గీతమ్మ పెద్దదైంది. కొడుకులు కోడళ్ళు అందరూ ఎక్కడో దూరంగా ఉంటారు. తను మాత్రం పల్లెలోనే, ఒంటరిగా ఉంటోంది. ఆమెది స్వతంత్ర చిత్తం- అన్ని పనులూ సొంతగా చేసుకొని, అట్లాగే అలవాటైంది- వేరేగా పనివాళ్ళనిగానీ, కనీసం తోడుగాగానీ ఎవ్వరినీ‌పెట్టుకోలేదు. ఊళ్ళోవాళ్ళు చాలామంది ఆమెని 'పిసినారి గీతమ్మ' అంటారు. 'పనికి కూలోళ్ళని కూడా‌ పెట్టుకోదు- ఒట్టి పిసినిగొట్టు' అనుకుంటారు. కానీ అసలు సంగతి ఏంటంటే, గీతమ్మకు తన పనులు తను చేసుకోవటం ఇష్టం; ఒంటరిగా ఉండటమూ ఇష్టం. ఆమె ఉండే ఇల్లు ఊళ్ళో ఇళ్ళన్నిటికీ దూరంగా, విసిరేసినట్లు ఉంటుంది. తన ఆ ఇల్లంటే గీతమ్మకు చాలా చాలా ఇష్టం. పట్నపు ఇళ్ళలోని రొద ఆ ఇంట్లో ఉండదు- ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది.

ఒక రోజు రాత్రి పరిస్థితి మారింది. ఇంకా తెల్లవారకనే గీతమ్మకు మెలకువ వచ్చింది: ఇంటి ముందు నిలబడి ఎవరో మనుషులు మాట్లాడుతున్నారు. "ఎవరో ఊళ్ళోవాళ్ళే అయిఉంటారు- ఏ కోడో, ఆవుదూడో తప్పించుకొని వచ్చి ఉంటుంది; ఇప్పుడు ఆ వంకన నన్ను తిడతారు" అనుకొని మెల్లగా కిటికీలోంచి తొంగి చూసిందామె.

ఇంటి బయట పెరట్లో నిలబడి మాట్లాడుకుంటున్నారు, ఓ ఐదారుగురు మనుషులు. చీకట్లో వాళ్ళ నీడలు పొడుగ్గా, భయం గొల్పుతూ ఉన్నాయి. ఎవరో ఈ ప్రాంతం వాళ్ళలాగానైతే లేరు- గొంతులు తగ్గించి మెల్లగా మాట్లాడుకుంటున్నారు. గీతమ్మ కొంచెం సేపు చెవులు రిక్కించి వాళ్ళేం‌ అనుకుంటున్నదీ విన్నది- అప్పుడర్థం అయ్యిందామెకు- "తన ఇంటి ముందున్నది ఓ బందిపోటు దొంగల గుంపు! 'ఈ ఇంట్లో ఎవరూ లేరు'అనే సంగతి వాళ్లకు చాలా నచ్చింది! ఇప్పుడు ఇంట్లోకి జొరబడి, ఏది కనిపిస్తే దాన్ని ఎత్తుకు పోదామను-కుంటున్నారు! వాళ్ళ మొరటు బలం ముందు తను ఏపాటి?! తన నగలూ, వస్తువులూ అన్నీ ఇక వాళ్ల పరం కానున్నాయి- తను రేపు పొద్దుటివరకూ ప్రాణాలతో మిగిలితే అదే పదివేలు!"

"చూశారుగా, ఇంట్లో సద్దన్నదే లేదు- ఒక్క నరమానవుడు కూడా లేడు ఇంట్లో- పదండి- ఇంటి తలుపులు పగలగొట్టండి- అంతా మనదే!" అంటున్నాడొక దొంగ ఉత్సాహంగా.

మిగిలిన దొంగలంతా అతనితోటి ఏకీభవించారు. "అవునవును. ఇళ్ళు మరీ ఇంత సులభంగా దొరికితే బాగుండవు- అస్సలు మజా రాదు- ఈ ఇల్లు ఊరికి ఎంత దూరంగా ఉందో చూడండి- మనం దీన్ని దోచేసిన సంగతి కూడా ఎవ్వరికీ తెలీకపోవచ్చు, ఓ వారం-పది రోజులు!" అన్నాడింకొకడు.

