ఒక ఊరిలో ఒక పొట్టేలుండేది. అది రోజూ ఊరి బయట కెళ్లి మేతమేసి వచ్చేది. ఒకసారి ఆ ఊరిలో కరువొచ్చింది. మనుషులకే కాదు, పశువులకు కూడా తిండి దొరకడం కష్టమైంది. అలా తిండి దొరకక పొట్టేలు బక్కచిక్కి పోయింది.

ఆ ఊరికి కొంతదూరంలో ఒక అడవి ఉంది. ఆ అడవిలోకి తిండి కోసం బయలుదేరింది పొట్టేలు. దారిలో ఒకనక్క ఎదురైంది దానికి. నక్కకు పొట్టేలును చూడగానే నోట్లో నీరూరింది. "పొట్టేలు బావా... పొట్టేలు బావా... నిన్ను తినాలనిపిస్తోంది" అంది.


దానికా పొట్టేలు బాగా ఆలోచించి, "నక్క బావా, నక్కబావా! ఇప్పుడు నాలో ఎముకలు తప్ప, కండలు లేవు. చాలా రోజుల నుండి తిండి తినక, సగానికి సగం చిక్కిపోయాను. నన్నొదిలేస్తే నల్ల కొండకు వెళ్లి నాలుగాకులు, ఎర్రకొండకు వెళ్లి ఏడాకులు, పచ్చకొండకు వెళ్లి పదాకులు మేసి, బాగా బలిసి వస్తాను- అప్పుడు తిందువుగానిలే" అంది. "అలాగా.... ఐతే తొందరగా పోయి, బాగా బలిసిరా, పో!" అని దాన్ని విడిచిపెట్టింది నక్క.




బ్రతుకుజీవుడా అని పొట్టేలు కాస్త దూరం వెళ్ళిందో లేదో- ఈసారి ఒక పులి ఎదురు వచ్చింది. అది ఒక్క ఉదుటున ఎగిరి పొట్టేలును పట్టుకొని- "పొట్టేలు బావా, పొట్టేలు బావా! నిన్ను తినాలనిపిస్తోంది" అన్నది. దానికా పొట్టేలు "పులి బావా-పులిబావా ! ఇప్పుడు నాలో ఎముకలు తప్ప కొవ్వు అస్సల్లేదు. నన్నొదిలేస్తే నల్ల కొడకు వెళ్లి నాలుగాకులు, ఎర్ర కొండకు వెళ్ళి ఏడాకులు, పచ్చ కొండకు వెళ్ళి పదాకులు మేసి , బాగా బలిసి వస్తా. అప్పుడు తిందువు గానిలే " అంది. "అలాగా! అయితే తొందరగా పోయి, బాగా బలిసి రా- పో!" అని దాన్ని విడిచిపెట్టింది పులి.



"హమ్మయ్య" అనుకుంటూ వేగం పెంచి కాస్త దూరం వెళ్లిందో లేదో- అంతలోనే ఈసారి ఒక సింహం ఎదురొచ్చింది. "పొట్టేలు బావా,పొట్టేలు బావా! నిన్ను తినాలనిపిస్తోంది!" అంది. దానికా పొట్టేలు "సింహం బావా- సింహం బావా ! ఇప్పుడు నాలో ఎముకలు తప్ప కొవ్వు అస్సల్లేదు కదా.

అందుకని నన్నొదిలేస్తే, నల్ల కొండకు వెళ్లి నాలుగాకులు, ఎర్ర కొండకు వెళ్ళి ఏడాకులు, పచ్చ కొండకు వెళ్ళి పదాకులు మేసి , బాగా బలిసి వస్తా.

అప్పుడు తిందువు గానిలే " అంది. "ఓహో అలాగా! అయితే తొందరగా పోయి, బాగా బలిసి రా- పో!" అని దాన్ని విడిచిపెట్టింది సింహం.


అట్లా నక్కను, పులిని, సింహాన్ని తప్పించుకొని పొట్టేలు కాస్తా నల్లకొండకు వెళ్లింది- నాలుగాకులు మేసింది. ఎర్రకొండకు వెళ్లింది- ఏడాకులు మేసింది. పచ్చకొండకు వెళ్లింది- పదాకులు మేసింది. బాగా బలంగా తయారై, తిరుగు ప్రయాణం పట్టింది.

