతుంటాన"ని చెప్పింది. ’ఈ ఉపాయం బాగానే ఉం”నుకొని, వారిద్దరూ సీతాలు భుజాలమీద కూర్చొని యుద్ధం చేయసాగారు. ఆంత దూరంలో వస్తున్న సీతాలును చూసిన గొర్రెలు కాసే తన భర్త, అయ్యో ! నిన్న నేను తనను కొట్టినందుకు కాబోలు ఇవాళ నన్ను కొట్టించడానికి ఎవరో బలవంతులను తీసుకవస్తున్నది నా భార్య! వాళ్ళకు దొరికితే నన్నెక్కడ బ్రతకనిస్తారు ? బ్రతికుంటే బలుసాకులు తినవచ్చు’ననుకొని, తన కంబళిని పరిచి, గొర్రెలనన్నింటినీ అందులొ మూటగట్టుకొని,ఆ మూటను తన నెత్తిన పెట్టుకొని పరిగెత్తసాగాడు.
అలా పరుగెత్తి పోతున్న అతన్ని, పైనుండి ఓ గ్రద్ద చూసి "ఇదేదో పెద్ద మాంసపు ముద్దలాగా ఉన్నదే" అనుకొని కిందికొచ్చి వాడిగల తన కాలిగోళ్ళతో అతన్నీ, గొర్రెల మూటనూ ఒక్క తన్నుతో తన్నుకపోయింది. అలా పోతూండగా ఏడంతస్తుల మేడలో తల ఆర్పుకుంటున్న యువ రాణి ఒకసారి ఆకాశంలోకి చూసింది. అంతలోనే గ్రద్ద తన్నుకుపోతున్న గొర్రెల మూటవచ్చి రాణి కంట్లో పడింది. రాణి సుతారంగా తన కంటిరెప్పను ఒక్కసారి రుద్దింది. వెంటనే గొర్రెల మూట కరిగిపోయింది.
కథనంతా విన్నారు కదా ! మరి మీరే చెప్పండి వీరిలో ఎవరు గొప్పో.??