అనగనగా ఒక ఊళ్ళో నరేశ్ అనే పిల్లవాడొకడు ఉండేవాడు. ఒకరోజున నరేశ్ ఇంటి బయట ఆడుకుంటూ ఉన్నాడు- అంతలో ఎక్కడినుండి వచ్చిందో మరి, ఒక కుందేలు కుంటుకుంటూ వచ్చి, వాడి దగ్గర స్పృహతప్పి పడిపోయింది.
నరేశ్‌కి ఆ కుందేలుని చూడగానే చాలా బాధ వేసింది. చాలా జాగ్రత్తగా ఆ కుందేలుని తీసుకొని ఇంట్లోకి పరుగెత్తి, దానికి చికిత్స చేశాడు. మరునాటికల్లా అది కొంచెం కోలుకున్నది. అప్పుడు వాడు దానికి లేత గడ్డిని ఆహారంగా తెచ్చి ఇచ్చి, ఒక పాత్రలో మంచినీళ్ళు పోసి తాగించాడు. గడ్డి తిని, కడుపు నిండా నీరు త్రాగి పడుకున్న కుందేలు చాలా సేపటి వరకూ పడుకొని నిద్రపోయింది. నరేశ్ దానికేసే చూస్తూ కూర్చున్నాడు.
సాయంత్రం నిద్రలేచి, ఆ కుందేలు అడవివైపుకే చూస్తూ కన్నీరు కార్చటం మొదలు పెట్టింది. నరేశ్ దానిని ప్రేమగా నిమిరి, 'ఎందుకు, ఏడుస్తున్నావు? మీ ఇల్లు గుర్తుకొచ్చిందా?' అని అడిగాడు. "ఏమని చెప్పను, ఎంతని చెప్పను? నా కుటుంబం, నా పరివారం, నా ప్రజలు, నా సైన్యం- - అంతా మట్టిగొట్టుకుపోయింది!" అని జవాబిచ్చిందది, ఇంకా ఏడుస్తూ.
"అదేమి?" అని ఆశ్చర్యంగా అడిగిన నరేశ్‌కి అది తన కథ చెప్పింది- "నేను కుందేకొండ అనే రాజ్యానికి రాజును. నా ఆస్థానంలో నేను ఏది చెబితే అదే న్యాయం, అదే ధర్మం, అదే శాసనం- ఎవ్వరూ నన్ను అతిక్రమించేవాళ్ళే లేరు. ప్రజల్ని నేను కన్నబిడ్డలుగా భావించాను- ప్రజలు నన్ను కన్నతండ్రిలాగా ప్రేమించారు. నాపేరు భైరవసింహ. నా సైనికులు, సైన్యాధికారులు అందరూ మహా వీరులు, గొప్ప యుద్ధనైపుణ్యం కలవారు. పిల్లులలాంటి జంతువులనికూడా మా సైన్యం అదరగొట్టి, బెదరగొట్టి, చెదరగొట్టేది. మూడు సంవత్సరాలలో మేం 80 పిల్లులని హతమార్చామంటే, మా బలం ఎంతటిదో ఊహించు!
మరి మేం వాటిని ఊరికే హతమార్చలేదు- పిల్లులన్నీ మా మీదికి దండెత్తి వచ్చి, మా ప్రజల్ని అష్టకష్టలు పెడితే తప్ప, మేం వాటిమీదికి పోనే లేదు.
చివరికి ఆ పిల్లులన్నీ మా శరణు జొచ్చాయి- ఇకమీద మంచిగా నడచుకొంటామని ప్రమాణం చేశాయి. 'ఎవరినీ కష్టపెట్టం' అని మాట ఇచ్చినమీదట, మేం వాటిని మా రాజ్యంలోనే ఉండనిచ్చాం. అయితే విశ్వాసఘాతకులు- అవి ఏం చేశాయో తెలుసా? దొంగచాటుగా మా మీదికి భారీ నక్కల సైన్యాన్ని ఉసిగొల్పాయి. నా భార్య-పిల్లలు, నా సైన్యం అన్నీ ఆ నక్కలకు బలయ్యాయి. నేను ఇదిగో, గాయాలతో ఇలా వచ్చి పడ్డాను.
నా ప్రజల్ని ఇప్పుడు ఆ నక్కలు ఏం చేస్తున్నాయో తలచుకుంటేనే బాధగా ఉంది" అన్నది. కుందేలు కథ వినేసరికి నరేశ్‌కి ఎక్కడలేని కోపం వచ్చింది. అమాయకపు కుందేళ్లని ఇలా హింసించిన నక్కలమీద వాడు మండిపడ్డాడు. 'ప్రతీకారం చెయ్యాల్సిందే' అని రగిలి-పోయాడు. తన ఊరి జనాలను, కుక్కల సైన్యాన్ని, ఆయుధాలను తీసుకొని, కుందేలు దారి చూపగా అడవిలోకి పోయాడు.
అక్కడ ఇప్పుడు నక్కల రాజ్యం నడుస్తున్నది. కుందేళ్లన్నీ వాటికి లోబడి ప్రవర్తిస్తూ అష్టకష్టాలూ అనుభవిస్తున్నాయి. తమరాజు బ్రతికే ఉన్నాడని తెలిసే సరికి వాటికి చాలా ధైర్యం వచ్చింది. అందరూ కలిసి నక్కల మీద తిరగబడ్డారు.
మనుషులు, కుక్కలు, కుందేళ్ళు ఆయుధాలతో సహా అలా వచ్చి పడేసరికి నక్కల సైన్యం కకావికలైంది. యుద్ధంలో చాలా నక్కలు చనిపోయాయి. మిగిలినవి ఎక్కడివక్కడ పారిపోయాయి. కుందేళ్లన్నీ వీర నరేష్‌కీ, ఊరి జనాలకీ, కుక్కలకీ ధన్యవాదాలు చెప్పుకున్నాయి.