జనహిత కోచింగ్ సెంటర్‌ అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంచి పేరు ఉన్నది. అక్కడ చదివిన పిల్లలందరికీ పెద్ద-పెద్ద కాలేజీల్లో సీట్లు వస్తాయని పేరు.

అయితే అక్కడ కోచింగ్ ఊరికే దొరకదు- చాలానే ఖర్చు అవుతుంది. అయినా పిల్లల బాగు కోరే తల్లిదండ్రులు అప్పో-సప్పో చేసి, తమ పిల్లల్ని జనహితలో చేర్పిస్తూ ఉండేవాళ్ళు.

అట్లాగే తమ కొడుకు ధనుష్‌ని జనహితలో చేర్చారు, వాళ్ల అమ్మవాళ్ళు. ధనుష్ చాలా మంచి పిల్లవాడు. అతనికి తల్లిదండ్రులపై నమ్మకం, గురువులపై భక్తి, చదువులంటే శ్రద్ధ- చదువుకునేందుకు కావలసిన మూడు అంశాలూ అతనిలో ఉన్నాయి.

అయితే జనహితకు వచ్చాక ఎందుకో, అతనిలో ఒక భయం మొదలైంది. ముఖ్యంగా, రాఘవేంద్ర సార్ అంటే.

రాఘవేంద్ర సార్ హిందీ చెబుతారు. పాఠాలు చాలా చక్కగా చెబుతారు. సమస్యల్లా ఆయన ప్రవర్తన తోటే. ఆయన ఎప్పుడూ ఎవరో ఒకళ్లను తిడుతూనే ఉండేవాడు. తరగతిలో ఎవరో ఒక పిల్లవాడినైనా కొట్టని రోజంటూ ఉండదు. ఆయన్ని చూస్తేనే పిల్లలందరూ జడుసుకునేవాళ్ళు.

అయితే "ఆ భయం అవసరం" అని ఆయన చెబుతూ ఉండేవాడు .‌"ఎందుకంటే, భయం ఉన్న పిల్లలు చదువుతారు. చదివితే మంచి మార్కులు వస్తాయి". ఇన్నాళ్ళుగా 'అది నిజమే' అని తేలింది కూడానూ: జనహిత పిల్లలు ఎవ్వరూ హిందీలో తప్పి ఎరుగరు.

ధనుష్‌ అన్ని సబ్జెక్టులూ బాగానే‌ చదివేవాడు గానీ, హిందీ మాత్రం వాడికి సరిగా వచ్చేది కాదు. నిజానికి వాడికి హిందీ అక్షరాలే సరిగ్గా రావు! అయినా వాడు ఎన్నడూ తన కష్టాన్ని సారుకు చెప్పే ధైర్యం చేయలేదు. అయితే సంవత్సరాంతపు పరీక్షలు దగ్గరకొచ్చేసరికి, వాడికి చాలా భయం పట్టుకున్నది. పరీక్షలో వస్తాయనుకున్న ప్రశ్నలన్నిటికీ తెలుగులోనే జవాబులు వ్రాసుకొని, వాటిని ఒక్కొక్కదాన్నే బట్టీ వేసాడు. 'అన్నీ ముక్కున పెట్టుకొని వెళ్ళి, పరీక్షలో వదిలేసి వచ్చేస్తే సరి- తర్వాతి సంగతి తర్వాత చూసుకోవచ్చు!'

పరీక్షలు రానే వచ్చాయి. రేపు హిందీ పరీక్ష అనగా పిల్లలందరూ ఎవరికి వాళ్ళు చదువుతున్నారు. వాతావరణం అంతా గందరగోళంగా ఉన్నది.

కొంతమంది పిల్లలు మాత్రం చదవటం ఆపి వేరే ఏవో సంగతులు ముచ్చటించుకోవటం మొదలు పెట్టారు. అంతలో ఎక్కడి నుండి వచ్చారో, రాఘవేంద్రసార్ వచ్చారు. ఆ పిల్లల వెనకనే ఆగి, తన దగ్గర ఉన్న బెత్తంతో వాళ్లను చితక బాదారు. ఆయన కోపాన్ని చూసిన ధనుష్‌కి మతి పోయినట్లు అయ్యింది. చదువుతు-న్నాడో, లేదో కూడా తెలియకుండా భయంతోటే హిందీ చదవటం కొనసా-గించాడు; కానీ బుర్రలోకి ఏమీ ఎక్కటంలేదు.

చూస్తూండగానే నిద్ర పట్టేసింది. ఉదయాన్నే లేచి "ఏమీ పరవాలేదులే" అనుకొని పరీక్ష రాశాడు. ఏమీ లాభం లేకపోయింది: వాడికి అన్ని సబ్జెక్టులలోనూ మంచి మార్కులు వచ్చాయి- ఒక్క హిందీలో తప్ప!

ధనుష్ భయంతోటీ, సిగ్గుతోటీ వణికి-పోయాడు. రాఘవేంద్ర సార్ తనని ఏం చేయబోతున్నాడో ఊహించుకుంటేనే వాడికి చెమటలు పట్టాయి.

వాడి మెదడు పనిచేయటం మానివేసింది. ఇంకొంచెం సేపట్లో సార్ వచ్చేస్తారు- తను ఆలోగా ఏదైనా చేసెయ్యాలి- అని మెదడులో ఆలోచన సుడిలాగా తిరిగింది. "ఇక్కడినుండి తప్పించుకోవాలి- దూకి పారిపోతాను" అని వాడు కోచింగ్ సెంటరు మేడపైనుంచి దూకెయ్యబోయాడు- అంతలోనే ఎవరో వాడిని గట్టిగా పట్టుకొని వెనక్కి లాగారు. "వదలండి-నేను పారిపోవాలి- రాఘవేంద్ర సార్ నన్ను చంపేస్తారు- నేను హిందీలో తప్పాను" అరుస్తున్నాడు ధనుష్‌.

రాఘవేంద్ర సార్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి- "నేను నిన్నేం అననులేరా- నిన్నే కాదు; అసలు ఎవ్వరినీ కొట్టను- ఇకనుండీ మీకు ప్రేమగానే పాఠాలు చెబుతాను. పిల్లల్ని అస్సలు బెదిరించను. ఊరుకో!" అని మళ్ళీ మళ్ళీ చెప్పారాయన.

అటుపైన ఆయన చాలా మారిపోయారు. ఓపికతోటీ, ప్రేమగానూ ఆయన పాఠాలు చెబుతుంటే మిగతా పిల్లలందరికీ కూడా హిందీ బాగా వచ్చేసింది.

అందరూ మంచి మార్కులతో‌ పాసయ్యారు. బెదిరింపులతో కాదు; ప్రేమగా, అర్థం చేయించటం ద్వారా నేర్పినవాడే మంచి గురువు.