అనగనగా ఒక ఊళ్ళో రాజు అనే పిల్లవాడు ఉండేవాడు. వాడు చాలా మంచివాడు. ఎవరు ఏ పని చెబితే అది చేసి పెడుతూ ఉండేవాడు. వాళ్ళ నాన్న ఎప్పుడో వాడు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడట. ఇక వాళ్ళమ్మ ఎప్పుడూ జబ్బుతో మంచం మీద పడి ఉండేది. ఇంటి బాధ్యతలన్నీ రాజే మోసేవాడు. కూలి పని చేసేవాడు; వంట పని చేసేవాడు; అమ్మకు మందులు తెచ్చి ఇస్తుండేవాడు; అంట్లు తోమేవాడు. కొన్నాళ్లకి వాళ్ల అమ్మ చనిపోయింది. ఇక రాజు ఒంటరివాడు ఐపోయాడు.
ఆ సంవత్సరం వర్షాలు సరిగ్గా పడలేదు. రాజుకి పని దొరకటం కూడా కష్టం అయ్యింది. ఆ సమయంలో దూరదేశపు మనుషులు కొంతమంది వాళ్ళ ఊరికి వచ్చారు. నావల్లో సముద్రాలు దాటి వచ్చారట వాళ్ళు. రాజుకి వాళ్ళు నచ్చారు. వాళ్ళని బాగా గమనించి, మంచి వాళ్ళేనని నిర్ధారణకు వచ్చాక వాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, "నేనూ మీతో వస్తాను సార్!" అని బ్రతిమాలాడు.
"సరే, రా! కానీ మేం చెప్పిన పనల్లా చేయాల్సి ఉంటుంది- చాలా పని ఉంటుంది మరి" అన్నారు వాళ్లు, కొంచెం ఆలోచించి.
రాజు దానికి ఒప్పుకొని వాళ్లతో పాటు వెళ్ళాడు. కొత్త గనక వాడికి పడవ ప్రయాణం చాలా నచ్చింది. నావికులు వాడికి చాలా పనులు చెప్పేవాళ్ళు. వాడి పనికి మెచ్చుకొని వాళ్ళు కడుపునిండా అన్నం పెట్టటమే కాకుండా, డబ్బులు కూడా ఇవ్వటం మొదలు పెట్టారు.
అయితేనేమి, దురదృష్టం వెంటాడింది. ఒకరోజున సముద్రంలో తుఫాను చెలరేగింది. అలలు అంతెత్తున ఎగిరి పడ్డాయి- వాళ్ళున్న పడవ ముక్కలు ముక్కలైపోయింది!
పడవలో ఉన్నవాళ్లంతా ఎటు పోయారోతెలీదు- కానీ రాజు కళ్ళు తెరిచి చూసేసరికి వాడు ఒక ద్వీపం ఒడ్డున పడి ఉన్నాడు. లేచి, ఓపిక తెచ్చుకొని, నడక సాగించి కొద్ది దూరం వెళ్ళాడో, లేదో- వాడికి ఒక కొండ గుహ కనిపించింది. దొంగలు కొందరు ఆ గుహముందు నిలబడి ఏదో మంత్రం చదువుతున్నారు. వాళ్ళు ఆ మంత్రం చదవగానే గుహ తలుపులు తెరుచుకున్నాయి. దొంగలు ఆ గుహలోకి వెళ్ళి అందులోనుండి ఏవేవో మూటలు బయటికి తెచ్చుకొని గుర్రాలెక్కి నిముషాల్లో మాయం అయిపోయారు!
రాజు గుహ దగ్గరికి వెళ్ళి చూశాడు- తలుపులు వేరే ఏ విధంగానూ తెరచుకొనే మార్గం కనబడలేదు. అయితే బాగా వెతికితే పొదల వెనకగా ఒక చిన్న కిటికీ కనబడింది! రాజు ఆ కిటికీలోంచి గుహలోపలికి తొంగి చూశాడు- గుహంతా ఖాళీగా ఉంది; కానీ గుహమధ్యలో ఒక స్తంభానికి కట్టిపడేసి ఉన్నాడు, ఒక ముసలాయన!
రాజు కిటికీలోంచి అరిచి, సైగలు చేసిన మీదట అతను నీరసించిన గొంతుతో తనను విడిపించమని వేడుకున్నాడు. కానీ ఎలాగ? ముసలాయనే రాజుకి ఆ మంత్రం చెప్పాడు. ఓ నాలుగైదు సార్లు ఆ ముసలాయనతోపాటు పలికేసరికి, అది నోటికి వచ్చేసింది, రాజుకి! వాడు బయటికి వెళ్ళి ఆ మంత్రం చదివేసరికి, గుహ తలుపులు తెరచుకున్నాయి. రాజు నేరుగా గుహలోకి పోయి ముసలాయన్ని విడిపించాడు. ముసలాయన వాడికి ధన్యవాదాలు చెప్పుకొని, తన కథ చెప్పుకొచ్చాడు- ఆ దొంగల నాయకుడు తన శిష్యుడే. తననుండి కొన్ని మంత్రాలు నేర్చుకొని, చివరికి ఇప్పుడు వాడు దొంగ పనులు చేయటం మొదలుపెట్టాడు. తన ఇంటినే వాడు డబ్బులు దాచుకునే స్థలంగా వాడుకోవటం మొదలు పెట్టాడు! తను అట్లాంటి పనులు చేయవద్దనే సరికి, వాడికి కోపం వచ్చింది. తనను కట్టి పడేసి, ఇంట్లో దాచుకున్న సొమ్మునంతా దూరంగా ఉన్న కోటకు ఎత్తుకెళ్ళాడు.
