పొడరాళ్ళపల్లి- అక్కమ్మకొండలో గుండుదోన క్రింద ఓ మర్రిమాను. మధ్యాహ్నం పూటల్లో పశువుల కాపర్లు పశువులకు నీళ్ళు తాపాక, వాటిని ఆ మర్రిమాను కిందే వదిలి కొంతసేపు విశ్రాంతిగా పడుకుంటారు. మూడు వారాల నుండి ఆ చెట్టుక్రింద ఒకాయన కనబడుతున్నాడు- కాషాయవస్త్రం; తెల్లటిగడ్డం- జుట్టేమో అట్టలుకట్టి, తలపాగాలాగా చుట్టుకుని ఉన్నది. ఎవరో సాధువు అన్నమాట- కళ్ళు మూసుకుని ఉన్నాడు; అన్నం తినడు; ఎప్పుడో ఒకసారి లేచి, చెలమలోని నీళ్ళు త్రాగి, మళ్ళీ ధ్యానంలో కూర్చుంటాడు. ఆయన వింత దినచర్య సంగతి పశువుల కాపర్ల ద్వారా అన్ని పల్లెలలోనూ తెలిసింది.

ప్రజలు రావటం మొదలుపెట్టారు. మొక్కుతున్నారు; టెంకాయలు, పూలు సమర్పిస్తున్నారు. సాధువు కొందరివైపు చూడడు. కొందరినేమో పేరు పెట్టి పిలుస్తాడు. కొందరికి తనకు తోచిందేదో చెబుతాడు. చలమయ్య, విరుపాక్షి, హనుమంతులు ఆయనకి అక్కడే ఓ చిన్న కుటీరం నిర్మించారు. త్వరలోనే భక్తుల సౌకర్యార్థం కాలిబాట కాస్తా రోడ్డుగా మారింది. ఇప్పుడు ఆ రోడ్డు మీద వాహనాలు తిరుగుతున్నాయి. మర్రిమాను పరిసరాల్లో నీటి సౌకర్యం ఏర్పడింది. సత్రాలు తయారయ్యాయి. సాధువుతో పాటే రాత్రిళ్ళు కొంత మంది భక్తులు నిద్రిస్తున్నారు.

ఆయన చెప్పిందల్లా జరుగుతున్నదని ప్రచారం మొదలైంది. భక్తులు కానుకలు ఇవ్వటం, సాధువు చుట్టూ ఉన్న శిష్యులు వాటిని అందుకోవటం జరుగుతున్నది. ఆయన శిష్య బృందం త్వరలోనే బాగా పెద్దదయింది. సాధువు కాస్తా స్వామీజీ అయ్యారు. స్వామీజీకి రాని విద్య అంటూ లేదు.

వైద్యం, జ్యోతిషం, వాస్తు- ఏదంటే అది చెబుతాడాయన. ఇవన్నీ ఒక ఎత్తు; దోష నివారణకుగాను ఆయన చేసే పూజలు మరొక ఎత్తు.

దోష నివారణ పూజ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందరికీ అది ప్రత్యేక ఆకర్షణ కూడా. దోషం ఉన్న వాళ్ళందరూ దూరం దూరంగా కూర్చొని ఉంటారు ఇసుకలో. ఎవరికి వాళ్ళు హారతి పళ్ళెంలో పసుపు కుంకుమ కలిపిన నీళ్ళు పోసి పెట్టుకుని, స్వామివారికోసం వేచి చూస్తుంటారు. స్వామీజీ‌ శిష్య బృందంతో బాటు వచ్చి, అమ్మవారికి పూజ చేసి హారతి ఇస్తారు. కర్పూరపు సువాసనలతో ఆ ప్రాంతం అంతా ఘుమఘుమలాడుతూంటుంది.

అటుపైన స్వామీజీ ఒక్కరొక్కరి దగ్గరికీ వస్తారు. ఎవరిముందున్న హారతి పళ్ళేన్ని వారి చుట్టూ త్రిప్పి దిష్ఠితీస్తారు. ఆ నీటిని వారి ఎదురుగానే ఇసుకలో పోస్తారు. స్వామీజీ శిష్యుడొకడు అగ్గిపుల్ల వెలిగించి ఆ నీళ్ళు పోసిన చోట వేస్తాడు. మరుక్షణం అక్కడ మంటలు మండుతాయి!

స్వామీజీ సంతోషంగా నవ్వి, వారిని ప్రశంసిస్తారు. వాళ్ల దోషాలు, వాళ్ల శత్రువులెవరో చేసిన తంత్రాలు, రోగాలు, వాళ్లని పట్టిన దయ్యాలు-భూతాలు ఇవన్నీ ఆ మంటల్లో కాలి బూడిదైపోయినందుకు మెచ్చుకుంటారు. అటుపైన వాళ్లంతా ఆశ్రమానికి వాళ్ల దగ్గరున్న బంగారం, డబ్బు దానం చేస్తారు.

కొంత మందినుండి ప్రత్యేకంగా మరింత సొమ్మును వసూలు చేస్తారు శిష్యులు.

కొంతమంది ముందు మంటలు రావు. అట్లాంటి వాళ్లని 'ఇంకా కొన్ని వారాలు ఇక్కడే నిద్ర చేయండి' అంటారు. అట్లా ఆ ప్రదేశం అంతా ఎప్పుడూ మనుషులతో కిటకిటలాడి పోతున్నది; ఒకరిని చూసి ఒకరుగా అందరూ వస్తున్నారు. స్థానిక పేపర్లలో స్వామీజీ ప్రత్యేక ప్రకటనలు ఇస్తున్నారు; పత్రికలవాళ్ళు ఆయన్ని కొనియాడుతూ ప్రత్యేకంగా రాస్తున్నారు. ఆ పత్రికలు ఉచితంగా ఇచ్చే క్యాలెండర్లలో స్వామివారి ముఖం వెలిగిపోతూ కనబడసాగింది.

శంకరయ్యది కూడా పొడరాళ్ళపల్లే- పిల్లల చదువుల కోసం పట్నంలో ఉంటున్నాడు. 'ఈ ప్రపంచంలో ఏది జరిగినా దానికి మనం కనుక్కోగల కారణం ఒకటి ఉండి తీరుతుంది' అని అతనికి చాలా నమ్మకం. అందుకనే శంకరయ్య "సైన్స్ ప్రచార వేదిక"లో సభ్యుడయ్యాడు. గ్రామాల్లో మూఢనమ్మకాలని పారద్రోలేందుకు కృషి చేస్తున్నాడు. 'మంత్రాలు, తంత్రాలు లేవు- ఉన్నవన్నీ‌ మ్యాజిక్కులే' అనే శంకరయ్య ఓ రోజు క్యాలెండర్లో స్వామీజీ ముఖం చూసి, "ఎవరో నాకు తెలిసిన వాడిమల్లేనే ఉన్నాడే; ఎవరబ్బా?!" అని తల గోక్కున్నాడు. కొంత సేపటికి గుర్తొచ్చింది- 'వీడిది ఆ ప్రక్క ఊరే. చదవటం కూడా రాని పదో తరగతి పిల్లలను ఫస్ట్ క్లాసులో పాసు చేయిస్తానని చెప్పి, వాళ్ల దగ్గర డబ్బులు వసూలు చేసి, ఎవరికీ కనబడకుండా పారిపోయిన 'చీటింగ్ చంద్రాగాడు' వీడు!' "అమ్మో! మళ్ళీ వేషం మార్చి, గారడీ నేర్చి, జనాలను మోసం చేస్తున్నావా? ఉండు, నీ బండారం బయట పెడతా!" అనుకున్నాడు శంకరయ్య.

దసరా సెలవుల సమయం. పొరుగు గ్రామం నుండి క్రొత్త సన్యాసి ఒకడు పాదయాత్ర చేసుకుంటూ పొడరాళ్ళపల్లి చేరుకున్నాడు. అతనితోబాటు పిల్ల శిష్యులూ వచ్చారు పదిమంది. వచ్చీ రాగానే శిష్యులందరూ తలా ఒక తట్టెడు ఇసుకనూ తీసుకొచ్చి వీధుల మధ్యలో పోసారు. "రండి! మీకు నచ్చినవాళ్లని తలుచుకోండి! మీ బోరులో నీళ్ళు ఒక గ్లాసెడు తెచ్చి ఈ ఇసుకలో పోయండి! అగ్గిపుల్ల గీసి పడేయండి! నీళ్ళెలా మండుతాయో చూడండి! అంతా మహాత్యం! అద్భుత శక్తి" అని అరుస్తూ తిరిగారు. ఇళ్ళలో వాళ్ళు అందరూ వీధుల్లోకొచ్చారు. ఇసుక కుప్పల మీద నీళ్ళుపోసి అగ్గి పుల్లతో వెలిగించారు. ఆశ్చర్యం! నీళ్ళు మండాయి!

