"నా పేరు కెల్విన్ డో. మా దేశం సియర్రా లియోన్. నాకు కొత్త వస్తువులు కనిపెట్టడం అంటే ఇష్టం" - ఇదీ కెల్విన్ అనే పదిహేడేళ్ళ అబ్బాయి తనని తాను పరిచయం చేసుకునే విధానం. స్థానికులు ఇతన్ని డి.జె.ఫోకస్ అని పిలుస్తారు. ఇతని ప్రతిభని గుర్తించిన పాశ్చాత్య పాత్రికేయులు "బాల మేధావి, ఇంజనీర్" అంటారు.
కెల్విన్ పశ్చిమ ఆఫ్రికాలోని సియర్రా లియోన్ అన్న దేశానికి చెందిన పదిహేడేళ్ళ కుర్రవాడు. గత ఏడాది ఎం.ఐ.టీ. వంటి ప్రపంచ విఖ్యాత విశ్వవిద్యాలయం వారి ఆహ్వానాన్ని అందుకుని అక్కడ ఒక ఇంజినీరింగ్ ప్రాజెక్టు చేయడం ద్వారా చాలా పేరు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఇతను ఏమి చేస్తూ ఉంటాడు? చెత్తబుట్టల్లో దొరికే పాత ఎలక్ట్రానిక్ పరికరాలలోని భాగాలతో అతను తన సొంత పరికరాలు తయారు చేసేస్తూ ఉంటాడట. సియర్రా లియోన్‌లో వీళ్ళు నివసించే ప్రాంతంలో విద్యుత్ సరఫరా సరిగా ఉండదు. వారానికొకసారి లైట్లు వెలుగుతాయంట!
ఇలాగ రోజంతా చీకట్లో ఉంటారు కనుక, తనంతట తానుగా కెల్విన్ ఒక బ్యాటరీ తయారు చేశాడట విద్యుత్ కోసం! ఏదన్నా పరికరం కనిపిస్తే, అదెలా పనిచేస్తుంది? అని తెరిచి చూడ్డం, తెలుసుకోవడం కెల్విన్ కి అలవాటు. సొంతంగా ఒక ఎఫ్.ఎం. ట్రాన్స్మిటర్ తయారు చేశాడు. తరువాత, స్థానిక యువతకు తమ అభిప్రాయాలు వెలిబుచ్చే మార్గం చూపడానికీ, స్థానిక సమస్యలు చర్చించుకోవడానికీ, ఏకంగా తన సొంత రేడియో స్టేషన్ రూపొందించాడు. రేడియో స్టేషన్ కి కరెంటు కావాలి కనుక సొంతంగా ఒక జనరేటర్ రూపొందించాడు!
కరెంటు కూడా సరిగా లేని సియర్రా లియోన్ వంటి దేశంలో పెరిగిన అబ్బాయి అన్ని పరికరాలు ఎలా చేసాడు? ఎవరో బాగా శ్రద్ధగా అతనికి ఇవన్నీ నేర్పారు అనుకునేరు. అతను చేసేవి చాలామట్టుకు తాను సొంతంగా తెలుసుకున్నవే. ఒకసారి ఇన్నోవేట్ సలోనే ఐడియా కాంపిటీషన్ అన్న పోటీలో పాల్గొని తుక్కు కింద పారేసే సామగ్రితో కెల్విన్ ఒక జనరేటర్ రూపొందించడంతో, అతనికి అమెరికా వెళ్ళడానికి ఆహ్వానం వచ్చింది. అక్కడ ప్రముఖులని ఎందరినో కలిసాడు కెల్విన్. ఎం.ఐ.టీ. వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో పనిచేసే పరిశోధకులతో చర్చించి తన పరికరాలను ఇంకా మెరుగుపరుచుకోవడం గురించి సలహాలు తీసుకున్నాడు.
ఎం.ఐ.టీ విశ్వవిద్యాలయంలో తరుచుగా నిర్వహించే విజిటింగ్ ప్రాక్టీషనర్స్ ప్రోగ్రాంలో భాగంగా ఆహ్వానింపబడ్డ అతి పిన్న వయస్కుడు కెల్వినే.
అక్కడ నేర్చుకున్నవన్నీ తిరిగి తన దేశం వెళ్ళి తన జట్టుతో కలిసి తమ కొత్త పరికరాల రూపకల్పనకి వాడుకోవాలని కెవిన్ ఆలోచనట. తన ఈడువారిలో ఇలా మన సమస్యలని మనమే పరిష్కరించుకోవాలి అన్న అవగాహన కలిగించి, వారిలోని సృజనాత్మకతకు పదును పెట్టేలా ప్రోత్సహించడం అతని ఆశయమట. గాలిమరని రూపొందించి విద్యుచ్చక్తి సృష్టించడం అతని తదుపరి లక్ష్యాల్లో ఒకటి. ఇదివరలో, దాదాపు రెండేళ్ళ క్రితం విలియం కంకంబ్వా అన్న అబ్బాయి గురించి ఈ పత్రికలోనే రాశాను చూశారా? అతని కథే గుర్తు వచ్చింది నాకు కెల్విన్ గురించి చదువుతూ ఉంటే.
తన దేశమన్నా, ప్రజలన్నా తనకెంతో ఇష్టమనీ, తను భవిష్యత్తులో శాస్త్రవేత్తై సియర్రా లియోన్ దేశంలోని పరిస్థితులు మెరుగు పరిచేందుకు కృషి చేస్తాననీ అంటున్నాడు కెల్విన్. ఎంతో పరిమిత వనరులున్న సియర్రా లియోన్ వంటి దేశంలో ఒక చిన్న ఊరిలో పెరిగిన కెల్విన్ తనంతట తానుగా ఇన్ని చేయగలుగుతున్నాడు అంటే భలే ఉంది కదూ!?