రామనాథం, బంగారయ్య పట్నం వెళ్ళే దారిలో కలిసారు. ఒకరినొకరు పలకరించుకొని, కబుర్లు చెప్పుకుంటూ నడక సాగించారు. ఇంకొంత దూరం పోయాక, వాళ్ళకు ఇంకొక వ్యక్తి కలిశాడు. తన పేరు 'లింగడు ' అని చెప్పి, తనను తాను పరిచయం చేసుకున్నాడతను. అతను కూడా పట్నానికే వెళ్తున్నాడట. అలా ముగ్గురూ కలిసి ముందుకు సాగి,

చీకటి పడుతుండగా పట్నం పొలిమేరలకు చేరుకున్నారు. రాత్రి పూట పట్నంలో పని ఎలాగూ జరగదు; అందుకని ఆ రాత్రికి వాళ్ళు ముగ్గురూ అక్కడే ఒక సత్రంలో ఆగారు. భోజనాలయ్యాక, ముగ్గురికీ ఒకే గదిలో పడకలు ఏర్పాటు చేశాడు సత్రం యజమాని. 'పనులయ్యాక మళ్ళీ ఇక్కడే కలుద్దాం' అని చెప్పుకొని ముగ్గురూ పడుకున్నారు.

మర్నాడు ప్రొద్దున లింగడు నిద్ర లేచే సరికి కొంచెం ఆలస్యం అయింది. రామనాథం, బంగారయ్య అప్పటికే పట్నంలోకి వెళ్ళిపోయారు. లింగడు పక్క బట్టలు సర్దుతుంటే తళుక్కున ఏదో మెరుస్తూ కనిపించింది. 'ఏమిటా' అని చూస్తే అది ఒక హారం! 'ముందురోజున తనకు కలిసిన మిత్రులు రామనాథం, బంగారయ్యలలో ఎవరో ఒకరిది అయి ఉంటుంది' అనుకున్న లింగడు దానిని భద్రంగా తన జేబులో దాచుకున్నాడు.

అతను కాలకృత్యాలు ముగించుకుని పట్నంలోకి వెళ్ళేసరికి 'రాణీ గారి వజ్రాల హారం కనబడటం లేదు- దాన్ని తెచ్చి ఇచ్చిన వాళ్ళకి తగిన బహుమానం ఇస్తారు' అని పట్నమంతటా ప్రకటనలు వినబడుతున్నాయి. గత రాత్రి దర్శనం కోసం పట్నం పొలిమేరల్లో ఉన్న దుర్గ గుడికి వచ్చారట, రాణీ గారు. ఆవిడ తిరిగి వెళ్ళేటప్పుడు చూసుకుంటే ఏముంది, వజ్రాల హారం కనిపించలేదు.

లింగడు ఒక సారి తన జేబును తడిమి చూసుకున్నాడు. హారం భద్రంగా ఉంది. పక్కకి వెళ్ళి జేబులోంచి బయటికి తీసి చూశాడు.

సూర్యకాంతిలో హారం ధగ ధగా మెరుస్తున్నది. అది నిజంగా వజ్రాల హారమే అనిపించిందిప్పుడు. 'రాణీ గారు పోగొట్టుకున్న హారం ఇదే అయి ఉండవచ్చు. దాన్ని అధికారులకు అప్పగించితే విలువైన బహుమతి పొందవచ్చు!' ఆ ఉత్సాహంలో అతనికి ఏ అనుమానమూ రాలేదు: సత్రంలోకి- అందునా తాము వాడిన పక్క బట్టలలోకి - అది ఎలా వచ్చి చేరింది, మరి? ఆశకొద్దీ అతను వడి వడిగా కొత్వాలు కార్యాలయానికి దారి తీశాడు. అతను ఇంకా అక్కడికి చేరకనే రామనాథం, బంగారయ్య తారసపడ్డారు అతనికి.