అంతలో పాత స్వామి శిష్యులు కొందరు కొత్తస్వామిని కలిసారు. తమ ఆతిధ్యం స్వీకరించమని అభ్యర్థించారు. క్రొత్తస్వామి చిరునవ్వు నవ్వాడు.

సరేనన్నాడు. తన శిష్యులతోబాటు వెళ్ళి పాతస్వామిని కలిసాడు. ఒక గంటకల్లా పాతస్వామి, క్రొత్తస్వామి కలిసి ప్రజలకు సందేశం ఇస్తారన్న వార్త వెలువడింది. ఆ రోజు సభలో పాతస్వామి దైవశక్తిని ప్రశంసిస్తూ ఉపన్యసించారు. క్రొత్తస్వామిని మెచ్చుకుని, మైకునందించారు.

క్రొత్తస్వామి స్టేజికెదురుగా ఉన్న ఇసుక కుప్పమీద నీళ్ళు చల్లారు. గ్రామంలోని యువకుడొకడిని గబుక్కున రమ్మన్నాడు. ఆ కుప్పను కెలికి లోపల ఏముందో చూడమన్నాడు. వాడు వెతికి ప్రత్యేకంగా కనబడుతున్న ఓ రాయిని బయటికి తీసాడు. 'దాన్ని వాసన చూడు-' అన్నాడు క్రొత్తస్వామి.

"ఇది కార్బైడు- మామిడిపళ్ళు, అరటిపళ్ళు మాగబెట్టేందుకు వాడే కార్బైడు ఇది!" అన్నాడు వాడు , నిర్ఘాంతపోతూ.

"దీనిమీద నీళ్ళు చల్లితే అసిటలిన్ గ్యాసు వస్తుంది. వెల్డింగువాళ్ళు వాడేది ఆ గ్యాసునే! ఇదిగో, ఇప్పుడు ఆ రాయిమీద ఇంకొన్ని నీళ్ళు పోసి, అంటించి చూడు- కావాలంటే" అన్నాడు క్రొత్తస్వామి.

పాతస్వామివారు, వారి శిష్యులు ఒక్కసారిగా లేచారు. "మోసం! దగా!" అని అరిచారు.

ఆలోగా కొందరు యువకులు కార్బైడుమీద నీళ్ళు పోసి మండించనే మండించారు. ఆ వెలుగులో క్రొత్తస్వామి తను పెట్టుకున్న పెట్టుడు గడ్డాన్ని తొలగించాడు. అతను మరెవరో‌కాదు; ఊరి వారందరికీ తెలిసిన శంకరయ్యే!

ఉగ్ర రూపంలో అతని మీదికి ఉరక బోతున్న పాతస్వామిని, శిష్యుల్ని అక్కడే మఫ్టీలో తిరుగుతున్న పోలీసులు పట్టుకున్నారు.

శంకరయ్య పదేళ్ళక్రితం పేపరును తెరచి పట్టుకొని ఊళ్ళోవాళ్ళందరికీ చూపించాడు- "గుర్తు పట్టలేదా, ఎవ్వరూ? చీటింగ్ చంద్రని?!" అడిగాడు.

గ్రామస్తులంతా ముక్కుమీద వేళ్ళు వేసుకున్నారు.

"ఔరా! ఒట్టికినే మనందరినీమళ్ళీ ఓ ఆటాడించేశాడే, వీడు!" అన్నారు.

"మనందరి పేర్లూ వాడికి ముందుగానే తెలుసు! అందుకే మరి, అందరినీ చక్కగా పేరు పెట్టి పిలిచేసి గొర్రెల్ని చేసాడు" అన్నాడొక గ్రామస్తుడు పళ్ళు నూరుతూ.

"అసిటలిన్ గ్యాసుకు ఒక రకం వాసన ఉంటుంది. ఆ వాసన తెలియకుండా స్వామివారు కర్పూర హారతి ఇస్తారన్నమాట! తలలు ఊపే గొర్రెలు ఉన్నంతకాలం ఇట్లాంటి చీటింగ్ చంద్రలు ఉంటూనే ఉంటారు. మనందరం చదువుకోవలసింది అందుకే; మన మూఢనమ్మకాల్ని దూరం చేసుకునేటందుకే!" అన్నాడు శంకరయ్య .

కోపంతో ఉడికి పోతున్న గ్రామస్తుల బారినుండి చీటింగ్ చంద్రని, వాడి అనుచరుల్నీ కాపాడి పోలీసు జీపుకెక్కించటం పెద్ద పనే అయింది!