అనగా అనగా ఓలిగ అనే రాజ్యం ఒకటి ఉండేది. ఆ రాజ్యాన్ని బాదుషా అనే నవాబు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన రాణి జిలేబి. వాళ్లకొక అందాల కుమార్తె: పేరు గులాబ్‌జాం.
గులాబ్‌జాం పూతరేకులంత సున్నితంగాను, కోవా అంత కోమలంగాను, పెరుగుపచ్చడి అంత తెల్లగాను ఉండేది. ఆమె మందిరానికి గులాబీల గోడలుండేవి. అయితే అక్కడికి దారి కనుక్కోవటమే కష్టం. అది కారప్పూస లాగా గందరగోళంగా ఉండేది. ఆ దారికి దధ్యోదనం కాపలా ఉంటాడు. మందిరానికి తాటికాయ తాళంకూడా వేసి ఉండేది.
ఓలిగ రాజ్యమంతా మైసూర్‌పాక్ మంత్రిగారి సలహాల కారణంగా, సుభిక్షంగా ఉంది. అయితే ఒక రోజున వడ, ఆవడ అనే ఇద్దరు దొంగలు జంతికలు అనే పడవనెక్కి, నూనె అనే నదిని దాటి, కాజాలతో తెడ్డు వేసుకుంటూ వచ్చారు- వచ్చి, కారప్పూస భవనం ముందు పడి మొద్దు నిద్రపోతున్న దధ్యోదనాన్ని చూసి నవ్వుకున్నారు. మురుకుల బీగాలతో తాటికాయ తాళాన్ని తీసేందుకు ప్రయత్నించి, అది తెరుచుకోకపోయే సరికి, గులాబీల గోడకు కజ్జికాయంత కన్నం వేసి చివరికి ఎలాగో ఒకలాగా గులాబ్‌జాం ని ఎత్తుకుపోయారు.
దీన్నంతా చూస్తున్న చిత్రాన్నం మటుకు చిత్రంగా గమ్మున ఊరుకుండిపోయింది!
ఇట్లా అయ్యేసరికి రాజ్యమంతా చింతపులుసంత చింతాక్రాంతమైంది. గులాబ్‌జాంను విడిపించుకొచ్చినవాళ్లకు ఓలిగ రాజ్యంతో పాటు గులాబ్‌జాం కూడా దక్కుతుందని నవాబుగారు అప్పడం మీద డప్పు కొట్టించి చాటించారు.
కుడుము అనే యువకుడొకడు ఈ వార్తను విన్నాడు. వినగానే అతను టమేటాబాత్ లాగా ఎర్రబారాడు. దోసెల వల వేసి, నూనె మీదుగా పారిపోతున్న వడనీ, ఆవడనీ పట్టి బంధించాడు.
గులాబ్‌జాంతో కలిసి జాంగిరీలా దర్బారుకు వచ్చి, నవాబుకు వాంగీబాత్ లాగా వంగి నమస్కరించాడు. బాదుషా నవాబు వడనీ ఆవడనీ తినెయ్యమని ఆజ్ఞాపించి, గులాబ్‌జామును కుడుముకు జత చేశాడు. ఇంకేముంది, రాజ్యమంతా రసగుల్లాలతో పండగ చేసుకున్నది!