ఆపైన హిరణ్యగర్భుడు మంత్రితో "శత్రువు చిత్రవర్ణుడు తన సైన్యంతో సహా మలయ పర్వతం పైకి చేరుకొని అక్కడ విడిది చేసి ఉన్నాడు. ఇట్లాంటి సమయంలో మనలో మనం వాదులాడుకుంటూ ఉంటే శత్రువుకే లాభం. కాబట్టి, నీ అతి వాదనలు అన్నిటినీ ప్రక్కనబెట్టి, చేయవలసిన పనిని గురించి ఆలోచించు. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో జాగ్రత్తగా ఆలోచించి చెప్పు" అన్నది.
చక్రవాక మంత్రి కొంచెం చిన్నబోయి, వెంటనే తేరుకొని, కొంచెం సేపు కళ్ళు మూసుకొని ఆలోచించి, రాజుతో "ప్రభూ! చిత్రవర్ణుడి చేత అవమానింపబడిన అతని మంత్రి చిన్న-బుచ్చుకొని ఉన్నాడని తెలిసింది కదా? 'ఇది ఒక్కటే మనకు పనికొచ్చే సంగతి' అని నాకు అనిపిస్తున్నది. అంతేగాక, 'ఇతరులకు వశం అయినవాడు, తొందరపాటు మనిషి, యోధులను అవమానించేవాడు- శత్రువులకు సులభంగా లొంగుతారు' అని పెద్దలు చెబుతారు. ఈ మూడు లక్షణాలూ ఇప్పుడు చిత్రవర్ణుడిలో నిండుగా కనిపిస్తున్నాయి.
ఇప్పుడైతే అతని సేనాపతులు ప్రయాణపు బడలిక వల్ల కొంచెం అజాగ్రత్తగా ఉంటారు; దూర ప్రయాణం వల్ల అలసి, కొంతకాలంగా ఆకలి దప్పికలకు కూడా లోనయి, అతని సైన్యం చప్పగా ఉంటుంది. ఇక ఆ నెమలి రాజు కూడా, మన 'కోటను ఎలా వశపరచుకోవాలి' అన్న ఆలోచనలో తలమునకలై, వెనక-ముందు చూసుకోకుండా ఉంటాడు- కాబట్టి విరోధులను పరాభవించటానికి ఇది మంచి సమయం: 'ఈ కొండనీ, అడవినీ దాటి- విరోధి సైన్యంపైన ఆకస్మికంగా దాడి చేసి, దొరికిన వారిని దొరికినట్లు చంప'మని మన కొంగ సైన్యాన్ని ఆదేశించండి- ఇక ఆలస్యం ఎందుకు?" అన్నది.
హంసరాజు ఆ మాటలకు చాలా సంతోషించింది. 'ఇక పని మొదలయింది' అన్న ఉత్సాహంతో మనసు చిందులు వేస్తుండగా అది తన సైన్యాధ్యక్షులను పిలిచి ఏం చేయాలో చెప్పింది- "ఎవరైనా శత్రువును ఎదుర్కొని, ప్రాణాలొడ్డి శౌర్యంతో పోరాడితే వచ్చేది గౌరవంగాని, కేవలం ఆకారం వల్ల వచ్చే గౌరవం అసలొక గౌరవమే కాదు. అందువల్ల మీరు యుద్ధంలో వెన్నుచూపకండి- ప్రాణం మీదికి వచ్చినా సరే, పోరాడండి. ఇక ఆలస్యం వద్దు- అందరి మనసూ ఒక్కటై నడవండి! మనదే జయం!" అన్నది. రాజు నోటినుండి ఆ మాటలు వచ్చిందే తడవు, సైన్యాధ్యక్షులు మహోత్సాహంగా కదలారు. తమ తమ సేనా సమూహాలతో సహా తక్షణం బయలుదేరి, కొండల్ని అడవుల్ని అన్నిటినీ అధిగమిస్తూ పోయారు.
ఇక అక్కడ, నెమలి రాజు చిత్రవర్ణుడి సైన్యం ప్రయాణపు బడలికతోటీ, ఆకలి దప్పులతోటీ నిజంగానే నిస్తేజమై ఉన్నది. నీరసంకొద్దీ వాటి ఒళ్ళు తూలుతున్నది. అలాంటి సమూహం మీదికి ఒక్కసారిగా ప్రళయం వచ్చినట్లు వచ్చి పడ్డాయి, హిరణ్య గర్భుడి సైన్యాలు. తమకు కనిపించిన శత్రువునల్లా రెక్కలతో పటపటా కొట్టినై; వాడియైన గోర్లతోటీ, ముక్కులతోటీ పొడిచి పీడించినై; యుద్ధరంగం అంతటా నెత్తురు మడుగులు కట్టించినై; లెక్కలేనంత మందిని తుదముట్టించినై, అవి!
