ఒక ఊరికి వరదలు వచ్చాయి. అందరూ హడావిడిగా ఇళ్ళు వదిలేసి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాజుగారి కోట కూడా వరదలో మునిగిపోయే ప్రమాదంలో పడింది. కానీ రాజుగారు మాత్రం "నేను దైవభక్తుడిని. నన్ను దేవుడే రక్షిస్తాడు!" అనుకుంటూ ఇంట్లోంచి కదల్లేదు.
నీటి మట్టం పెరుగుతూనే ఉంది. రాజుగారి ఇంట్లోవాళ్ళు, పొరుగువాళ్ళు అందరూ రాజుగారిని తమవెంట రమ్మన్నారు. రాజుగారు ఒప్పుకోలేదు. "నన్ను దేవుడే కాపాడతాడు" అన్నారు. వాళ్లందరూ ఆయన్ని అక్కడే వదిలేసి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు.
రాజుగారు ఒక్కరే పై అంతస్తుకి ఎక్కారు. ఊరంతా అల్లకల్లోలంగా ఉంది. కొంతమంది పడవల్లో తిరుగుతూ ఇళ్ళల్లో చిక్కుకు-పోయిన వారిని రక్షిస్తున్నారు.
వాళ్లలో ఒక పడవవాడు రాజుగారిని పిలిచాడు. "రా, త్వరగా పడవెక్కు! లేకపోతే మునిగిపోతావు!" అన్నాడు.
రాజుగారు పోలేదు. "నన్ను దేవుడే కాపాడతాడు" అన్నారు.
వరద నీరు ఇంకా పెరిగిపోతుండటంతో రాజుగారు పై కప్పు మీది కెక్కారు. వరదలో చిక్కుకుపోయిన వాళ్ళని రక్షించడానికి అంతలో ఓ హెలికాప్టర్ వచ్చింది. అందులోంచి పైలట్ గట్టి తాడుని ఒకదాన్ని కిందికి విసిరాడు. "దాన్ని పట్టుకో - పైకి లాగుతాం!' అని అరిచాడు. అయినా రాజుగారు "నన్ను దేవుడే రక్షిస్తాడు " అంటూ పాత పాటే పాడారు.
అటు తర్వాత ఇంక వేరే ఎవ్వరూ రాలేదు. వరద ఇంకా ఎక్కువైంది. రాజుగారు నీళ్ళలో పడి చచ్చిపోయారు.
మళ్ళీ చూసేసరికి ఎదురుగా దేవుడు ఉన్నాడు-పాప పుణ్యాల లెక్కలు సరి చూసుకుం-టున్నాడు. రాజుగారు దేవుడ్ని నిలదీశాడు- "నేను నీ భక్తుడిని కాదా, మరి నాకెందుకు సాయం చెయ్యలేదు?" అని.
"ఏంటి నువ్వు మాట్లాడేది? నేను నీ పొరుగువాడ్ని పంపాను; పడవ పంపాను; హెలికాప్టర్ పంపాను- నువ్వు సాయమే తీసుకోకపోతే నేనేం చెయ్యాలి?!" అన్నాడు దేవుడు.
అవకాశాల్ని పంపించేదీ దేవుడే గద, మరి!?