అనగనగా అరేబియా దేశంలో ఖలీల్‌పాషా అనే వ్యాపారి ఒకడు ఉండేవాడు. అతని దగ్గర ఒక ఒంటె ఉండేది. అతనికి ఆ ఒంటె అంటే చాలా ఇష్టం.
ఒక రోజు దాన్ని ఇంటి దగ్గరే కట్టేసి, ఖలీల్‌పాషా బయటకు చెళ్ళాడు. వెనక్కి తిరిగి వచ్చి చూసే సరికి, తన పశువుల కొట్టంలోంచి ఏవేవో శబ్దాలు వస్తున్నాయి. అతను గబగబా కొట్టంలోకి పరుగెత్తి చూసాడు- ఎవరో నలుగురు వ్యక్తులు తన ఒంటెను చంపడానికి ప్రయత్నిస్తున్నారు!
ఖలీల్‌పాషాకు విపరీతమైన కోపం వచ్చింది. పెద్దగా అరుస్తూ కట్టె పట్టుకొని వాళ్ల మీదికి దూకాడు. వాళ్లందరినీ కొట్టి తరిమివేసాడు.
ఆ తరువాత ఒంటెను అడిగాడు ఖలీల్ పాషా- "నేను ఇప్పటివరకూ చాలామంది దొంగల్ని చూశాను. వాళ్ళు ఒంటెల్ని ఎత్తుకుపోతారు; ఎక్కడికో తీసుకెళ్ళి అమ్ముకుంటారు- కానీ వీళ్ళు మాత్రం నిన్ను చంపాలని చూశారు- ఎందుకు?" అని.
ఒంటె ఏదో చెబుదామనుకున్నట్లు నోరు తెరిచింది- మళ్ళీ ఊరికే ఉండిపోయింది.
"చెప్పు. వీళ్ళెందుకు చంపబోయారు నిన్ను? నాకు చెబితే, నేను కొంచెం జాగ్రత్తపడతాను. మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళు నీ వెంట పడితే నిన్ను కాపాడతాను. లేకపోతే నేను మాత్రం ఏం చేయగలను?" అన్నాడు ఖలీల్ చాలా సార్లు.
అతను ఏమన్నా ఒంటె మాత్రం నోరు తెరవలేదు.
మరునాడు ఖలీల్ పాషా నిద్రలేచే సరికి పశువుల పాక ఖాళీగా ఉన్నది- ఒంటె అక్కడ లేదు! ఖలీల్ గబుక్కున లేచి అంతటా వెతికి చూశాడు. ఇదంతా ఆ దొంగలు చేస్తున్న పనే అని అనిపించిందతనికి. అయినా అరేబియాలో దొంగలు ఎటు పోగలరు? ఎడారిలోకే గదా? అందుకని అతను ఎడారిలోకి వెళ్ళి అన్ని ఒయాసిస్సుల దగ్గరా వెతికాడు. చూడగా తన ఒంటె మొదటి ఒయాసిస్సులోనే, నీళ్ళు త్రాగుతూ కనబడింది. ఎంత వెతికినా దొంగల జాడ అయితే, లేదు!
అయితే ఖలీల్ పాషాని చూడగానే ఒంటె బెదురుకున్నదానిమల్లే పారిపోవటం మొదలు పెట్టింది. ఖలీల్ దాని వెంటపడి పట్టుకొని, "నీకేమైంది? ఇట్లా ప్రవర్తిస్తున్నావెందుకు? నిన్ను వాళ్లెవరో- ఎందుకు చంపుదామనుకున్నారో చెప్పు. నేనుండగా నీకు భయం ఎందుకు?" అని రకరకాలుగా అడిగాడు. ఒంటె ఇక నోరు విప్పకుండా ఉండలేకపోయింది. తనకు, ఆ దొంగలకు మాత్రమే తెలిసిన రహస్యాన్ని అది ఇక దాచలేకపోయింది.
"నా కడుపులో వజ్రాలు ఉన్నాయి. వాటి విలువ కోట్ల కోట్ల దీనారాలు ఉంటుంది. ఆ వజ్రాల కోసమే, వాళ్ళు నా వెంట పడ్డారు. అయితే నీ బలం ఎంతటిదో చూశాక వాళ్ళు పారిపోయారు" అని చెప్పేసింది.
ఖలీల్ పాషా ఆశ్చర్యపోయాడు.
అతను ఒంటెను జాగ్రత్తగా ఇంటికి నడిపించుకొని వెళ్తూ ఆలోచనలో మునిగాడు: 'తనకూ వ్యాపారం ఉంది. వ్యాపారంలో పెట్టుబడి అవసరం ఉంది.
వజ్రాలు తనకీ అవసరమే!'
ఇంటికి చేరుకోగానే ఒంటెను చంపేసి, తనే దాని పొట్టలోని వజ్రాలు తీసుకున్నాడు- ఖలీల్ పాషా.
పాపం ఒంటె! రహస్యాన్ని కడుపులో దాచి ఉంచుకోలేక ప్రాణాలే పోగొట్టుకున్నది.