విషయం తెలియగానే తాము కూడా కొత్వాలును కలిసేందుకు వస్తామన్నారు వాళ్ళు- ఆ వచ్చే బహుమతిలో తమకూ కాస్త వాటా దొరకవచ్చుననే ఆశ పుట్టింది వాళ్లకు. తీరా లోపలికి వెళ్ళి నగను కొత్వాలుకి చూపించగానే కొత్వాలు వాళ్ళ ముగ్గురినీ గదిలో కూర్చో బెట్టి తలుపుకు గడియ వేసి ప్రశ్నించడం మొదలు పెట్టాడు: 'అంత విలువైన హారం మీకు ఎట్లా దొరికింది, దానితో పాటు పోయిన మిగతా నగలన్నీ ఏమయ్యాయి?' అని ఆయన అడిగేసరికి, మిత్రులు ముగ్గురూ ఖంగు తిన్నారు.

వెంటనే రంగనాథం, బంగారయ్య ఇద్దరూ ప్లేటు ఫిరాయించారు. లింగడి వైపు అనుమానంగా చూస్తూ, "బాబ్బాబు! మమ్మల్ని వదిలెయ్యండి. ఇతనెవరో నిజానికి మాకు ఏమీ తెలీదు. నిన్న దారిలో కలిసాడు అంతే. హారం కూడా మాకు దొరికింది కాదు. మమ్మల్ని పోనీండి బాబూ" అని కొత్వాలును ప్రాధేయపడ్డారు. కొత్వాలు నవ్వి, వాళ్ళిద్దరినీ ఇంకో గదిలోకి పంపి, "విషయం తేలే వరకూ మీరు ఎక్కడికీ వెళ్ళడానికి వీలు లేదు" అని ఆంక్ష పెట్టి గదికి కాపలా పెట్టాడు.

"నాకు కనబడింది ఆ ఒక్క నగే నయ్యా. సత్రంలో పక్కబట్టలు తీస్తుంటే కనపడిందది. మిగిలిన నగలేమిటో, వాటి కధేమిటో నాకు అస్సలు తెలీదు" చెప్పాడు లింగడు, కొంచెం స్థిమిత పడ్డాక. "సరేలే, మరి ఆ సంగతి తేలేవరకూ నువ్వూ ఎక్కడికీ పోవద్దు" అని, కొత్వాలు తన మనిషిని ఒకడిని అక్కడ కాపలా ఉంచి తను సత్రం యజమానిని కలవడానికి వెళ్ళాడు. "నాకేమీ తెలియదయ్యా, ఆ బాటసారులు ముగ్గురూ రాత్రి సత్రంలో దిగారు. సరిగ్గా అదే సమయానికి ఉతికిన బట్టలు తెచ్చి ఇచ్చాడు, మా చాకలి- సూరయ్య. వాళ్లకి ఆ పక్కబట్టలే ఇచ్చాను నేను" అన్నాడు సత్రం యజమాని, తనను కలిసిన కొత్వాలుతో.

కొత్వాలు వెళ్ళి చాకలి సూరయ్యను ప్రశ్నించాడు- "అయ్యో, నగలాయ్యా? నాకెట్లా తెలుస్తుందయ్యా? నాకేం తెలీదయ్యా! బట్టలు మడతేసేది నా భార్యేనండయ్యా! అది మడత బెట్టి పక్కన పెడితే, ఆ బట్టల మూటను తీసుకువెళ్ళి సత్రంలో ఇచ్చి వస్తానంతేనండయ్యా" చెప్పాడు సూరయ్య.

సూరయ్య భార్య మటుకు ఏడుస్తూ కొత్వాలు కాళ్ళమీద పడింది- "అయ్యా, నాకు తెలుసయ్యా, ఇది ఇట్లా అవుతుందని. కంసాలి వీరయ్య ఇంటినుండి వచ్చినై గద- మాసిన బట్టలు- వాటిని ఉతికేందుకు విడదీస్తాఉంటే చీరకు అంటుకొని ఉందయ్యా, ఓ గొప్ప నగ! అంతలోనే ఎవరో తలుపు కొట్టారయ్యా, నేనేమో పోతూ పోతూ దాన్ని ఆ పక్కనే ఉన్న బట్టల మూటలో పెట్టి వెళ్ళానయ్యా. వెనక్కి తిరిగి వచ్చేసరికి ఆ మూట అక్కడ లేదయ్యా- మా సూరయ్య దాన్ని పట్టుకుని వెళ్ళి పోనాడయ్యా, నిజమయ్యా, కాపాడయ్యా!" అంటూ.

"మరి నువ్వు ఆ హారం వెనక పడి పోలేదా?" అడిగాడు కొత్వాలు.

