మగధ రాజ్యాన్ని ప్రసేనుడు పాలించే కాలంలో వరహాలయ్య అనే వర్తకుడు ఒకడు ఉండేవాడు. అతనికి ఎన్నో వ్యాపారాలు ఉండేవి. సింహళ దేశంతో పాటు పలు దేశాలకు సుగంధ ద్రవ్యాలు ఎగుమతి చేయడం వాటిలో ప్రధానమైంది. తను సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని దాన ధర్మాలకోసం వినియోగించేవాడు వరహాలయ్య. వ్యాపారం కూడా ధర్మంగా చేసే వాడు; దాంతో అతనికి చక్కని లాభాలతో పాటు, మంచివాడనే పేరుకూడా వచ్చింది.
అలా కొన్నాళ్ళు గడచిన తరువాత, అకస్మాత్తుగా అతనికి జబ్బు చేసింది. ఎందరో వైద్యులు పరీక్షించి మందులు ఇచ్చారు; కానీ జబ్బు తగ్గలేదు. ఇక తనకు రోజులు సమీపించాయని అర్ధమైంది వరహలయ్యకు . వెంటనే కబురుపంపి, కాశీలో విద్యను అభ్యసిస్తున్న తన ఒక్కగానొక్క కుమారుడు రామయ్యను హుటాహుటిన రప్పించాడు. తండ్రికి తగిన కొడుకు రామయ్య. అందరితోటీ స్నేహభావంతో మెలిగేవాడు. కబురు అందగానే ఆఘమేఘాలపైన ఇంటిదగ్గర వాలాడు. మంచంమీద ఉన్న తండ్రిని చూసి తట్టుకోలేక పోయాడు.దుఖం పొంగుకొచ్చింది. కానీ తనను తాను సంభాలించుకున్నాడు. కర్తవ్యం కళ్ళముందు కనిపించింది. చనిపోయే ముందు తండ్రి చెప్పిన విషయాలు స్థూలంగా, ఇవి:
"బాగా లాభసాటిగా ఉండే సుగంధ ద్రవ్యాల ఎగుమతి వ్యాపారం విడిచి పెట్టద్దు. పేదలను దోచుకొని డబ్బు సంపాదించడం తప్పు. సంపాదించిన దాంట్లో కొంత శాతం తప్పనిసరిగా పేదలకు దానం చెయ్యాలి. తూర్పున ఉన్న దేశంతో వ్యాపారం వద్దు".
తెలివైనవాడు కావడంతో తండ్రి చెప్పిన విషయాలను త్వరగానే ఆకళింపు చేసుకున్నాడు రామయ్య. నాలుగు సలహాలనూ ఆచరణలో పెట్టాడు. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లసాగింది. తండ్రి అప్పగించిన వ్యాపారం త్వరలోనే పది రెట్లయింది. ఆయన సలహా ప్రకారమే బీద సాదలకు చేదోడు వాదోడుగా ఉంటూ 'తండ్రికి తగిన కొడుకు'అనిపించుకున్నాడతను.
అయినా ఒక విషయంలో మాత్రం సంతృప్తి గా లేదు అతనికి- "తండ్రి చనిపోతూ 'తూర్పు దేశంతో వ్యాపారం చెయ్యొద్దు' అని ఎందుకు అన్నాడు?"
తూర్పు దేశం గురించి వాకబు చేసి చూసాడు రామయ్య. కానీ సరైన సమాచారం ఎవ్వరూ ఇవ్వలేదు. దాంతో అతని అసంతృప్తి రోజురోజుకీ మరింత ఎక్కువయింది. ఇక లాభం లేదని, మంచి రోజు చూసుకొని ఓడ నిండా సరుకులు నింపుకొని బయలుదేరాడు.
కొద్ది రోజులు ప్రయాణించాక ఓడ తూర్పు దేశం చేరుకున్నది. సామాన్లు ఇంకా క్రిందికి దింపకనే నగరంలోకి వెళ్ళి అంతటా తిరిగి చూశాడు రామయ్య. ఎక్కడా ఏదీఅంత తేడాగా ఏమీ అనిపించలేదు. అంతా బాగానే వున్నట్టు తోచింది. భయ పడాల్సిన అవసరం కనపడలేదు. సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేసే వర్తకులు ఎక్కడ ఉన్నారో వాకబు చేసి, వాళ్లను కలుసుకొని తన సరుకు నమూనాలను చూపించి మంచి బేరం కుదుర్చుకున్నాడు. సరుకు మొత్తం అమ్ముడయింది; మంచి లాభం కూడా వచ్చినట్లయింది.
