ఆ రోజు సోమవారం. ఉదయం ఎనిమిదిగంటలకు సౌమ్య పుస్తకాల సంచి తీసుకొని బడికి బయలుదేరింది.
దారిలో సోము అనే కోతి కలిసింది సౌమ్యను. అది, సౌమ్య ఎప్పటినుండో స్నేహితులు.
"మనం అడవిలోకి వెళ్దామా? రకరకాల పండ్లు కోసుకొని తినచ్చు?!" అడిగింది సోము.
"సరే, వెళ్దాం. కానీ ఇంటర్వెల్ లో పండ్లరసాలు త్రాగి వచ్చేందుకు చిన్న విరామం ఇస్తారు కదా, అప్పుడు వెళ్దాం!" అని చెప్పింది సౌమ్య.
విరామ సమయం అవ్వగానే సౌమ్య అక్కకి చెప్పింది- "నేను నీళ్ళు త్రాగి వస్తానక్కా" అని. "దానిదేముంది, వెళ్ళి త్రాగి రా" అన్నది అక్క.
అంతే, సౌమ్య సోముని వెంటబెట్టుకొని అడవిలోకి పరుగెత్తింది.
అడవిలో పండ్లను కోసుకుంటూ, తింటూ ఒక కొండమీదికి చేరుకున్నారు సౌమ్య, సోము. అక్కడ వాళ్లకు ఒక పాత గుడి కనబడింది.
"అరే, ఈ గుడి ఎక్కడినుండి వచ్చింది?! ఇన్నేళ్ళుగా నేను ఇక్కడే ఉన్నాను; అయినా ఇదిఎప్పుడూ కనబడనే లేదు!" ఆశ్చర్యపోయింది సోము.
సౌమ్యకూడా ఆ గుడిని ఎప్పుడూ చూడలేదు. కానీ తనకు అన్నీ తెలిసినట్లు పోజు పెట్టింది. "లోపలికి వెళ్దాం పద!" అన్నది.
ఇద్దరూ ఆ గుడిలోకి వెళ్ళారు. గుడి లోపల చాలా చీకటిగా ఉన్నది. దారి అస్సలు కనబడటమే లేదు. దాంతో సోముకి భయం వేసి, వెంటనే బయటకి వచ్చేసింది.
సౌమ్యకి కూడా చాలా భయం వేసిందిగానీ, సోము ముందు పోజు కొట్టాలని, అలాగే ముందుకి వెళ్ళింది.
గుడి మధ్యకు చేరుకునే సరికి, సౌమ్య కాళ్ళకు ఏదో చుట్టుకున్నది. నడుముకు ఏదో అడ్డం వచ్చింది. చేతులు రెండూ కలిపి కట్టబడ్డాయి! తనకు తెలీకుండానే ఏదో ఉచ్చులో చిక్కుకుంది సౌమ్య. ఆ పాపకు చాలా భయం వేసింది. బిగ్గరగా కేకలు వేసింది.
ఆ కేకలు బయట ఉన్న సోముకు వినబడలేదు గానీ, అక్కడ ఉచ్చును బిగించిన మంత్రగత్తెకి మాత్రం బాగా వినబడ్డాయి.
ఆ మంత్రగత్తె గబుక్కున అటు తిరిగి వచ్చి, ఉచ్చులో చిక్కుకున్న సౌమ్యని చూడగానే "హ్హ హ్హ హ్హ హ్హ హ్హ" అని బిగ్గరగా నవ్వింది. "నువ్వు చాలా చిన్నగా, లేతగా ఉన్నావు పిల్లా, నిన్ను కొరుక్కొని తింటే చాలా బాగుంటుంది. కానీ నీవల్ల కావాల్సిన పని ఒకటి ఉంది- ఏం చేసేది? ఆ పనైనాక, కావాలంటే అప్పుడు తింటాను నిన్ను" అంది.
సౌమ్యకి ఏడుపు వచ్చింది. "అక్కకి అబద్ధం చెప్పి వచ్చినందుకు తగిన శాస్తి అయ్యింది. ఇప్పుడు ఎట్లాగోఒకలాగా తప్పించుకోగలిగితే బాగుండు.
ఇంకెప్పుడూ అక్కకి అబద్ధం చెప్పను" అని ఏడిచింది.