"అయ్యా, పేద వాళ్ళం, పని చేసుకొని బ్రతుకుతాం. అంత పెద్ద నగ నీకెట్లా వచ్చిందని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? అందుకని ఆ సంగతి మా సూరయ్యకు కూడా చెప్పలేదయ్యా, నాలో నేనే వణికిపోతా ఉన్నా, నిన్నటినుండీ" అన్నది సూరయ్య భార్య.

కొత్వాలు కొంచెం ఆలోచించి, హారాన్ని పట్టుకొని కంసాలి వీరయ్య ఇంటికి వెళ్ళాడు. ఆ సమయానికి వీరయ్య ఇంట్లో లేడు.

"ఈ నగ నీదేనా?" అని అడిగాడు కొత్వాలు, హారాన్ని వీరయ్య భార్యకు చూపిస్తూ.

"అవునండీ, నాదే. నిన్న ఉదయం మా ఆయన దగ్గర చూసి నచ్చిందని తీసుకున్నాను. 'ఇది బంగారంది కాదు; గిల్టునగ' అన్నాడండీ, మా ఆయన. అయినా బాగుంది కదా, అని దాన్ని పెట్టుకొని పేరంటానికి కూడా వెళ్ళానండీ. వెనక్కి వచ్చి బట్టలు మార్చుకున్నాక చూస్తే అది కనిపించలేదు. 'పోనీలే, గిల్టుదేగా?' అని ఊరుకున్నానండి. అయినా ఈ రోజు ఉదయం మా ఆయన దాన్ని గురించి అడిగాడండీ- నేనేమో అది పోయిందని చెప్పాను- అంతెత్తున ఎగిరాడండి. చాలా కోప్పడ్డాడు. గిల్టునగకోసం అంత కోప్పడేదేముందండి- అరిచీ అరిచీ నోరు నొప్పి పుట్టాక, కొన్ని నగలు మూట కట్టుకొని ఎటో వెళ్ళాడండి. ఇప్పుడు ఆ గిల్టునగ కూడా దొరికింది చూడండి. అందుకే నేననేది- ఊరికే కోపం తెచ్చుకొని అరవకూడదండి" అన్నదామె.

కొత్వాలు నవ్వి, హారాన్ని ఆమెకే ఇచ్చేసి, వీరయ్య వచ్చేవరకూ ఆగకుండా తన కార్యాలయానికి తిరిగి వెళ్ళిపోయాడు. వెంటనే హడావిడిగా తన మనిషిని ఒకడిని పిలిచి, ఏవో‌సూచనలు ఇచ్చి, జాగ్రత్తలు చెప్పి పంపించాడు.

ఆ తర్వాత రామనాధాన్నీ, బంగారయ్యనీ, లింగడినీ వదిలి పెట్టించి, పదిమంది ఎదుటా లింగడిని మెచ్చుకొని "నీ మూలంగానే దొంగ దొరికాడు, నీవల్లనే రాణిగారి నగలన్నీ దొరికాయి. త్వరలో నిన్ను రాజుగారే స్వయంగా సన్మానిస్తారు" అంటూ తనవంతుగా ఓ చిన్న బహుమతి ఇచ్చి పంపాడు. ముగ్గురూ సంతోషంగా వాళ్ళ వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోయారు.

రెండు రోజుల తర్వాత కొత్వాలు మనుషులు వెళ్ళి కంసాలి వీరయ్యను బంధించి పట్టుకు వచ్చారు . తర్వాత అతని ఇంట్లో సోదా చేసి వజ్రాల హారంతో పాటు పోయిన నగలన్నీ కూడా బయటికి తీశారు. ఆలోగా కొత్వాలు మనుషులను పంపి 'బండడు' అనే వాడినికూడా బంధించాడు. ఇద్దరినీ నగలతో సహా రాజుగారి ముందు హాజరు పరిచాడు కొత్వాలు.

అటుపైన కొత్వాలు జరిగిన విషయం రాజు గారికి ఇలా వివరించాడు:

"మహారాజా, బండడు అనే ఈ మనిషి అసలు దొంగ. తను దొంగిలించిన నగలను ఇతను అలవాటుగా కంసాలి వీరయ్యకు అమ్ముతుంటాడు. కంసాలి వీరయ్యకు దొంగ సొమ్ము తినే అలవాటు ఉంది. 'దొంగ సొమ్ము' అనే పేరుతో నగలను తక్కువ ఖరీదుకి కొంటుంటాడు కూడాను. ఆనక వాటిని కరిగించి ఎక్కువ ధరకు అమ్ముకుంటాడు.