ఆ విధంగా శత్రుపక్షుల ధాటికి తట్టుకోలేక నేలకూలి- యంత్రపు విడిభాగాలు విరిగి చెల్లా చెదురుగా పడి ఉన్నట్లు- చాపలు పరచినట్లు- నేలనంతటా పరచుకొని ఉన్న తన సైన్య సమూహాలను చూసి, నెమలిరాజు చిత్రవర్ణుడి మనసు దు:ఖంతో చెదరిపోయింది. ఆ బాధలో అది కొంతసేపు ప్రాణం లేని బొమ్మ మాదిరి నిశ్చేష్టం అయిపోయింది. సేవకులు సపర్యలు చేస్తే కొద్ది సేపటికి తేరుకొన్నదది. అయినా వెంటనే దారుణమైన ఆ యుద్ధంలో ఏం జరిగిందో గుర్తుకు రాగా, మరింత దు:ఖం ముంచుకొచ్చింది దానికి.
అంత జరిగాక అది అలిగి కూర్చున్న మంత్రి దూరదర్శిని చూసి "శత్రువుల వల్ల మన సైన్యానికి ఇట్లా ఎక్కడలేని ప్రమాదమూ సంభవిస్తూంటే, ఎవరో కానివాళ్ళు చూసినట్లు చూస్తూ ఊరకుండటం నీవంటి గొప్పవారికి తగునా? నువ్వు పట్టించుకోకపోవటం అనేదే పిడుగు పాటయ్యి వీళ్ళ మరణానికి కారణం అయ్యింది. ఇంత చక్కని మన సైన్యంలో శరీరానికి గాయం కాని వాడంటూ మందుకోసం వెతికినా కానరావట్లేదు.
నా అదృష్టం ఇట్లా ఉన్నప్పుడు నిన్ను ఇన్నిన్ని మాటలు అనటం తప్పు. అయినా మనం ఎంత బలవంతులం అయినా సరే, మన మనస్సులో ఒకసారి ఒక చీడపురుగు చొరబడినాక, అది అక్కడే నిలచి మనల్ని ఆటలాడిస్తుంది తప్పిస్తే, మనం దానినుండి ఎంత తప్పించుకుందామనుకున్నా పోదు. జ్ఞానవంతుడివైన నీ సలహాను పెడచెవిన పెట్టి, కరకుగా మాట్లాడినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. ఇదంతా నా పాప ఫలమే.
ఇక ఇప్పుడైనా నీ మనసులో కొంత కరుణకు చోటు ఇవ్వు. నేను ఇంతవరకూ కఠినంగా అన్న మాటలన్నీ మరచిపోయి, మళ్ళీ నన్ను చల్లగా చూడు. లేదంటావా, ఈ సైన్యాన్ని తీసుకొని వింధ్యపర్వతాలకు తిరుగు దారి పట్టు. నాదేమున్నది- దేవుడు ఎట్లా తలిస్తే అట్లా అవుతుంది నా గతి: ఇదిగో ఇక్కడ నా శరీరం ఉంది; అక్కడ వింధ్యారణ్యం ఉన్నది. అంతేకాని, నేనే రాజుగా ఉండి ఇంతమంది ఇట్లా నిష్కారణంగా నశిస్తుంటే చూస్తూ భరించలేకపోతున్నాను. కారణం అంటూ ఏదీ లేకనే ఆకాశం తూట్లు పడేట్లు సందడి చేస్తుండేది కదా మన సైన్యం? అది ఇప్పుడు నీరసించి చిటుక్కుమనక పడి ఉన్నది. పెద్ద ఊరంత ఉండే మన బలగం అంతా ఇప్పుడు చిన్న స్మశానం అంతది అయిపోయింది. ఇక చూస్తూ చూస్తూ వీళ్లను కూడా ఎలా మృత్యువు పాలు చేసేది? పుణ్యమో, పాపమో- ఇక అంతా నీ చేతుల్లో పెడుతున్నాను. తెలిసినా, తెలియకున్నా అంతా నువ్వే సర్దుకొని రావాలి. అంతులేని ఈ ఆపదలో నన్ను ముంచినా, తేల్చినా నీదే భారం" అని ప్రాధేయపడి, కరుణ పుట్టేట్లు ఏడ్చింది.
