అనగా అనగా ఒక అడవి. ఆ అడవిలో ఒకే ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి ప్రక్కనే ఒక కొట్టం ఉంది. ప్రక్కనే పెద్ద సరస్సు ఉంది.

అడవి ఉంది; అకాశం ఆకుపచ్చగా ఉంది!

ఆ ఇంటిలో ఇద్దరే ఇద్దరు జీవిస్తున్నారు. వాళ్లు భార్యా భర్తలు- రామయ్య, సీతమ్మ .

వాళ్ళిద్దరూ ఆవులు మేపేవాళ్ళు. ప్రక్కనే వున్న కొట్టంలో ఆవులను కట్టేసేవాళ్ళు.

అయితే ఒకరోజున ఉదయం నిద్రలేచి చూసేసరికి కొట్టంలో‌ ఆవులు లేవు.

అది చూసి సీతమ్మ , రామయ్య భోరున ఏడ్చారు. "ఈ ఆవులే మనకి జీవనాధారాలు. ఇవి పోయాక మనం ఎలా జీవించాలి?" అని ఏడ్చారు.

మనసు ఆగక ఇద్దరూ అడవంతా తిరిగి చూశారు. ఎక్కడా ఆవుల జాడే లేదు.

"నాలుగైదు రోజులుగా నాకు ఏదో గజ్జెల శబ్దం వినబడుతూనే ఉన్నది. ఇక్కడేదో దయ్యం చేరుకున్నట్లుంది. అదే మన ఆవుల్ని ఇలా చేసి ఉంటుంది" అన్నది సీతమ్మ.

అప్పుడు రామయ్య , సీతమ్మ తో "మన ఆవులు ఎలా పోయినాయో, ఎక్కడికి పోయినాయో నేను ఈ రోజు కనిపెట్టాలి. ఏ దయ్యమైనా సరే, ఏ రాక్షసైనా సరే, నేను దాన్ని ఎదిరించి పట్టుకుంటాను. నా ఆవుల్ని నేను వెనక్కి తెచ్చుకుంటాను" అన్నాడు.

సాయంత్రం కాగానే పూరిగుడిసె దగ్గరికి వెళ్ళి విచారంగా కూర్చున్నాడు రామయ్య. సీతమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకొని అతన్నే చూస్తూ ఉన్నది.

ఆ సరికి కొద్ది కొద్దిగా చీకటి పడింది. ఆవుల్ని ఎత్తుకుపోయిన దయ్యం వాటిని ఎవ్వరికీ కనబడకుండా‌ అక్కడే ఉంచింది. దానికి ఇప్పుడు సంతోషం ఎక్కువై గజ్జెలు కట్టుకొని ఆడటం మొదలు పెట్టింది.

రామయ్య, సీతమ్మ అక్కడే కూర్చొని దాని గజ్జెల చప్పుడు విన్నారు. సీతమ్మ భయ పడుతూ "అమ్మో, దయ్యమే! నాకు చాలా భయంగా ఉంది. ఈ అడవి వదిలి వెళ్ళిపోదాం, పదండి" అన్నది.

అయితే ఆ గజ్జెల చప్పుడు వింటున్న కొద్దీ రామయ్యకు కోపం పట్టవశంకాలేదు. "ఈ దయ్యానికి ఏంటీ, మనం భయపడేది?! నా దగ్గర ఒక ఉపాయం ఉంది. చూస్తూండు దాన్ని ఏంచేస్తానో?" అని గబగబా ఆ దయ్యం మీదికి పరుగెత్తాడు.

రామయ్యను చూడగానే దయ్యం నాట్యం ఆపి మాయమైపోదామనుకున్నది.

అయితే అంతలోనే రామయ్య వెళ్ళి దాని వెంట్రుకలు గట్టిగా పట్టుకున్నాడు- "కత్తిరించేస్తాను, జాగ్రత్త!" అని బెదిరించాడు.

దయ్యం ఇట్లాంటి మనుషుల్ని ఎప్పుడూ చూడలేదు. 'తనని చూసి భయపడేవాళ్ళు తప్ప, ఎవరూ తన మీదికి వచ్చి ఎరుగరు! అదీ గాక, వీడు తన జుట్టును ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే, తనకి బాగా నెప్పి పెడుతున్నది. ఇక తను ఏం చేసేందుకూ వీలయేట్లు లేదు!' అని ఆ దయ్యం భయపడి పోయింది. "నన్ను ఏం చేయద్దు! నన్ను ఏం చేయద్దు! ఏవైనా మూడు కోరికలు కోరుకో! తీరుస్తాను!" అంది.

అప్పుడు రామయ్య "ఇదిగో, కోరుతున్నాను చూడు- మొదటి కోరిక: నా ఆవుల్ని నాకు ఇచ్చెయ్యాలి. రెండవ కోరిక: నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. మూడవ కోరిక: నాకు ఇట్లాంటి బెడదలు ఏవీ లేని మంచి జీవితం కావాలి. అన్నాడు.

దయ్యం ఇంకేం చేస్తుంది? అతని కోరికలు మూడూ తీర్చి వెళ్ళిపోయింది.

తమ అవులు తిరిగి వచ్చినందుకు సీతమ్మ చాలా సంతోషపడింది. అటుపైన రామయ్య సీతమ్మ ఇద్దరూ ఎప్పటిమాదిరే సంతోషంగా జీవించారు.