బౌద్ధ సన్యాసి ఒకతనికి పూర్తి ఏకాంతంలో ధ్యానం చేయాలని కోరిక కలిగింది ఒకసారి. 'నరపురుగంటూ ఉండని స్థలం ఏదా' అని ఆలోచించి, దట్టమైన ఓ అడవి లోతుల్లోకి చేరుకొని, అక్కడ ధ్యానానికి కూర్చున్నాడతను.
అక్కడ వాతావరణం చాలా కఠినంగా ఉంది; అంతేగాక అక్కడ తినేందుకు, ఉండేందుకు కూడా పెద్ద వసతిగా లేదు. దాంతో అతనికి ధ్యానంలో ఏకాగ్రత కుదరలేదు. అతని మనసు నిరంతరంగా గ్రామజీవితం వైపుకు, అక్కడి సౌకర్యాలవైపుకు పారిపోవటం మొదలు పెట్టింది.
అతను ఆ మనసుతో తంటాలు పడుతుండగానే సాయంత్రం అయ్యింది. ఆ సమయంలో అతనికి 'ఎవరో తనను గమనిస్తున్నారు' అనే భావన కలిగి, రాను రాను బలపడుతూ వచ్చింది. చివరికి అతను ఇక కళ్ళు తెరిచి చూడవలసిందే అనుకొని, మెల్లగా కళ్ళు తెరచి, తల ప్రక్కకు తిప్పి, చూశాడు- ఏముంది, నిజంగానే అక్కడ ఒక పులి, తన ప్రక్కన ఉన్న ముళ్ళ పొదలో కూర్చొని ఉంది!
అతని గుండె ఉద్వేగంతో ఊగిసలాడిపోయింది. తను ఏమాత్రం కదిలినా, పులి ధ్యాస చెదిరిపోతుంది. అది ఇక తన మీదికి దూకుతుంది- ఖచ్చితంగా! ఇప్పుడిక తను చేయగలిగిందంటూ ఏమీ లేదు- తన శరీరాన్ని ఇనుపకడ్డీ మాదిరి గట్టి చేసుకొని, స్థిర చిత్తంతో- ఏమాత్రం కదలకుండా కూర్చున్నాడు. ఇక ఇప్పుడు అతని మనసు తొణకటం లేదు. మెల్లగా ధ్యానం కుదిరింది.
సూర్యుడి తొలి కిరణాలు పడేసరికి, పులి లేచి నిలబడి, ఓ సారి గట్టిగా ఆవలించి, వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొంత సేపటికి కళ్ళు తెరిచిన బౌద్ధ సన్యాసి, ఆనాటి తన అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకొని, ఆ స్థలాన్ని వదిలి పోకూడదని నిశ్చయించుకున్నాడు.
ఆనాటి రాత్రే కాదు; ఆ తరువాతి రోజు రాత్రి కూడా పులి వచ్చి అతని ప్రక్కనే పొదలో కూర్చున్నది. అయితే ఇప్పుడు సన్యాసి మనసు అచంచలమై, ఏకాగ్రమై, ధ్యానంలో కుదురుకొని ఉన్నది. అతని శరీరం నిశ్చేష్టం అయిపోయింది. అందులో ఇప్పుడు ఇంక ఏలాంటి కదలికలూ లేవు.
ఆ మూడవనాటి రాత్రి సన్యాసి తపం ఫలించింది. ఏకాగ్రం అయి నిరంతరంగా మూడు రోజులు గడిపిన ఆ మనసు, తనలోని మాలిన్యాలనన్నిటినీ విడచి పెట్టి పరిశుద్ధమైంది. సన్యాసికి ఇక భయం అంటూ లేకుండా పోయింది.
మరునాడు ఉదయం ఇంకా పులి అక్కడే ఉంది; కానీ సన్యాసి ప్రశాంతంగా లేచి నిలబడి నడవసాగాడు. పులికూడా పిల్లిలాగా అతని వెంట నడిచింది: భయాన్ని గెలిచిన ఆ సన్యాసిని అడవి చివరివరకూ సాగనంపి తన దారిన తను పోయిందది!