అనగా అనగా ఉయ్యూరులో రమేష్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి సంగీతం అంటే చాలా ఇష్టం. అయితే వాళ్ళ అమ్మానాన్నలకి మటుకు సంగీతం అంటే అస్సలు ఇష్టం లేదు. వాళ్ళకి వాడు ఇంజనీరు అవ్వాలని ఉండేది. 'ఇంజనీరు అవ్వాలంటే ఇట్లాంటివి పెట్టుకోకూడదు' అని వాళ్ళ నమ్మకం. ఒకసారి రమేష్ వాళ్ల నాన్నతో అన్నాడు- "నాన్నా, నేను... సింగర్ అవ్వాలను-కుంటున్నాను.." అని. వాళ్ల నాన్నకు వెంటనే కోపం వచ్చేసింది- "ఏమీ అక్కర్లేదు. నువ్వు ఇంజనీర్ అయితీరాలి" అని గట్టిగా అరిచాడు. పాపం రమేష్ వేరే గదిలోకి వెళ్ళి కూర్చొని బాగా ఏడ్చాడు.

అయితే అతను బాగా చదవటంలేదని, వాళ్ల అమ్మానాన్నలు అతన్ని వేరే ఊరిలో ఉన్న పెద్ద బడిలో చేర్పించారు. రమేష్ ఇప్పుడు హాస్టల్‌లో ఉంటూ చదువుతున్నాడు. హాస్టల్‌లో భోజనం రుచిగా లేక కొంచెం, పాఠాలు అర్థం కాక కొంచెం, ఇంకా సంగీతం ఉండక కొంచెం- అతను సరిగా చదవటం మానేశాడు. వెనకబడటం మొదలు పెట్టాడు. తమ ఊళ్ళో ఎప్పుడూ తరగతి ఫస్టు వచ్చే రమేష్‌కి ఇప్పుడు బడిలో 'సి' గ్రేడు కూడా రాసాగింది.

అయితే కొద్ది రోజులకు వాళ్ల బడిలో ఓ పాటల పోటీ పెట్టారు. రమేష్ అందులో పాల్గొని ఎంతో చక్కగా పాడాడు. వాళ్ల టీచర్లందరూ అతన్ని మెచ్చుకొని, 'నువ్వు ఇంకా బాగా సాధన చెయ్యాలి' అని ఉత్సాహ పరచారు. అంతే, ఇక ఆ రోజునుండీ రమేష్ మళ్ళీ బాగా చదవటం కూడా‌మొదలు పెట్టాడు. మళ్ళీ తరగతిలో తనే మొదటివాడుగా రాసాగాడు.

అంతేకాదు- ఆ తర్వాత ఎక్కడ పాటల పోటీలు జరిగినా వాళ్ల బడి తరపున రమేష్‌ ఆ పోటీల్లో పాల్గొనేవాడు. అట్లా సంపాదించిన బహుమతులను అన్నింటినీ ఎవ్వరికీ చూపించకుండా తన గదిలోనే దాచుకునేవాడు.

ఇట్లా చాలా సంవత్సరాలు గడిచాయి. రమేష్ వరసగా అన్ని తరగతులనూ మంచి మార్కులతో దాటుకుంటూ వచ్చాడు. చివరికి వాళ్ల నాన్న అన్నట్లు ఇంజనీరు కూడా అయ్యాడు. ఇంకా చదువుతూనే మంచి ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు.

ఆ సంవత్సరం జరిగిన రాష్ట్ర స్థాయి పాటల పోటీలో పాల్గొని మొదటి బహుమతి సంపాదించుకున్నాడు రమేష్. ఆ కార్యక్రమం టివిలో వస్తుండగా చూసారు, వాళ్ళ అమ్మానాన్నలు! అంతమంది పెద్దలు తమ కొడుకును మెచ్చుకుంటూ ఉండటం చూసి వాళ్ళు చాలా సంతోషపడ్డారు.

రమేశ్‌ని పిలిచి, "ఏమిరా, ఇంతింత పెద్ద పోటీల్లో పాల్గొంటూ కూడా మాకు ఒక్క ముక్క కూడా చెప్పలేదేమి?" అని బాధపడ్డారు. అప్పుడు రమేష్ తను దాచి పెట్టుకున్న బహుమతులన్నిటినీ తెచ్చి చూపించాడు వాళ్లకు-"నేను చిన్నప్పటి నుండీ సంగీతాన్ని ఆరాధిస్తూనే ఉన్నాను నాన్నా, మీరు కోప్పడతారని, ఆ సంగతి ఇంట్లో చెప్పలేదు" అన్నాడు.

రమేష్ వాళ్ల నాన్న కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "నన్ను క్షమించు రమేష్! నిన్ను చిన్నప్పటినుండీ సంగీతానికి దూరంచేశాను. ఆ ప్రపంచంలో పడితే చదువుల్ని నిర్లక్ష్యం చేస్తావని భయపడ్డాను. నన్ను క్షమించు" అన్నాడు రమేష్ చేతులు పట్టుకొని.

"పరవాలేదులెండి నాన్నా, ఇష్టంగా ఏదైనా పనిని చేసినప్పుడు దాని ప్రభావం ఇతర రంగాలమీద తప్పక పడుతుంది. ఎటొచ్చీ మీరు ఆ ప్రభావం మంచిగా ఉండదని పొరపడ్డారు. నేనూ నా సాధనను గురించి మీకు చెప్పనే లేదుకదా, అందుకని నాదీ తప్పే. నన్ను మీరూ క్షమించాలి" అన్నాడు రమేష్ ప్రేమగా.