"ఊరికే ఏడవకు పిల్లా, గుడి లోపలికి పో. అక్కడ అమ్మవారి వేలికి ఒక ఉంగరం ఉంటుంది. దాన్ని నేను సొంతగా తీసుకోలేను- నీలాంటి మంచి పిల్లలే దాన్ని తీయగలరు. దాన్ని తెచ్చి నాకు ఇచ్చావంటే, నిన్ను వదిలేయటం గురించి ఆలోచిస్తాను నేను- జాగ్రత్త, ఇక్కడ అంతా పాములు తిరుగుతున్నాయి- దొంగ వేషాలు వెయ్యకు. నేరుగా లోపలికి పో" అన్నది మంత్రగత్తె.
"నేను పోను" అని అరుద్దామనుకున్నది సౌమ్య. కానీ ఏం ప్రయోజనం? వేరే దారి లేదు కదా? అందుకని మారు మాట్లాడకుండా గర్భగుడి లోపలికి పోయింది. అక్కడ అమ్మవారి విగ్రహం పెద్దగా నిలబడి ఉన్నది. సౌమ్య అమ్మవారి వేలికి ఉన్న ఉంగరాన్ని తీసుకొని తన గుప్పిట్లో పెట్టుకొని వెనుకకు తిరిగింది. అంతలోనే సోము మాటలు వినబడ్డాయి పైనుండి- పైన ఉన్న కన్నంలోంచి చూస్తున్నది అది!
"ఏం చేయబోతున్నావు ఉంగరాన్ని?! మంత్రగత్తెకు ఇవ్వకు! దాన్ని రుద్ది, తుడిచి, కడిగి- ఇంకేదైనా చేసి చూడు- దానిలో ఏముందో చూడకుండా ఊరికే మంత్రగత్తెకు ఇచ్చేస్తే ఎలాగ?" గుసగుసగా అన్నది సోము.
"అవునవును- దీనిలో ఏదో శక్తి ఉండే ఉంటుంది" అని ఉంగరాన్ని పెట్టుకొని దాన్ని గబగబా రుద్దింది సౌమ్య.
వెంటనే ఉంగరంలోంచి పెద్దగా పొగ వచ్చింది. చూస్తూండగానే ఆ పొగలోంచి ఒక భూతం వచ్చింది. "నమస్కారం పాపా! నేను ఈ ఉంగరం భూతాన్ని! నీకు ఏదైనా ఒక మేలు చేస్తాను. అడుగు" అన్నదా భూతం, వంగి సౌమ్యకు నమస్కరిస్తూ.
"నన్ను ఈ మంత్రగత్తె నుండి రక్షించి మా బడికి చేర్చు" అడిగింది సౌమ్య.
"ఎంత చిన్న కోరిక కోరావు! ఒక్క క్షణంలో నెరవేరుస్తాను. కళ్ళు మూసుకో ఒక్క క్షణం!" అని ఉంగరం భూతం సౌమ్యను అక్కడినుండి మాయం చేసి వాళ్ల బడిలోకి చేర్చి వదిలింది.
ఎంతో సేపటినుండి సౌమ్యకోసం వెతుకుతున్నారు వాళ్ల స్నేహితులూ, అక్కానూ. వాళ్లంతా సౌమ్యను చూడగానే తన చుట్టూమూగి ప్రశ్నల వర్షం కురిపించారు- సౌమ్య జరిగిందంతా చెబితే వాళ్లంతా బిగ్గరగా నవ్వారు- "భలే చెబుతున్నావే, కొత్తపల్లి కథలాగా?!" అన్నారు.
"కాదు, నిజం! కావాలంటే ఇదిగో చూడండి, ఉంగరాన్ని!" అని మూసి ఉన్న తన గుప్పిటిని తెరిచింది సౌమ్య. అందులో ఉంగరం లేదు! పిల్లలందరూ మళ్ళీ నవ్వారు. "భలే కల వచ్చినట్లుంది సౌమ్యకి!" అన్నారు.
"కావాలంటే సోము వచ్చాక అడుగుదాంలే. అయినా ఆ మంత్రగత్తె బెడద తప్పింది- అంతే చాలు" అనుకొని, నవ్వి ఊరుకున్నది సౌమ్య.
అయితే పెద్దయ్యాక ఎన్నిసార్లు ఆ కొండ ఎక్కినా మళ్ళీ సౌమ్యకు గుడి కనబడలేదు; మంత్రగత్తె కూడా కనబడలేదు; ఉంగరమూ దొరకలేదు!