చల్లటి గాలులు, చిటపట చినుకులు, తొలకరివాన వాసనలు- వీటన్నంటినీ గుర్తుకు తెచ్చాయి, ఈ నెల ముఖచిత్రం, సంపాదకీయం - రెండూ !
ఈసారి కొత్తపల్లిలో చదవగానే "అహ! " అనిపించిన కథ మూర్తి గారి "మంచి దొంగ". జీవితంలో చాలా సందర్భాలలో అసలు 'వస్తువుని వాడటం' కన్నా, 'ఆ వస్తువు నా దగ్గరే ఉంది' అన్న భావమే మనకి సౌఖ్యాన్ని ఇస్తుంది. - ముఖ్యంగా ఇది డబ్బుల విషయంలో పెద్దవాళ్ళకి, ఆడుకొనే వస్తువుల విషయం లో చిన్న పిల్లలకి- చాలా సత్యం. ఈ నిజాన్ని ఎంతో చక్కగా చూపించిందీ కథ. అందరికీ తెలిసిన ఒక పాత కథని ఇంత అందంగా మలచడం ప్రశంసనీయం. ఈ నెల చిలిపి ప్రశ్నలూ, ఎన్నో జోక్స్ తో నవ్వించడమే కాకుండా మంచి కథ వ్రాసారు మూర్తి గారు.
ఇలాంటి సత్యాల్ని చెప్పిన కథలు ఈ సంచికలో చాలానే ఉన్నాయి. రూమీ కథ (పిట్ట చూపు), బౌద్ధకథ (నిధి-కుక్క), రాధ కథ (సహాయం), అఖిల్ కథ (అసలైన సంపద) లు సూటిగా సత్యాల్ని తెలియజేసాయి. రూమీ కథ లో పిట్ట చివరి సలహా చెప్పకుండా ఎగిరి పోతూ అన్నట్లున్న మాటలు కూడా విలువైన సలహా లాగే ఉండటం చాలా బాగుంది ! 'సంతోషం' కథ చివర లో చెప్పిన విలువైన సత్యాన్నిఅర్థం చేసుకోవడానికీ, దానిని కథ లోని సంఘటనలలో చూడడానికీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సిందే. 'సౌకర్యాలూ, సుఖాలూ బయటినించి ఎన్ని వచ్చినా, సంతోషం మాత్రం లోపల్నించి రావల్సిందే' అన్న సత్యాన్ని కథలోని సంఘటనలు అస్పష్టంగా చిత్రించాయనిపించింది.
'మన పని మనం చేసుకోవటమే మంచిది' అన్ననీతిని చెప్పాయి స్వర్ణలత వ్రాసిన 'ముసలాయన-ఆవు', మల్లేష్ వ్రాసిన 'పని ఎలా జరుగుతుంది?' కథలు.
పర్యావరణం గురించిన రెండు కథలూ (పుట్టిన రోజు బహుమతి - క్రాంతి; స్వగతం - కిరణ్) ఒకదానికొకటి పూరకంగా ఉన్నాయి. 'స్వగతం' కథలో మనుషులు చెట్లని దిష్టి బొమ్మల్లా ఎలా చూస్తున్నారో చెబితే, కూరగాయలూ పండ్ల మొక్కల్నే చాక్లెట్లు గా, బహుమతి గా ఎలా ఇవ్వవచ్చో చిత్రించింది పుట్టిన రోజు బహుమతి కథ. రోహిత్ వ్రాసిన 'స్పిరిట్' కథలో పాయింట్ చాలా బాగుంది. చివర లో భాష మరీ పెద్దవాళ్ళదయిపోయినట్లుగా ఉంది.
చివర్లో 'కల' తో ముగిసిపోయే కథ ఒక్కటైనా లేకపోతే పిల్లల పత్రికకు నిండుదనం రాదు. ఆ లోపాన్ని పూరించినట్లుగా ఉంది, దేవీ చందన వ్రాసిన 'ఊహ' కథ. ఇక మూఢ నమ్మకాల నేపథ్యం లేకుండా వ్రాసిన ఇంద్రజాలపు కథ (ముళ్ళ కంచె) చదివించింది. ఇలాంటి కథలు మరిన్ని వస్తాయని ఆశిద్దాం.
దశాని వ్రాసిన 'మారు అడక్కూడదు' కథ నవ్వించింది. ఇన్ని పేజీల కథకు వేసింది ఒక్క బొమ్మే అయినా, పాఠం చెపుతున్న టీచర్ ఊహలో వంకాయని చిత్రించడం బాగుంది. 'నీతి చంద్రిక'లో కథనం స్థాయిలో బొమ్మలు కూడా ఉంటే బాగుంటుంది అన్పిస్తుంది.
'యువ కెరటాలు'లో 'కాటో-కకాలా' కథని సౌమ్య గారు చెప్పిన విధానం చాలా బాగుంది. ఒక్క వ్యక్తి వల్ల కొన్ని దీవుల సమూహం లోని ప్రజలందరికీ లైబ్రరీ ఏర్పడటం అనేది ఎంతో స్పూర్తి దాయకంగా ఉంది. 'కొద్ది మంది కైనా, చాలా మందికైనా ఉపయోగపడే పనులు జరగాలంటే, అది ఎక్కడో- ఎవరో వ్యక్తి- లేదా వ్యక్తుల- స్థాయి లోనే మొదలవ్వాలి' అనే విషయాన్ని చక్కగా తెలిపింది, కాటో-కకాలా కథ. ఇక చివరి అట్ట మీద మంచి పుస్తకం శీర్షిక లో పుస్తకం గురించి వ్రాసి ఫోన్ నంబర్ ఇవ్వడం ఎంతో ఉపయోగం గా ఉంది.
అభినందనలు !