సైన్సు మాస్టారు రామం గారంటే అందరికీ చాలా ఇష్టం. అందర్నీ తరగతి గదిలోంచి బయటకు తీసుకెళ్తారుగా, అందుకు.
ఆ రోజు శనివారం. అందర్నీ దగ్గర్లో ఉన్న కొండ ఎక్కిస్తున్నారు రామంసార్.
"చూశారా, పిల్లలూ? మనం 'చాలా పెద్దవి ' అనుకునే ప్రతి వస్తువునీ ముక్కలు చేస్తూ పోవచ్చు. ఇదిగో, యీ చాక్‌పీసును ముక్కలు చెయ్యచ్చు, యీ పుల్లను ముక్కలు చెయ్యచ్చు..." చేసి చూపించారు.
"అవును సార్, శ్రమ పడితే దేన్ని అయినా ముక్కలు చెయ్యొచ్చు".
"అదే , ఎంత చిన్న ముక్కలు చెయ్యొచ్చు? ఈ చాక్‌పీసును ఎంత చిన్నముక్కలు చేయొచ్చు?"
ఓ పిల్లాడు చాలా చిన్న ముక్కనొక దాన్ని చూపించాడు.
"ఇంకా చిన్నవి చెయ్యలేమా?"
చెయ్యచ్చుసార్! కణాలుగా కూడా చెయ్యచ్చు, చాక్‌పీసును నేల మీద రాకితే పొడి వస్తుందే, అందులో ఉండేవన్నీ చిన్న చిన్న కణాలే గదా" అన్నాడు
సోము అనుమానంగా.
రామం సార్ నవ్వాడు. "అవును. దుమ్ములాగా ఉండే దానిలో కూడా కణాలున్నాయి. కంటికి కనబడతై అవి. అయితే వాటిని ఇంకా ఇంకా చిన్న ముక్కలు చేస్తూ పోవచ్చు. ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు చేశారు ఆపని-"
"ఎంత చిన్న ముక్కలైనై?"
"కంటికి కనబడనంత చిన్నవి - వాటినే 'అణువులు - పరమాణువులు- atoms అన్నారు".
"వాటితో బాంబులు చేస్తారు కదండి సార్, నాకు తెలుసు ఆటంబాంబు" అన్నది లక్ష్మి. రామం సార్ నవ్వి, కొనసాగించారు-
"ప్రతి అణువులోనూ చూస్తే - మధ్యలో గుండ్రంగా ఏదో ఉంది, దాని చుట్టూ మైక్రోస్కోపుకి కూడా తెలీనివి, ఏవో తిరుగుతున్నట్లనిపించాయి". అవి
ఏంటో ఇంకా బాగా చూడకుండానే పేర్లుపెట్టారు: మధ్యలో దాన్ని "కేంద్రకం (న్యూక్లియస్)" అనీ, చుట్టూ తిరుగుతున్న వాటిని 'ఎలక్ట్రానులు ' అనీ
అన్నారు.
ఎలక్ట్రానులు ఎంత చిన్నవంటే , ఇప్పటి వరకూ వాటిని చూపెట్టే మైక్రోస్కోపే తయారు అవ్వలేదు!
అయితే న్యూక్లియస్‌ని మాత్రం చూశారు. అందులో ప్రోటాన్లు, న్యూట్రాన్లు వేరు వేరుగా ఉన్నాయని కనుక్కున్నారు. వాటి సంఖ్య మారిన కొద్దీ
పదార్థం మారుతుంది. బంగారం అణువు కేంద్రకంలో ఎప్పుడూ 79 ప్రోటాన్లుంటై. ఇనుము అణువు కేంద్రకంలో ఎప్పుడూ 26 ప్రోటాన్లుంటై.. రాగి కేంద్రకంలో 29 ప్రోటాన్లుంటై.. అట్లా అన్నమాట".
"బాగుంది, అయితే ఓ యాభై ప్రోటాన్లు తీసుకొని రాగికి కలిపితే బంగారం తయారౌతుందన్న మాట!" సుమలత అన్నది హుషారుగా.
రామం సార్ నవ్వారు, "బాగానే అర్థమైంది నీకు, కానీ అదంత సులభంగా లేదు. ప్రోటాన్లు అణువుల్ని ఎంత గట్టిగా పట్టుకొని ఉన్నాయంటే - చెప్పలేనంత గట్టిగా! అవన్నీ కలిసి మనం కొత్తగా చేర్చబోయే ప్రోటాన్లను ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తాయంటే, ఆ పనిని బలవంతంగా చెయ్యాలంటే ఆటంబాంబంత శక్తి కావల్సి ఉంటుంది!"
"అయితే ఎలాగ?" అడిగాడు శేఖర్.
"ఏముంది, ఎలాగూ లేదు! పోయిన నెలలో పేపర్లో చూశారా, శాస్త్రవేత్తలు పరమాణువులో ఇంకో చిన్న ముక్క "బోసాన్"ని కనుక్కున్నారు! దేనికైనా
'బరువు ' అంటూ రావాలంటే అది యీ బోసాన్ల వల్లనేనట! అంటే బోసాన్లని తీసేస్తే బరువు లేని పదార్థం రెడీ!"
పిల్లలంతా అర్థంకానట్లు మొహంపెట్టారు.
అయితే ఆ సరికే అందరూ కొండ పైకి చేరుకునేశారు. "ఇప్పుడు మనం వంద అడుగులు ఎక్కివచ్చాం!" అన్నారు రామం సార్. పిల్లలు ఎవ్వరూ మాట్లాడలేదు- అందరూ నోళ్లు వెళ్లబెట్టి చూస్తున్నారు: కొండకు అవతలి వైపున, లోయ చుట్టూతా- విశాలంగా విస్తరించిన ఆకాశం! దూరంగా అంతే స్పష్టంగా నిలబడి ఉన్న కొండల వరుసలు! రివ్వు రివ్వుమని వీస్తున్న గాలి! ఆ గాలికి ఎగిరిపోకుండా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని నిలబడ్డారందరూ. అన్ని గలగలలు కిలకిలల మధ్య- ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. ఎవరికి వాళ్లు మౌనంగా తమ మనసు లోతుల్ని స్పృశించారు.
కొద్ది సేపటి తర్వాత... మెల్లగా అన్నది సుమలత- "... క్రింద చూశారా సార్, మన 'ఎక్స్ ప్రెస్ వే' ఎంత సన్నగా, తీగలాగా ఉందో! మనుషులు తయారు చేసిన జీపులు, కార్లు, ట్రక్కులు అన్నీ చీమల్లాగా పోతున్నాయి! ఎదురుగా యీ కొండలు చూడండి మరి - ఎంత పెద్దగా నిలబడి ఉన్నాయో, అస్సలు కదల కుండా!".
"నిజమే.. మనుషులు ఎంత చేసినా, ఏవి -ఎన్ని- కనుక్కున్నా, వాటన్నిటికీ స్థానం కల్పించిన యీ ప్రకృతి శక్తి ముందు అది పిసరంతే!" తనలోతాను గొణుక్కున్నారు రామం గారు- ఆ సన్నివేశపు లోతునూ, ఆ కొండల పెద్దరికాన్నీ చూసి అసంకల్పితంగా మూగవోతూ.
ప్రకృతిని పిల్లలకు దగ్గర చేస్తున్న గురువులందరికీ నమస్కారాలతో,
కొత్తపల్లి బృందం