వాళ్ల మాటలు వింటున్న గీతమ్మకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. భయంతో ఆమె గుండె జారిపోయింది. శరీరం వణికింది. "వీళ్ళు ఏ క్షణంలోనైనా ఇంట్లోకి వచ్చేస్తారు- ఇంట్లో తను ఎదురైందంటే అప్పటికప్పుడు చంపేస్తారు-ఖాయం" అనిపించి ఏడుపొచ్చింది. ఒక్క క్షణంపాటు 'ఇంటిని ఇట్లా మరీ ఒంటరిగా కట్టుకొని తను పెద్ద తప్పే చేసిందేమో' అనుకున్నది. 'తనకే ఓ‌ పెద్ద కుటుంబం ఉంటే ఎంత బాగుండేది, ఇల్లంతా సందడిగా, గొడవ గొడవగా?! దొంగలూ-గింగలూ ఈ ఇంటి దాపుల్లోకి కూడా వచ్చేందుకు భయపడేవాళ్ళు !'

అకస్మాత్తుగా ఆమెకో ఉపాయం తట్టింది. తనకు 'కుటుంబం' అంటూ ఏదీ లేదు కానీ, నిజానికి తను ఏమంత ఒంటరిది కూడా కాదు! ఆమె వంటింట్లోకి పరుగెత్తి, చేతికందిన గిన్నెలు, తప్పాలలు, తట్టలు - అన్నీ ముందు గదిలోకి తెచ్చి పెట్టుకున్నది. వెంటనే పెద్ద గొంతుతో ఆ పాత్రలనే అరవటం మొదలు పెట్టింది-మనుషులను అరిచినట్లు:

"ఒరే, లోటే! ఎన్ని సార్లు చెప్పాలిరా? లే! లేచి చదువుకో!!
ఏయ్- తట్టేయ్! ఏంటిరా, నీ‌ మొద్దు నిద్ర?! పరీక్షల సమయంలో‌ ఇట్లానట్రా, చదివేది?!లే!
అబ్బ! ఈ తప్పేలగాడికి ఒళ్ళు పెరిగింది గానీ, మెదడు ఏమాత్రం పెరగలేదు! లేరా! లేచి చదువు! లేండి!"
అయ్యయ్యో! వీళ్ళు పదిమందీ నా ప్రాణానికి ఇట్లా చుట్టుకున్నారే! ఒక్కడూ సరిగ్గా చదివి చావడు! లేవండి లేవండి!‌ మిమ్మల్ని నిద్ర లేపే సరికే నా తల ప్రాణం తోకకొస్తోంది- లేవండిరా!‌లేవమంటుంటే-!" అంటూ ఆమె చేతికందిన కట్టెతో లోటాలను, తప్పేలలను, తట్టలను ధనధనలాడించటం మొదలు పెట్టింది.

"లేవండి!‌ లేవండి! చూసిన వాళ్ళు ఏమనుకుంటారు?! ఇది ఇల్లా, స్మశానమా? చప్పుళ్ళే లేకుండా- లేచి గట్టిగా చదవాలి! చదవండి!" అంటూ ఆమె పాత్రల్ని గడగడలాడిస్తుంటే, బయట దొంగలందరూ ఒక్కసారిగా దడదడలాడిపోయారు:

"మన లెక్క ఎక్కడో తప్పినట్లుందిరా!" అన్నాడొక దొంగ.
"ఎవ్వరూ లేరనుకున్నాం! ఇంటినిండా మనుషులేరా!" అన్నాడింకొకడు.
"పదండి! పరుగు పెట్టండి!‌ వాళ్ళు బయటికి వచ్చారంటే చచ్చామే!" అరిచాడింకోడు.

దొంగలంతా ఒక్క సారిగా కాళ్లకు బుద్ధి చెప్పారు. వాళ్ల కంగారులో వాళ్ళు తమ వెంట తీసుకొచ్చిన నగల మూటను కూడా మరచిపోయారు!

మరునాడు గీతమ్మ తలుపు తెరిచి చూసేసరికి, ఇంటి వాకిలికి ఎదురుగా ఓ పెద్ద గోతం సంచీ నిండుగా నగలు, బంగారం, డబ్బు! ఆమె తన కళ్లను తాను నమ్మలేకపోయింది.

గోతం సంచీని ఇంట్లోకి లాక్కెళ్తూ "ఓయ్! తట్టోయ్! లోటోయ్! తప్పేలోయ్! రండి!‌చూడండి, మనకోసం దొంగలు ఏం వదిలి వెళ్ళారో!" అని అరిచింది సంతోషంగా.

ఆరోజు నుండీ ఆమె ఊళ్ళో మనుషుల్ని ఇద్దరిని పనికి, తోడుకు పెట్టుకున్నదని వేరే చెప్పక్కర్లేదుగా?!