1919 వ సంవత్సరం.. బైశాఖీ పండుగ రోజు.. పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌లో పిల్లలు, పెద్దలు- ఆడవాళ్ళు, మగవాళ్ళు- ఊళ్ళోవాళ్ళు, బంధువులు- చాలామంది షికారుగా దగ్గర్లో ఉన్న ఓ తోటకు వెళ్ళారు. వాళ్లలో చాలా మందికి తెలీదు- బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నవాళ్ళు కొందరు ఆరోజునే, అక్కడ ఓ బహిరంగ సభ పెట్టుకున్నారని.

తోటలో ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. హటాత్తుగా బ్రిటిష్ సైనికాధికారి- 'జనరల్ డయ్యర్' అనేవాడు- పెద్ద పటాలంతో వచ్చి ఆ తోటని చుట్టుముట్టేశాడు. ఎలాంటి హెచ్చరికా లేదు- నేరుగా తుపాకీలతో కాల్పులు మొదలు పెట్టించేశాడు! మనుషుల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చి పారేశారు ఆరోజున. పారిపోయేందుకు ఎవ్వరికీ వీలవ్వలేదు- చుట్టూ ఎత్తైన గోడలు! చూస్తూ చూస్తూండగానే పది నిముషాల్లో వెయ్యిమంది చనిపోయారు. 1500మందికి పైగా గాయపడ్డారు.

డయ్యర్ అట్లా ఎందుకు చేశాడు? ఒకటి, అతనికి భారతీయులంటే కోపం. "బానిసలు నోరు మూసుకొని పడి ఉండాలిగానీ, గొడవలెందుకు చెయ్యాలి?"అని. రెండోది, మనం అనాగరికులం అని అతని నమ్మకం-"వీళ్ళంతా జంతు సమానులు: వీళ్లని ఎంతమందిని, ఏం చేసినా పాపం లేదు" అని. మూడోది, అతని పై అధికారి 'మైఖెల్ ఓడ్వయిర్' అనేవాడు అతనికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చేసి ఉన్నాడు-"నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి- ఈ భారతీయులకు బుద్ధి చెప్పు" అని. ఇక నాలుగోది, అతను నిజంగానే నిర్దయుడు: తర్వాత 'ఇట్లా ఎందుకు చేశావయ్యా?' అని అడిగితే "గోలీలు ఐపోయినైగాని, లేకపోతే అక్కడికి చేరిన ఇరవైవేలమందినీ ఖతం చేసి ఉందును" అన్నాడట అతను!

ఈ కాల్పుల సంగతి తెలియగానే భారతదేశం మొత్తం భగ్గుమన్నది. బందులు, ధర్నాలు, రాజకీయాలు... బ్రిటిష్ పార్లమెంటు వరకూ చర్చలు జరిగాయి. బ్రిటన్ ప్రధాని మటుకు ఏమీ మాట్లాడలేదు. డయ్యర్‌ని, మైఖెల్ ఓడ్వయర్ ని ఇద్దరినీ లండన్ పిలిపించుకున్నారు. వాళ్ళకి హీరోలకి తగినట్లు సన్మానాలు చేశారు. ఓడ్వయర్‌కైతే మరింత పెద్ద పదవి ఇచ్చారు!

"మన దేశం బానిసత్వంలో ఉండేది" అంటే అర్థం అదీ: బ్రిటిష్ వాళ్ళు ఏదనుకుంటే అది చేశారు, మనతో.

ఇదంతా జరిగి చాలా ఏళ్లయింది కదా, ఇప్పుడు మనకెవరికీ ఆ సంగతులు అంత బాగా గుర్తు లేవు. అందుకనే, మనం ఇప్పుడు అంత సులభంగా "రండి! పెట్టుబడులు పెట్టండి!" అని విదేశీయుల్ని చవకగా ఆహ్వానించగల్గుతున్నాం. వేరే దేశాల భాషల్నే నేర్చుకుంటున్నాం, వాళ్లనే అనుకరిస్తున్నాం, వాళ్ల అలవాట్లనే చేసుకుంటున్నాం.

అయితే ఆ రోజుల్లో అట్లా లేరు అందరూ- జలియాఁవాలా బాగ్ సంఘటన జరిగినప్పుడు 'ఉధంసింగ్' అనే కుర్రవాడికి ఇరవయ్యేళ్ళు- అక్కడ చేరిన జనాలకి మంచినీళ్ళు అందిస్తున్నాడు అతను. అంతలో కాల్పులు జరిగాయి. అతని చుట్టూ ఉన్నవాళ్లంతా చనిపోయారు. వాళ్ళ చాటున నక్కి, ఇతను తన ప్రాణాలు కాపాడుకున్నాడు. జలియాఁవాలా బాగ్ గురించి ఎవ్వరూ ఏమీ చేయట్లేదని అతను ఉడికి పోయాడు. జరిగినదాన్ని అందరూ తీసుకున్నంత తేలికగా తీసుకోలేకపోయాడు అతను. తననీ తన తోటివాళ్లనీ ఇట్లా చేసిన డయ్యర్‌నీ, ఓడ్వయర్‌నీ వదలకూడదని నిశ్చయించుకున్నాడు- అట్లా ఒకటి కాదు- రెండు కాదు- ఇరవై ఒక్క సంవత్సరాలపాటు రగిలాడు. చివరికి 1940లో మారు వేషం వేసుకొని, లండన్ వెళ్ళి, అక్కడ మైఖెల్ ఓడ్వయర్‌ని నిండు సభలో తుపాకీతో కాల్చి చంపాడు.

ఇరవయ్యేళ్ళ కుర్రాడు ఇరవయ్యొక్క ఏళ్లపాటు నిరంతరం అసహ్యించుకోగలిగిన పరిస్థితులు, అవి!

ఉధం సింగ్ అట్లా ఎందుకు చేశాడు? ఉరికంబం ఎక్కుతూ తనే స్వయంగా చెప్పాడు-"ఓడ్వయర్ నేరం చేశాడు. నా దేశ ప్రజల ఆత్మను అణచివేసేందుకు ప్రయత్నించాడు. 21సంవత్సరాలపాటు నేను తపించింది అందుకే- ఇన్నాళ్లకైనా నా ఆశయాన్ని నెరవేర్చుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నాకు చావంటే భయం లేదు. దేశంకోసం మరణిస్తున్నందుకు నేను గర్విస్తున్నాను. బ్రిటిష్ పాలనలో నా దేశ ప్రజలు ఎందరో దరిద్రంలో మగ్గారు. వారందరి తరపునా ఇది నా నిరసన. ఇట్లా చెయ్యటం నాధర్మం" అని!

మన దేశానికి స్వాతంత్ర్యం ఊరికే రాలేదు- ఎందరో ఉధం సింగులు, సుభాస్ చంద్రబోసులు, భగత్ సింగులు ఎక్కడికక్కడ ఆయుధాలతో దుమారాలు లేపితే వచ్చింది; గాంధీలు, తిలక్‌లు, ఆజాద్‌లు, గఫార్‌ఖాన్‌లు జనాల్ని కూడగట్టి అల్లరి చేస్తే వచ్చింది. భారతీయులందరూ ఒక్క గొంతుతో "మీరు ఒద్దు- పోండి!" అని గట్టిగా అరిస్తే తప్ప రాలేదు, స్వాతంత్ర్యం!

అట్లా వచ్చిన స్వాతంత్ర్యం మనకు తెలీకుండానే మన వేళ్ల సందుల్లోంచి జారిపోతే ఎలా? అంతమంది త్యాగధనుల కృషిఫలం కదా, ఇది?! దీన్ని మనం చేతులారా మళ్ళీ ఎవరికో అప్పచెప్పేస్తామేమో, జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మన దేశం గురించి మనం‌ బాగా తెలుసుకోవాలి. మన సంస్కృతిని అర్థం చేసుకోవాలి. చరిత్రని గుర్తు చేసుకుంటూ ఉండాలి. స్వాతంత్ర్యాన్ని నిలుపుకోవాలి.

స్వతంత్రంగా ఆలోచిద్దాం! బాధ్యతతో నడచుకుందాం!!

స్వాతంత్ర్యదినోత్సవ అభినందనలతో,
కొత్తపల్లి బృందం.