అయినాపురంలో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాల వాళ్ళు తమ బడిలో ముఖ్య కార్యదర్శి ఉద్యోగంకోసం అర్హులైన అభ్యర్ధులను ఇంటర్‌వ్యూకి పిలిచారు. అది వర్షాకాలం. ఆ ఊరికి రహదారులు సరిగా లేవు.
అదీకాక ఆ పాఠశాల ప్రదేశమంతా బురద బురదగా ఉంది.
పది గంటల సమయంలో ఇంటర్వ్యూలు మొదలయ్యాయి. వచ్చిన అభ్యర్థులు అందరూ అలాగే బురద లోంచి నడు చుకుంటూ ఆదరాబాదరాగా హాలులోకి చేరారు.
అక్కడ ఒకావిడ కూర్చొని ఉన్నది. వాళ్లందరి పేర్లనూ తన దగ్గరున్న రిజిస్టరులో రాసుకొని, వరసగా ఒక్కొక్కరినే లోనికి పంపసాగింది.
మిగిలినవాళ్లంతా అక్కడే కుర్చీలలో ను, బెంచీల మీదా కూర్చొని తమ వంతుకోసం ఎదురు చూడసాగారు.
వాళ్లలోనే ఒకడైన రవి కొంతసేపు ఊరికే కూర్చున్నాడు. తన వంతు వచ్చేందుకు ఇంకా చాలా సమయం పట్టేటట్టున్నది- 'ఆలోగా ఏం చేద్దాం?' అనుకున్నాడు. 'చదువుకునేందుకు ఏమైనా తెచ్చుకొని ఉంటే బాగుండేది' అనుకున్నాడు. 'సరేలే, ఇక్కడే ఏదో ఒక పని చేస్తుంటే సరి' అని సమాధానపడి, అటూ ఇటూ చూశాడు.
పాఠశాల ప్రాంగణం అంతా బురద బురదగా ఉంది. ఒక పక్కన ఇసుక, పాత ఇటుకలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఇసుకలో ఒక తట్ట, పార ఉన్నాయి.
రవి మెల్లగా లేచి అక్కడికి వెళ్ళాడు. పారతో ఇసుకను, ఇటుక ముక్కల్ని కొద్ది కొద్దిగా ఎత్తి దారిలో పోయటం మొదలు పెట్టాడు. మెల్లగా ఆ బురద మధ్యలోంచి చక్కని- సన్నని బాట ఒకటి తయారైంది.
"రవీ! రవీ! ఎవరయ్యా ఈ మనిషి, పేరు ఇచ్చి ఎక్కడికి వెళ్ళాడు? అందరివీ ఇంటర్వ్యూలు అయిపోయాయి- ఇతనొక్కడే మిగిలాడు!" అని ఎవరో అరుస్తుంటే రవి ఈ లోకంలోకి వచ్చాడు. గబగబా లోపలికి పరుగెత్తి చెప్పాడు, "నేనేనండీ , రవిని" అంటూ.
"ఎన్ని సార్లు పిలవాలయ్యా, నిన్ను? ఇంటర్వ్యూకి వచ్చేది ఇలాగేనా? నీ చేతులు ఎంత మురికిగా ఉన్నాయో చూడు? ఇన్‌షర్టూ చెదిరిపోయింది" కేకలు వేశాడు ఇంటర్వ్యూ బోర్డులో కూర్చున్న ఒక పెద్దాయన.
రవి తల వంచుకున్నాడు- "ఖాళీగా కూర్చోవటం ఎందుకని, ఇక్కడే చిన్నగా ఏదో పని చేస్తూ ఉండిపోయాను సార్, క్షమించండి" అన్నాడు.
పాఠశాల ఛైర్మన్ రావుగారు కుర్చీలోంచి లేచి బయటికెళ్ళి చూశారు- "ఈ ఇసకంతా అక్కడినుండి తెచ్చి పోసింది నువ్వేనా?" అడిగారు.
అవునన్నట్లు రవి తల ఊపాడు.
"మంచిపని చేసి తల వంచుకుం-టావేమయ్యా? తల నిటారుగా ఎత్తి మాట్లాడాలి, ఇంటర్వ్యూలో. ఇంతకీ నీకు ఎంత జీతం ఇమ్మంటావు? ఉద్యోగంలో ఎప్పటినుండి చేరతావు?" సూటిగా అడిగేశారు రావుగారు.
రవి నిర్ఘాంతపోయాడు.
రావుగారు తమ బడిలో పని చేస్తున్న ఉద్యోగులందరినీ రమ్మని, వాళ్లకు రవిని పరిచయం చేస్తూ అన్నారు: "డిగ్రీలు ఎందుకు? 'ఫలానావాడికి పనిచేసే సామర్ధ్యం ఉన్నది'అని తెలపటం వరకూ డిగ్రీలు చేస్తాయి. అంతే తప్ప, అవి మనుషుల వ్యక్తిత్వాన్ని పూర్తిగా ప్రతిఫలించవు. మీరు చూస్తున్న ఈ రవి, సమయాన్ని వృధా చేసే మనిషి కాదు. పనిచేయటానికి ఉత్సాహంగా ముందుకు వచ్చే వ్యక్తికి ఉదాహరణ ఇతను. ఇప్పటిదాకా ఇతను చేసిన పనే, అతని వ్యక్తిత్వానికి నిదర్శనం. మిగిలినవాళ్ళంతా 'తమ బాధ్యత కాదు' అనుకుని బురదని తొక్కుకుంటూ వచ్చారు; చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ఇంకా బురద చేసి వెళ్ళారు. ఇతను ఖాళీగా కూర్చోకుండా, తన సమయాన్ని సద్వినియోగం చేయటం గురించి ఆలోచించాడు. ఈ కొద్ది సేపట్లోనే పదిమందికీ ఉపయోగపడే పని చేశాడు. ఇలాంటి వ్యక్తిని నేను వదులుకుంటే మన సంస్థకే లోటు. అందుకని ఇతనికి నేను ముఖ్య కార్యదర్శి ఉద్యోగం ఇస్తున్నాను. త్వరగా వచ్చి చేరమని అభ్యర్థిస్తున్నాను" అని ప్రకటించారు. అందరూ చప్పట్లతో రవికి తమ అభినందనలు తెలిపారు.
సిగ్గుతోటీ, సంతోషంతోటీ రవి ముఖం వెలిగిపోయింది.