ఒక ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ల తండ్రి ఒకరోజున వాళ్లు ముగ్గురినీ పిలిచి, "ఒరే! నేను ముసలివాణ్ని అయిపోయాను.
ఇవాళ్ళో రేపో చనిపోతాను. అందుకని మనకున్న ఆస్తులన్నీ మీ ముగ్గురికీ సమానంగా పంచుతున్నాను. కలిసి ఉండండి, ఒకరికొకరు సహకరించుకోండి, ముగ్గురూ అభివృద్ధిలోకి రండి" అని ముగ్గురికీ సమాన భాగాలు పెట్టాడు. అనుకున్నట్లుగానే కొద్దిరోజులలో ఆయన కన్నుమూశాడు. అన్నదమ్ముల్లో చిన్నవాడు కొంచెం అమాయకుడు. అవకాశం కోసమే ఎదురు చూస్తున్న అన్నలిద్దరూ తమ్ముణ్ని కొట్టి తరిమేశారు.
వాడి ఆస్తిని కూడా తామే తీసుకున్నారు. అమాయకుడైన చిన్నవాడు ఏమీ అనలేదు. 'మంచివాళ్లను దేవుడే కాపాడుతాడు' అని ఊరి ప్రక్కన వున్న అడవిలో కట్టెలు కొట్టుకొని జీవించటం మొదలు పెట్టాడు.
ఒకరోజున అతను కట్టెలు కొట్టుకొంటుండగా ఒక పావురం అరుపు వినిపించింది. దానికి ఏదో దెబ్బ తగిలినట్లుంది, దీనంగా అరుస్తున్నది.
చిన్నవాడు వెళ్ళి చూసే సరికి, దాని కాలునుండి రక్తం కారుతున్నది. స్వతహాగా సున్నిత మనస్కుడైన తమ్ముడు దాన్ని చూసి జాలిపడ్డాడు. దాన్ని చేతిలోకి తీసుకొని, కాలికి గుడ్డకట్టి, తినేందుకు గింజలు వేసి, ప్రమాదాల బారిన పడకుండా ఎత్తుగా ఉంచి కాపాడాడు. మూడు నాలుగు రోజుల్లో ఆ పావురం ఆరోగ్యం కుదురుకున్నది. అది సంతోషంగా రెక్కలాడిస్తూ ఎగిరిపోయింది.
మరుసటి రోజున ఆ పావురం ఒక దోస గింజను పట్టుకొచ్చి చిన్నవాడి ఇంటిలో వేసి వెళ్ళిపోయింది. 'పావురం అంత ఇష్టంగా తెచ్చి ఇచ్చింది కదా' అని సంబరపడి, అతను ఆ గింజను తలుపు ప్రక్కగా నాటి నీళ్ళు పోసాడు. తెల్లవారి లేచి తలుపు తెరిస్తే రావటంలేదు! గట్టిగా లాగాడు- ఆశ్చర్యం! దోసతీగ ఒక్కరోజులో మొలిచి, పెద్దదై, ఇంటి చుట్టూ అల్లుకున్నది; నిండుగా కాయలు కూడా కాసింది! ఇంటి చుట్టూతానే కాదు; ఇంటి మీద కూడా- దోసతీగ అల్లుకుని నిండుగా దోసకాయలు కాసి ఉన్నది!
"ఆహా! బలే తొందరగా పెరిగిందే! ఏమి రకమో చూడాలి" అని తమ్ముడు ఒక దోసకాయని కోసి చూసాడు. చూడగా ప్రతి దోసకాయ లోపలా బంగారం! తమ్ముడు చాలా సంతోషపడి, దోసకాయలన్నీ కోసి పెట్టుకొన్నాడు. వాడు అమాయకుడు కదా, అందుకని అన్నలమీది అభిమానంతో కొన్ని కాయలు పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అయితే అన్నలు వాడిని చూడగానే ఆస్తిలోవాటా అడుగుతాడని అనుమానపడి, బయటే నిలబెట్టి మాట్లాడారు. సరేలెమ్మని, వాడు తలా రెండు కాయలు ఇచ్చేసి వెనక్కి తిరిగాడు.