ఆ వర్తకులందరూ కూడా చక్కగా, మర్యాదగా, స్నేహంగా మెసిలారు. ఒప్పందాలన్నీ పూర్తయాక, తమతో పాటు భోజనం చేసిగానీ వెళ్ళటానికి వీల్లేదని పట్టుబట్టారు అందరూ. వాళ్ళు అంతగా అభ్యర్థించేసరికి రామయ్య కూడా కాదనలేక పోయాడు. ఐతే 'మాంసాహార విందుకు అవసరమైన కోడి, చేపలు కొనుక్కొచ్చే బాధ్యత మటుకు నాదే' అని వాళ్ళని ఒప్పించాడు. ఆవిధంగా రామయ్య స్వయంగా బజారుకు వెళ్ళి కొనుక్కొచ్చిన కోడి, చేపలతో విందు భోజనం ముగిసింది.
ఐతే ఇటు విందు ఇంకా ముగిసిందో,లేదో- అటు రాజ భటులు వచ్చేసి రామయ్యను చుట్టుముట్టారు. క్షణాల్లో రామయ్యను ఖైదు చేసి చెరసాలలో బంధించారు! ఏమవుతోందో అర్ధమయ్యే లోపలే యిదంతా జరిగిపోయింది.
మరుసటి రోజున రాజుగారి ముందు ప్రవేశ పెట్టారు అతన్ని . రామయ్య పై హత్యానేరం మోపబడింది! రామయ్యకు మతి పోయినట్లయింది. "నాకేమీ తెలియదు;నేను అమాయకుడిని" అని మొత్తుకున్నాడు.
కానీ "సాక్ష్యాలన్నీ మరొకలా ఉంటే నువ్వు అట్లా అంటావేమిటి? నోరు మూసుకో!" అని హుంకరించారు మంత్రిగారు.
"ఇంతకీ నేను ఎవరిని చంపాను? నాపైన ఈ ఆరోపణ చేసిందెవరు?" అడిగాడు రామయ్య.
అప్పుడు తెలిసింది- తనకు కోడిని,చేపని అమ్మిన దుకాణపు యజమానే, తనపై ఈ హత్యా నేరాన్ని మోపాడు. రామయ్య తన తల్లిని, తండ్రిని హత్య చేసాడని అతని ఆరోపణ! అతను రామయ్యకు కోడిని,చేపను తినేందుకు అమ్మలేదు; కేవలం పెంచుకునేందుకు ఇచ్చాడట- అంతే. 'ఆ కోడి, చేప పూర్వ జన్మలో అతని తల్లిదండ్రులు. వాటిని అతను ఇంతకాలమూ ఎంతో ప్రేమగా పెంచుకుంటూ వస్తున్నాడు. అట్లాంటి తన తల్లి తండ్రులను ఈ రామయ్య వండుకొని తిన్నాడు! అతి క్రూరంగా హత్య చేసాడు!' అని సభలో ఆరోపిస్తుంటే విని, రామయ్య నిశ్చేష్టుడైపోయాడు.
'కోడేమిటి, చేపేమిటి, పూర్వజన్మలో తల్లిదండ్రులవ్వటం ఏమిటి, ఈ జన్మలో పెంచుకోవటం ఏమిటి, అంతా మోసం, ఇదంతా ఒక కుట్ర- ఇందులో దుకాణపు యజమాని ఒక్కడే కాదు; తననుండి సరుకులు కొన్న వర్తకులకు కూడా హస్తముంది!' అని రామయ్య మనసు ఆక్రోశించింది. అయితే బయటికి
ఏమనాలో అతనికి అర్ధం కాలేదు. ఏమంటే ఏమవుతుందో తెలీదు. 'అన్యాయంగా తను ఇక్కడ ఇరుక్కున్నాడు- అందుకేనేమో, తన తండ్రి ఈ దేశంతో వ్యాపారం వద్దన్నది! ఈ వ్యాపారస్తుల ఎత్తుగడలు తన తండ్రికి తెలుసు! తను ఇప్పుడు ఏం చేయగలడు? అయినా ఇంకా రాజుగారు ఏమీ అనలేదు కదా? ఆయనైనా న్యాయం చేస్తారేమో' అని ఆశగా ఎదురుచూశాడు కొంతసేపు.
కానీ ఆ దేశపు రాజుగారు మహా మూర్ఖుడు. తన దేశపు వ్యాపారుల మోసాలకు వత్తాసు పలకటం తప్ప, అతని మనసులో న్యాయం, ధర్మం లాంటివి ఏమీ లేవు. కొద్ది సేపట్లోనే ఆయన నిర్ణయించేశాడు- "ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు- హత్య విషయం స్పష్టం గా ఉంది. నిందితుడికి శిక్ష తప్పదు" అని!
ఇట్లాంటి సందర్భాలలో దేశపు ఆచారం ఒకటున్నది- దాని ప్రకారం 'తల్లిదండ్రులను కోల్పోయిన దుకాణదారు చాలా దు:ఖంలో ఉంటాడుకదా, అందుకని ఆ హత్య చేసిన రామయ్య ఏదో ఒక విధంగా దుకాణదారును సంతోషపెట్టాలి. అట్లా అతను సంతోషపెట్టగల్గితే సరి- లేదా అతనికి మరణశిక్ష తప్పదు'.
రాజుగారు దుకాణ దారును అడిగారు- "నీకు దు:ఖంగా ఉందా?" అని.
"అవును ప్రభూ, విపరీతమైన దు:ఖం!" అన్నాడు వాడు, దైన్యం నిండిన ముఖంతో.
రామయ్య దుకాణదారును అనేక విధాలుగా ప్రార్థించాడు. దయచూడమన్నాడు. అయినా వాడి మనసు ఏమాత్రం కరగలేదు.
"నాకు ఇంకా చాలా దు:ఖంగా ఉంది" అనే అంటూ వచ్చాడు వాడు.
చివరికి తను ఆ దేశంలో సంపాదించుకున్న సొమ్ము మొత్తాన్నీ ఇవ్వజూపాడు రామయ్య.
అయినా కొట్టు యజమాని తనకు సంతోషం కలగలేదన్నాడు.
"ఎన్నో సంవత్సరాలు నీకు కట్టు బానిసలా పనిచేస్తాను" అని వాగ్దానం చేసాడు రామయ్య.
దుకాణదారు కరగలేదు.
"నా వంటి మీద ఉన్న ఆభరణాలన్నీ సమర్పించుకుంటాను" అన్నాడు. అయినా ఫలితం దక్కలేదు.
ఏం చెయ్యాలో అర్ధం కాలేదు రామయ్యకు. ఆ దుర్మార్గుడి మనసును కరిగించమని ముక్కోటి దేవుళ్ళకూ మొక్కుకున్నాడు.
అయినా దేవతలు ఎవ్వరూ ప్రత్యక్షం అవ్వలేదు.
అంతలో రాజు గారి కొడుకు, పది సంవత్సరాలవాడు- ఎక్కడినుండో ఊడి పడ్డాడు. ఒక్కసారిగా అక్కడి వాతావరణం అంతా తేలిక పడ్డట్లయింది. చిలిపిగా నవ్వుతూ, సంతోషంగా గంతులువేస్తూ రాజకుమారుడు సింహాసనం ఎక్కి తండ్రి ఒడిలో కూర్చున్నాడు. రాజుగారి మెడలోని ముత్యాల దండని పట్టుకొని లాగటం మొదలు పెట్టాడు.
వెంటనే అవకాశాన్ని దొరకబుచ్చుకున్నాడు రామయ్య. తన మెడలో ఉన్న వజ్రాల హారాన్ని తీసి చటుక్కున రాజకుమారుని మెడలో వేసాడు. రాజకుమారుడు ఆ హారాన్ని చూసుకొని మురిసిపోయాడు. సభికులందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు. తన ఎదురుగా ఉన్న దుకాణదారునే చూస్తున్నాడు రామయ్య . వాడు కూడా సంతోషంగా నవ్వుతున్నాడిప్పుడు. వెంటనే "ఏమయ్యా, ఇప్పుడు నీకు సంతోషం కలిగిందా?" అని సూటిగా ప్రశ్నించాడు రామయ్య, అతన్ని.
హటాత్ పరిణామంతో ఖంగు తిన్నాడు కొట్టు యజమాని. అతని నోట్లో పచ్చి వెలగ కాయ పడినట్లు అయింది. 'కాదు-సంతోషంగా లేను'అంటే రాజుగారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది; మరి 'ఔను-సంతోషంగా ఉన్నాను' అంటే రామయ్య రూపంలో దొరికిన బంగారు బాతు చేజారి పోతుంది : ఏం చెయ్యాలో పాలుపోక ఊరికే నిల్చుండిపోయాడతను. పరిస్థితి తనకు అనుకూలంగా మారిందని గమనించిన రామయ్య అదే ప్రశ్నను మళ్ళీ మళ్ళీ రెట్టించి అడిగాడు . చివరికి వాడికి ఒప్పుకోక తప్పలేదు: 'తను చాలా సంతోషించాడు' అని ఒప్పేసుకున్నాడు.
'బ్రతుకు జీవుడా' అని బయట పడ్డ రామయ్య, అందరికీ నమస్కారాలు పెట్టుకొని, చటుక్కున ఓడ ఎక్కి తన స్వస్థలానికి బయలుదేరి పోయాడు.
అతను ఇక జన్మలో మళ్ళీ తూర్పు దేశం మాట ఎత్తితే ఒట్టు .