"నువ్వు మంచివాడివి లాగా ఉన్నావు నాయనా! నేను నీకు మూడు టోపీలు ఇస్తాను- ఇదిగో ఈ ఆకుపచ్చ రంగు టోపీ పెట్టుకుంటే నువ్వు మాయం అవుతావు. ఎర్రది పెట్టుకుంటే నువ్వు ఐదు రెట్లు పెద్దగా అవుతావు- పదింతలు శక్తి వచ్చేస్తుంది నీకు. ఇక పసుపు పచ్చ రంగు టోపీ పెట్టుకున్నావంటే మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తావు" అని చెప్పి మూడు టోపీలు చేత పెట్టాడు ముసలాయన. "ఇదిగో, ఈ దీవికి అవతలివైపున ఏడెనిమిది పడవలుంటాయి. ప్రస్తుతం అవి ఆ దొంగల ఆధీనంలో ఉన్నాయి- వాళ్ళకి కనబడకుండా ఒక పడవను సాధించుకోగలవేమో చూడు- ఇక వెళ్ళిరా!" అంటూ.
ముసలాయన దగ్గర ఆ టోపీలు తీసుకొని, ధన్యవాదాలు చెప్పి బయలుదేరాడు రాజు. ఆకుపచ్చరంగు టోపీ పెట్టుకొని ఆ ద్వీపంలో నడచి వెళ్తుంటే తనకి కొన్ని ఎలుగుబంట్లూ, అడవి పందులూ ఎదురయ్యాయి- కానీ వాటికి రాజు కనబడనే లేదు!
అయితే పడవల దగ్గరికి చేరుకునేసరికి రాజుకి భయం వేసింది- ఏమంటే దొంగలు ఆ పడవలన్నిటిలోనూ సామాన్లు ఎక్కిస్తున్నారు. చూడగా ఒక పడవలో తక్కువమంది దొంగలు ఉన్నారు- రాజు ఆ పడవలోకి ఎక్కి నిల్చొని, పచ్చటోపీ తీసేసి, ఎర్రటోపీ పెట్టుకున్నాడు. చూస్తూండగానే వాడు ఐదు రెట్లు పెద్దగా అయిపోయాడు! పది రెట్ల బలం వచ్చేసింది వాడికి.
వాడు పెద్దగా అరుస్తూ దొంగల మీదికి దూకే సరికి దొంగలంతా ఎక్కడివాళ్ళు అక్కడ పారిపోయారు. కొందరు దొంగలు వాడితో యుద్ధానికి దిగారు- వాడు ఎక్కడి వాళ్లను అక్కడ విసిరేసి హడావుడి చేశాడు. దాంతో దొంగలందరూ వాడు ఎక్కిన పడవని వదిలేసి, మిగిలిన పడవల్లోకి దూకి గబగబా తెడ్లు వేసుకుంటూ వెళ్ళిపోయారు.
రాజు నవ్వుకొని, పసుపు పచ్చ టోపీ పెట్టుకున్నాడు. దాంతో వాడికి తన మునుపటి రూపం వచ్చేసింది. వాళ్ళు వదిలేసి వెళ్ళిన పడవలో దొంగ సొత్తు ఇంకా చాలానే ఉంది- చూస్తూ చూస్తూ అంత సొమ్మును తీసుకెళ్ళటం ఏమంత ఇష్టం కాలేదు రాజుకు. అందుకని వాడు పడవని వేరే చోట భద్రంగా కట్టేసి, మెల్లగా నడచుకుంటూ తనకు ఇంతకు ముందు కనబడ్డ గుహకోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎంత వెతికినా వాడికి ఆ గుహా కనబడలేదు; తనకు టోపీలిచ్చిన తాతా కనబడలేదు! కంగారుగా జేబులో చూసుకుంటే అసలు ఆ టోపీలే కనబడలేదు!
వాడికి నవ్వూ, ఏడుపూ ఒకేసారి వచ్చాయి. అంతలోనే వాడికి ఇంకో ఆలోచన వచ్చి, ఎక్కడ లేని బాధా వేసింది- 'తన పడవైతే భద్రంగానే ఉన్నది గద?!' వాడు గబగబా వెళ్ళి చూసుకుంటే, అది మటుకు ఇంకా భద్రంగానే ఉంది.
వాడు సంతోషంగా ఆ పడవనెక్కి, త్వరలోనే తనకు నచ్చిన తీరం చేరుకున్నాడు. అక్కడ వ్యాపారం మొదలు పెట్టుకొని సుఖంగా జీవించాడు.