ఎవరినో కనుక్కోండి!

రాము: పొద్దున్న మా ఆవిడకీ నాకూ పెద్ద యుద్ధమైపోయిందిరా!
సోము: ఏం చేశావు?
రాము: నాకు తిక్కరేగితే ఊరుకుంటానా? సుబ్బరంగా చితక్కొట్టేశాను!
సోము: అయ్యో! మరి మీ ఆవిడ తిరగబడలేదా!?
రాము: లేదురా! నేను చితక్కొట్టింది వంటిట్లో సామాన్లని!!

తరగని ఆస్తులు!

విశ్వనాధం: మీ నాన్నగారు పోయారటకదా పాపం! చనిపోయేముందు ఏమైనా అప్పగించారా?
వీరభద్రం: అప్పగించారండి, మా అన్నయ్యకి 5లక్షలు, నాకు4లక్షలు, మా తమ్ముడికి 3లక్షలు-
విశ్వనాధం: ఎంతైనా ముందు చూపున్నవాడు మీనాన్న! ఆస్తిరూపంలో ఇచ్చాడా, డబ్బురూపంలోనా?
వీరభద్రం: అప్పురూపంలో ఇచ్చాడండి!

నేనే గొప్ప!

టీచర్: చింటూ బల్బుని కనిపెట్టిన వాడు, కరెంటుని కనిపెట్టిన వాడు- వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప?
చింటూ: ఇద్దరూ కాదు, స్విచ్‌ను కనిపెట్టిన వాడు గొప్ప! ఎందుకంటే వాడు లేకపోతే కరెంటు ఐపోతుంది, బల్బులు మాడిపోతాయి!

తియ్యటి ఐడియా!

సుబ్బు: ఏంట్రా! గులాబి, జామ మొక్కల్ని ఒకే దగ్గర కలిపి నాటుతున్నా వెందుకు?
వెంగళప్ప: రెండూ కలిపి నాటితే చెట్టు పెద్దయ్యాక గులాబ్‌జామ్‌లు కాస్తాయని!

రాంగ్ నంబర్!

వెంగళప్ప: ఎన్నడూ బిజీగా ఉండని టెలిఫోన్ నంబర్ ఏదో కనుక్కో?
సుబ్బారావు: తెలీదురా!
వెంగళప్ప: ఆ మాత్రం తెలీదా? రాంగ్ నంబరు!

ధైర్యం ఇదేరా!

గప్పాల రావు గప్పాలు కొడుతున్నాడు:
గ.రా: నేను సింహపు బోనులో ఐదు గంటలు గడిపి వచ్చాను తెలుసా?
అనుమానాల రావు కనుక్కున్నాడు:
అ.రా: ఏముంది, ఆ సమయంలో సింహం బోనులో ఉండి ఉండదు. ఇంకేమి!?

పద్యం
ఏరకుమీ కసుగాయలు
దూరకుమీ బంధుజనుల దోసము సుమ్మీ!
పారకుమీ రణమందున
మీరకుమీ గురువునాజ్ఞ మేదిని సుమతీ!

భావం
పసరు పిందెలను కోయకు-
మేలు కోరేవాళ్లను తిట్టకు-
యుద్ధం నుండి పారిపోకు-
గురువు ఆజ్ఞను మీరకు- తప్పు సుమా!