పూర్వం భూలోకంలో ఆవులు, ఎద్దులు ఉండేవి కావు. కైలాసంలో ఉండే శివుడికి వాహనంగా ఉండేది ఎద్దు. ఆవు, ఎద్దుకి భార్య కదా, అందుకని అది కూడా మరి అక్కడే ఉండేది. సరే, అప్పుడేమైందంటే, బ్రహ్మదేవుడు మానవులందర్నీ సృష్టించి, "భూలోకంలో ఈ మానవులంతా ఎలా జీవించాలో, వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏమిటో నువ్వే చూసుకోవాలి ఈశ్వరా!" అన్నాడు.
"సరేలే, నేను ఆలోచించి చెబుతాను వాళ్లందరికీ!" అన్నాడు శివుడు. ఇక ఆనాటి నుంచీ ఆయన శ్రద్ధగా ఆలోచించి, మానవులంతా పాటించవలసిన నియమాలను ఒక్కటొక్కటిగా దండోరా వేయించసాగాడు తన వాహనమైన ఎద్దుతో.
ఒక రోజు ఎద్దుని పిలిచిన శివుడు, "బసవన్నా! భూలోకంలో ప్రజలంతా ఎంత కంపు కొడుతున్నారో చూశావు కదా?! అందుకని నువ్వు ఈ రోజే భూలోకానికి వెళ్ళి దండోరా వేసిరావాలి- 'మానవులంతా మూడు పూటలా స్నానం చేయాలి; ఒక పూట తిండి తినాలి ' ఈ సంగతి అందరికీ చెప్పిరా, పో. వెంటనే వెళ్ళు!" అని అజ్ఞాపించాడు.
"అలాగే దేవా!" అంది ఎద్దు.
అయితే దానికి ఆ రోజున ఎక్కడికీ వెళ్ళాలని లేదు. ఇంటి దగ్గర తన భార్య ఆవు పచ్చి గడ్డి పచ్చడి, జొన్న కంకుల పప్పు, సజ్జ రొట్టెలు చేస్తోంది: దాని మనసంతా తిండి పైనే ఉంది. ఒక్క క్షణం పాటు అది "ఇవాళ్ల వెళ్ళనులే, రేపు వెళ్తాను" అనుకున్నది. కానీ అది కుదరదు- శివునాజ్ఞను నెరవేర్చాల్సిందే!
'సరే , ఏం చేస్తాం?! త్వరత్వరగా వెళ్ళి భూలోకంలో ఈ చిన్న దండోరా వేసి వచ్చేస్తే సరి- హాయిగా మంచి భోజనం చేయచ్చు ' అనుకొని వడి వడిగా భూలోకం చేరింది ఎద్దు.
"అందరూ వినండహో! శివునాజ్ఞ - ఇది శివునాజ్ఞహో! -ఇకనుండీ ప్రతి ఒక్కరూ మూడు పూటలా తినాలహో; ఒక్క పూట స్నానం చేయాలహో! అందరూ గుర్తుంచుకోండహో! ఇది శివునాజ్ఞహో! మీరరానిదహో!" అని అరుస్తూ, డప్పు కొట్టుకుంటూ తిరిగి తిరిగి అందరికీ చెప్పింది ఎద్దు.
ధ్యాసంతా ఇంటిమీదా, భార్య చేసిన వంట మీదా ఉన్న ఎద్దుకి తను చేసిన తప్పు తెలియనేలేదు కైలాసం చేరేదాకా!
కోపంగా చూస్తూ ద్వారంలోనే నిలబడి ఉన్నాడు శివుడు! ఆయన వెనకగా నిలబడి దిగులుగా చూస్తోంది పార్వతమ్మ. చేతులు నలుపుకుంటూ ఆందోళన పడుతోంది ఆవమ్మ.
ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా వారి వైపు చూసింది ఎద్దు.
"ఒక పూట తిని మూడు పూటలా స్నానం చేయమని చెప్పి రమ్మంటే, మూడు పూటలా తిని ఒక పూట స్నానం చేయాలని దండోరా వేసి వస్తావా?" అన్నాడు శివుడు మండిపడుతూ.
నాలిక్కరుచుకున్నది ఎద్దు- "క్షమించండి దేవా!" అంది.
"క్షమించాలా? ఇది ఎంత పెద్ద తప్పో తెలుసా?! దీన్ని ఇక ఎవ్వరూ మార్చలేరు! ఈ తప్పుకి నువ్వే బాధ్యత వహించాలి, తప్పదు!" అన్నాడు శివుడు.
"ఏం చేయమంటే అది చేస్తాను. శలవియ్యండి స్వామీ! అంది ఎద్దు- "ఆఁ..ఏముంది, మళ్ళీ దండోరా వేసి రమ్మంటాడు అంతే కదా! అంతగా అయితే భోజనం చేసాక వెళ్ళి చెప్పి రావచ్చు " అని మనసులో అనుకుంటూ.
"నువ్వు నీ భార్య బిడ్డలతో సహా శాశ్వతంగా భూలోకంలోనే ఉండు. మానవులున్నంత కాలం నువ్వు , నీ బిడ్డలు-బిడ్డల బిడ్డలు- అలా అందరూ పొలాలు దున్ని, మానవులకి మూడు పూటలకీ కావలసిన ఆహారాన్ని సమకూరుస్తూ జీవించండి!" అని శపించి, 'ఇంకేమీ మాట్లాడేది లేదు' అన్నట్లుగా విసవిసా నడుస్తూ లోపలికి వెళ్ళిపోయాడు శివుడు.
ఆయన్ని అనుసరించింది పార్వతమ్మ.
ఎద్దు అవాక్కయ్యింది. 'అయ్యో! మారిన శివునాజ్ఞని శివుడు కూడా మార్చలేదే!'అనుకున్నది.
అయినా చేసేదేమున్నది? భార్య పెట్టిన భోజనాన్ని ఇష్టంగా తినేసి, అటుపైన కాపురాన్ని భూలోకానికి తరలించింది.
అప్పటి నుండీ అది భూలోకంలోనే ఉంటూ, పాపం మన పొలాలని దున్ని పంటలు పండిస్తోంది.
తన భర్తకు సహాయపడాలని, ఆవు పాలని ఇస్తోంది. అదన్నమాట సంగతి!