అన్నలిద్దరూ ఆ కాయల్ని ఇంట్లోనే ఓ మూలకి పడేసి ఊరుకున్నారు.
ఆలోపల తమ్ముడు తన దగ్గరున్న కాయల్లో మూడు నాలుగు కాయలు కోసి, వాటిలోని బంగారం అమ్ముకొని, ఇంటికి అవసరమైన వస్తువులన్నీ కొన్నాడు. ఆ వస్తువులన్నీ తమ్ముడి ఇంటి ముందు దిగటం చూసేసరికి అన్నలిద్దరికీ అనుమానం వచ్చింది. అప్పుడు వాళ్ళు తమ్ముడిచ్చిన కాయలు కోసి చూస్తే, వాటినిండా బంగారం!
వెంటనే వాళ్ళు ఇద్దరూ తమ్ముడి దగ్గరికి వెళ్ళి "ఇవి నీకెక్కడివిరా?" అని అడిగారు. తమ్ముడు జరిగిందంతా పొల్లు పోకుండా చెప్పాడు.
అది విన్నాక వాళ్ళకు నిద్రపట్టలేదు. పెద్దవాడు రెండవ వాడిని అడవిలోకి పంపి, "ఎలాగైనా నువ్వు ఆ కాళ్ళు విరిగిపోయిన పావురాన్ని తీసుకొని రావాలిరా, తమ్ముడూ" అని చెప్పాడు. అతను వెళ్ళి అడవికి వెళ్ళి చూస్తే అసలెక్కడా అలా కాళ్ళు విరిగి పోయిన పావురం కనపడలేదు. అప్పుడు అతను కొంచెం ఆలోచించి, ఒక రాయి తీసుకొని దగ్గర్లో చెట్టుమీద కూర్చొని ఉన్న ఓ పావురం మీదికి బలంగా వేసాడు. అది రాయి తగిలి పడిపోగానే, వాడు దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి అన్నకి చూపించాడు.
పావురం ఎగిరిపోదామని తన్నుకుంటున్నది. అన్నలిద్దరూ కలిసి దాన్ని గట్టిగా పట్టుకొని, గాయానికి కట్టు కట్టారు. అన్న అన్నాడు, "ఒరే, మనం దీన్ని వదిలామంటే ఇది ఎగిరిపోయి, ఇక మళ్ళీ రాదు; అందుకని దీన్ని పంజరంలో పెడదాం ఆగు" అని. సరే అని వాళ్ళు ఇద్దరూ దాన్ని పంజరంలో పెట్టి మూడు రోజులు అసలు పట్టించుకోకుండా వదిలేశారు. నాలుగో రోజున పంజరం తలుపులు తెరిచి చూశారు 'అది ఎలా ఉంద'ని.
మూడు రోజుల పాటు ఆకలితో నకనకలాడిన పావురం వాళ్ళు పంజరం తలుపులు తెరవగానే ఎగిరిపోయింది. అన్నలిద్దరూ 'అయ్యో' అనుకొని చూసేసరికి, పంజరంలో వాళ్లకూ ఒక దోస గింజ కనబడ్డది. దాన్ని చూడగానే వాళ్లకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఇద్దరూ కలిసి ఆ గింజను నేలలో నాటి, రాత్రంతా నిద్రపోకుండా కాపలా కాశారు.
ఆశ్చర్యం! తమ్ముడికి ఎలా జరిగిందో అలాగే జరిగింది- తెల్లవారేసరికల్లా ఒక పెద్ద దోసతీగ ఇంటి చుట్టూ అల్లుకొని ఉన్నది!
"నేను ముందు కోస్తా ! నేను ముందు కోస్తా !" అని పోట్లాడుకొని వాళ్ళిద్దరూ గబగబా కాయలన్నీ కోసుకొని ఇంట్లో కుప్ప చేసారు. "చూడనివ్వురా, ఒక్కోదాంట్లో ఎంత బంగారం ఉందో!" అని వాళ్ళు ఆ కాయల్ని కోసి చూస్తే ఏముంది- ప్రతి కాయలోనూ పాములు తేళ్ళు ! ఆ పాములు, తేళ్ళు వెంటపడి తరిమేసరికి అన్నలిద్దరూ ఊరువిడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది!