సున్నాల సంబరం!
వెంగళప్ప: వందలో ఎన్నిసున్నాలుంటాయి?
రవి: రెండు.
వెంగళప్ప: కాదు- ఒకటే! వ ప్రక్కన ఉండేది ఒకటే సున్న!
నాకు తెలీదు!
ఉపాధ్యాయుడు: కోతి చెట్టుమీదికి ఎలా ఎక్కుతుంది, చెప్పు?
విద్యార్థి: నాకు తెలియదు సార్! అయితే ఈ ప్రశ్నకు జవాబు ఎవరికితెలుస్తుందో నాకు తెలుసు!
ఉపాధ్యాయుడు (నవ్వుతూ): అవునా?! ఎవరికి తెలుస్తుందో చెప్పు?
విద్యార్థి: కోతికి...!
ఎవరిది?!
రవి: గడియారం చాలాబాగుంది. ఫారిన్ దా?
వెంగళప్ప: కాదు నాదే ...!
విదేశ గమనం!
రవి: మాచెల్లి పుట్టిన రోజు బహుమతిగా నేను ప్రపంచ పటం ఒకటి కొనివ్వాలి.
సోము: ప్రపంచ పటమా?! అదే ఎందుకు?
రవి: మా చెల్లికి దేశ విదేశాలు చూడాలని ఉన్నదట, మరి!
చిట్టి తల్లి!
చిట్టి: అమ్మా! ఇవాళ్ళ బళ్ళో ఓ చిన్న పాప పడిపోతే అందరూ నవ్వారు.
అమ్మ: అయ్యో, అట్లా నవ్వకూడదమ్మా, తప్పు.
చిట్టి: నేను అస్సలు నవ్వలేదమ్మా!
అమ్మ: అవునా, నువ్వు చాలా మంచి పాపవి. నువ్వెందుకు నవ్వలేదో చెప్పు!
చిట్టి: క్రిందపడింది నేనే కదా, అందుకని!
దోమలకి క్రీం!
చిట్టి : దోమలు కుట్టకుండా ఉండేందుకు ఏదో దోమల క్రీం ఉంటుందట కదమ్మా?!
అమ్మ: అవును చిట్టీ! ఓడోమాస్ అని..
చిట్టి: మరి ఆ క్రీం రాసేందుకు ఒక్కొక్క దోమనూ ఎట్లా పట్టుకుంటారమ్మా?!
చిన్ని చిన్ని ఆశ!
సూరజ్: అమ్మా, మనం కూడా వినీష్ వాళ్ల లాగా ఓ టివి కొనుక్కుందామమ్మా!
అమ్మ: వాళ్ల నాన్న పెద్ద ఉద్యోగి. వాళ్లకయితే ఇంట్లోనే డబ్బులు కాస్తాయి, మనకు కాయవు కదా, నాయనా?
సూరజ్: ఏమీ పర్లేదమ్మా, వాళ్ల చెట్టుకు అంటు కట్టుకుందాంలే, మనమున్నూ!
దూరం!
టీచర్: పేదవాళ్ల గురించి నీకేం తెలుసో చెప్పు, రతన్?
రతన్: పేదవాళ్ళు చాలా పేదగా ఉంటారు. వాళ్ల బంగళాలు చిన్నగా ఉంటాయి. వాళ్ల కార్లు సరిగా నడవ్వు. వాళ్ల ఫ్రిజ్జులు త్వరగా పాడవుతుంటాయి. వాళ్ల పనివాళ్ళు సరిగా పని చెయ్యరు...
నిద్ర-నడక!
డాక్టర్: అరోగ్యం కోసం రోజూ నడక అలవాటుచేసుకో
రోగి: నాకు నిద్రలోనడిచే అలవాటుంది. అది సరిపోతుందా డాక్టర్?
పిచ్చి ముదిరింది!
రాము: రోగం నయం అయ్యిందా? ఆస్పత్రినుండి ఎప్పుడొచ్చావ్?
సోము: రేపువచ్చా.., నిన్న మళ్ళీ వెళ్తా!
చవకవుతున్నాయి!
రోగి: ఎంత ప్రయత్నించినా పొగ త్రాగటం మటుకు మానలేకపోతున్నాను డాక్టర్!
డాక్టర్: పర్లేదులెండి! త్వరలో క్యాన్సర్ మందుల ధరలు తగ్గబోతున్నాయట... !