ఈ సారి మహారాణి గారి నగల మీదే కన్ను వేశాడు బండడు. దొంగిలించాక వాటిని కూడా ఎప్పటి మాదిరి వీరయ్యకే అమ్మాడు. వీరయ్య కూడా చాలా తక్కువ ధర చెల్లించి వాటిని సొంతం‌ చేసుకున్నాడు. ఆపైన అతను ఆ నగలను చూసి మురిసిపోతుండగా అతని భార్య చూసింది. ఆమె అడిగే సరికి 'అవి గిల్టువి' అని అబద్ధం చెప్పేశాడు వీరయ్య. అయితే మర్నాడు తెల్సింది అతనికి- వజ్రాల హారాన్ని భార్య పోగొట్టిందని! ఇప్పుడు ఇంక ఆ సొమ్మును ఇంట్లో ఉంచటం భద్రం కాదు-ఎవరైనా అనుమానించచ్చు! అందుకని ఆ నగల్ని తీసుకెళ్ళి వేరే చోట ఎక్కడో‌ రహస్యంగా దాచి వచ్చాడు. అందుకనే, వీరయ్య సంగతి నాకు తెలిసే సరికి నగలు అతని వద్ద లేవు. ఆ సమయంలో నేను అతన్ని నిలదీసినా, అతను తనకేం తెలీదని బుకాయించి ఉండేవాడు. అందుకని నేను తెలివిగా హారాన్ని అతని భార్యకు ఇచ్చేసి వెనక్కి వచ్చాను. దాంతో నేను కూడా అతన్ని నమ్మాననుకున్నాడు. అయితే వీరయ్య ప్రతి చర్యనూ రహస్యంగా గమనించమని నేను నా మనుషులను నియోగించి ఉన్నాను. రెండు రోజుల్లో అతను ఆ నగలకోసం వెళ్ళటం, నేను అతన్ని బంధించటం జరిగిపోయాయి".

రాజుగారు కొత్వాలును మెచ్చుకున్నారు. "మరి బండడు ఎట్లా దొరికాడు?" అని అడిగారు.

"వీరయ్య ద్వారా బండడు ఎలాగూ దొరికేవాడు. అయితే, రాణిగారి నగల్ని తననుండి అంత తక్కువ ధరకి కొనుగోలు చేశాడని వీరయ్య మీద అలిగాడు బండడు. అతనితో పోట్లాడేందుకు వచ్చి, నేరుగా మా చేతికి చిక్కాడు- అట్లా మా పనిని సులభం చేశాడు" నవ్వాడు కొత్వాలు.

"మరి దొంగను పట్టిచ్చినందుకు బహుమానం లింగడికి ఒక్కడికే ఎందుకిచ్చావు? రంగనాథం-బంగారయ్యలకి పంచలేదేమి?" అడిగారు రాజుగారు.

"నిజానికి రామనాథం-బంగారయ్యలకు దొంగను పట్టి ఇవ్వడంలో ఎటువంటి పాత్రా లేదు ప్రభూ. 'లింగడికి బహుమానం దొరికితే తమకు కూడా ఎంతో కొంత రాకపోదు' అని వాళ్ళు ఆశ పడ్డారు అంతే. తీరా అది దొంగ సొమ్మని తెలిసేసరికి, తప్పును లింగడి మీదికి తోసి తప్పించుకోజూసారు. లింగడిది మెరుగైన వ్యక్తిత్వం. తనది కాని హారాన్ని ఆశించక, దాని సొంతదారులకు దాన్ని తిరిగి ఇచ్చేసేందుకు ముందుకొచ్చాడు అతను; పరోక్షంగా మనకు దొంగ దొరకడానికి సాయం చేశాడు. అందువల్ల అతనే బహుమతికి యోగ్యుడు"

రాజు గారు కొత్వాలుని అభినందించి, దోషులను తగిన విధంగా శిక్షించారు. ఆనక ఆయన చేతులమీదుగా లింగడికి పెద్ద బహుమానం లభించింది.