కానీ దారిలో సింహం, పులి, నక్క ఎదురు చూస్తుంటాయి కదా తనకోసం? వాటినెలా తప్పించుకోవాలి ?" అని ఆలోచించి, అక్కడే ఉన్న ఓ పెద్ద పుచ్చకాయలో దూరిందది. పుచ్చకాయలో దూరి, "దొర్లు దొర్లు పుచ్చకాయ్ దొర్లకుంటే దోసకాయ్" అను కుంటూ, దొర్లుకుంటూ వెళ్లింది.


అలా దొర్లుతూ ఉంటే దారిలో సింహం ఎదురై "ఇదేంటి, ఇలా దొర్లుతూ ఉందే?!" అని దానిని కాలితో వేగంగా తన్నింది. దాంతో పుచ్చకాయ మరింత వేగంగా ఉరకడం మొదలెట్టింది.

మరి కాస్త దూరం వెళ్లాక పులి ఎదురైంది. అది కూడా "ఏంటబ్బా! ఇదేదో కాయ, భలే దొర్లుతూ ఉందే ?" అని, కాలితో ఈడ్చి ఒక తన్ను తన్నింది.

దానితో పుచ్చకాయ మరింత వేగంగా ఉరకడం మొదలెట్టింది.




అలా ఇంకొం చెం దూరం వెళ్ళగానే నక్క ఎదురైంది. పులి, సింహంలా కాదు- నక్క తెలివైంది. కనుక "ఈ పుచ్చ కాయేంటి, ఇలా దొర్లడమేంటి? దీని సంగతి కనుక్కోవాలి" అని దాని వెంటే ఉరకడం మొదలు పెట్టింది. పుచ్చకాయలో ఉన్న పొట్టేలు తన వెనకే నక్క రావడం చూసి, 'దానికి దొరకూడదు' అనుకొని, "దొర్లు దొర్లు పుచ్చకాయ్! దొర్లకుంటే దోసకాయ్!" అనుకుంటూ మరింత వేగంగా దొర్లింది. అట్లా కొంత దూరం పోగానే దారిలో దానికి ఒక పెద్ద బండ రాయి అడ్డ మొచ్చింది, దానికి. పుచ్చకాయ వేగంగా వెళ్లి బండరాయికి కొట్టుకుంది: అంతే- ఆ దెబ్బకు అది ఫట్ మని పగిలి రెండు ముక్కలైంది! పొట్టేలు కాస్తా బయట పడింది!


పొట్టేలును చూడగానే నక్క ఇకిలిస్తూ "అమ్మ దొంగా! నువ్వా, లోపలుంది? నన్నే తప్పించుకొని పోదామనుకున్నావా?" అని ఎగిరి దాన్ని పట్టుకుంది. అప్పుడా పొట్టేలు "అది కాదు నక్క బావా! నీ దగ్గరకు వస్తూ ఉంటే, దారిలో నాకు బాగా ఆకలేసింది. దారిలో కుందేలు వారింట్లో పెళ్ళి భోజనాలు ఏర్పాట్లు జోరు జోరుగా జరుగు తున్నాయి కదా- వడలు, పాయసాలు వద్దన్నా కొసరి కొసరి వడ్డించారు. అవన్నీ తినేసాక, నా పొట్ట ఎంత నిండిపోయిందంటే, ఇంక నీ దగ్గరకు వచ్చేందుకు నేను నడవనేలేక పోయాను. అందుకే ఇలా పుచ్చకాయలో దూరి, దొర్లు కుంటూ వచ్చాను. బాగున్నావుగా?" అని నమ్మ బలికింది.

ఈ మాటలు వినే సరికి నక్క బావకి నోరూరింది. నక్క మనసులో భావం గ్రహించి పొట్టేలు వెంటనే అన్నది- "నక్క బావా! నేను ఎక్కడికీ పోనులే, నన్ను రేపు అయినా తినొచ్చు. ముందు నువ్వు వెళ్ళి కుందేలు ఇస్తున్న పెళ్ళి విందు ఆరగించిరా" అని విందు జరిగే చోటు చెప్పింది. నక్క సంబరపడిపోయి, పొట్టేలు చెప్పిన చోటుకు చేరుకుంది. తీరా చూస్తే అక్కడ నిజంగా ఏ విందూ లేదు- అది పులి నివసించే గుహ! నక్క ఆ గుహలో అడుగు పెట్టిందో లేదో, బాగా ఆకలిగొని ఉన్న పులి నక్కమీదికి ఉరికి, దాన్ని పట్టుకొని లొట్టలేసుకుంటూ తినేసింది.

ఇంకేముంది, పొట్టేలు బతికి పోయింది- "ఇంకెప్పుడూ అడవిలో అటువైపుకు వెళ్ళను స్వామీ" అని దండం పెట్టుకున్నది గుమ్మడికాయకి.