తమ రాజు ఆవిధంగా ఏడ్చేసరికి దూరదర్శి మనస్సు కరిగింది. ఇదివరకటి తన కోపం అంతా చల్లారగా, ప్రసన్నమైన చిత్తంతో అది అన్నది- "ప్రభూ! తమరి యుద్ధ పరాక్రమమూ, శౌర్యమూ అసామాన్యమైనవి. యుద్ధంలో తమరికి ఎదురొడ్డి నిలువగలవారెవరూ లేరు. అందువల్ల తమరి పరాక్రమం ఆధారంగా ఏ విధంగానైనా సరే, ఈ కోటను ఆక్రమించి, విజయులమై, అన్ని సంపదలనూ బహుమతులుగా స్వీకరించి, త్వరలోనే-తమరు చెప్పినట్లు వింధ్యారణ్యానికే- వెళ్దాం.
సుఖదు:ఖాలు రెండూ ఎంతెంతవారికీ అనుభవించక తప్పనివి కదా?! గతంలో చేసుకున్న కర్మల పర్యవసానంగా సంభవించే ఈ సుఖదు:ఖాలనుండి ఎవరుమాత్రం తప్పించుకోగలరు?
ఆయువు తీరి చనిపోయినవాళ్లకోసం దు:ఖించటం మాని, ఇప్పుడు చేయవలసిన పనిని చెయ్యండి. 'ఇప్పుడు మిగిలిన ఈ కొద్దిమంది సైనికులతో అంతులేని బల సంపన్నుడైన పగవాడిని ఎట్లా ఎదిరించను?' అని చింతించకండి. లోకంలో ఉపాయం ఉన్నవాడికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. తమరు నిజంగా తలచుకుంటే ఈ శత్రుమూకలను గెలవటం ఏమంత పెద్ద పని?!
నా సామర్ధ్యం ఎంతటిదో నేనే చెప్పుకుంటే బాగుండదు- 'ఆత్మ ప్రశంస అనర్హం' అని పెద్దలు చెబుతారు. నన్ను నేను లెక్కించుకోవటమెందుకు- నా బారిన పడ్డవాళ్ళు ఏమౌతారో ముందు ముందు మీకే తెలుస్తుంది. ఇక మిగిలిన మన వారి బలం కూడా ఏమంత తక్కువ కాదు. అంతెందుకు, తమరి బలం ఎంతటిదో తమకే తెలీదు- తమరికి కొంచెం రోషం వచ్చిందంటే చాలు- హంసలు-గింసలు తమరి ముందు ఎక్కడ నిలుస్తాయి?
అందుకని, ముందుగా మనం అందరం కలిసి కోటనుండి బయటికి వచ్చే మార్గాలను మూసేద్దాం. ఎట్లాంటివాళ్లనూ బయటికి రానివ్వద్దు- అలా కోట లోపలి వాళ్లంతా ఆకలి దప్పులతో అలమటించేట్లు చేద్దాం. ముందుగా మనవాళ్లను కోట ముఖద్వారం వద్ద మోహరిద్దాం. అటువైపునుండి రాకపోకలను నిరోధిద్దాం.
'ముందుచూపే విజయ సిద్ధికి కారణం' అని చెబుతారు- మన సేనాపతిని పిలువనంపండి; ముందుచూపుతో తంత్రం నడుపుదాం. యుద్ధరంగంలో మన ప్రతాపాన్ని చూపుదాం . ఇక గెలుపు మనదే!" అని రాజుగారి మనసుకు నచ్చేట్లు మాట్లాడింది. దాంతో రాజుగారి మనసు పొంగింది. ఉత్సాహం వెల్లివిరిసింది.
అంతలోనే ఈ సంగతి హిరణ్య గర్భుని కొలువునుకూడా చేరింది. కొంగ-ధవళాంగుడు వేగంగా తిరిగి వచ్చి, హంసరాజు హిరణ్య గర్భుడిని సందర్శించి, "ప్రభూ, ఆ నెమలి రాజు చాలా వేగంగా కోట దాపులకు చేరుకుంటున్నాడు. అదిగో, చూడండి- అతని రెక్కల మెరుపులు ఆకాశాన్నంటుతున్నాయి. తన సైన్యంలో అధిక భాగం నశించాక చివరికి ఆ రాజు తన మంత్రి గొప్పతనాన్ని గుర్తించాడు. ఇప్పుడు ఆయన్ని బ్రతిమాలి-బామాలి తిరిగి ప్రసన్నుడిని చేసుకొన్నాడు. ఆ మంత్రి సలహాలే ఊతంగా, తన సొంత బలమే ఆధారంగా విజృంభించనెంచాడు. మన కోటను ముట్టడించేందుకు బయలుదేరాడు. తమరు ఇక తక్షణం చేయవలసిన పనులమీద మనసు పెట్టాలి" అన్నది.
(మిగతా కథ మళ్ళీ....)