అనగనగా ఒక ఊరిలో తనుష్ అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. చాలామంది పిల్లల్లాగే వాడుకూడా హాస్టల్లో ఉండేవాడు. "బాగా చదువుకోవాలి బాబూ! నువ్వు మంచి పిల్లవాడిగా ఎదిగితే, మన కష్టాలన్నీ తీరతాయి" అంటుండేది వాళ్ళ అమ్మ. "ఏం కష్టాలమ్మా?" అని అమాయకంగా అడిగేవాడు తనుష్. "పెద్దయ్యాక తెలుస్తాయిలే బాబూ, నువ్వు మాత్రం బాగా చదువుకోవాలి-సరేనా?" అనేది అమ్మ. వాడికి ఆ మాటలు ఏమీ అర్థం అయ్యేవి కాదు- అయినా వాడు మటుకు చక్కగా చదువుకునేవాడు మనసు పెట్టి.
ఒక సారి వాడు వాళ్ళ అమ్మ, నాన్న తో కలిసి పట్నం వెళ్ళాడు. వాడిని, అమ్మను అక్కడ వదిలి, వాళ్ల నాన్న 'ఇప్పుడే వస్తాను ఉండండి' అని ఎటో వెళ్ళాడు.
"ఇంట్లో దీపం పెట్టేందుకు నూనె బొత్తిగా లేదు. రోడ్డు అవతల, ఆ దుకాణంలో కాసింత నూనె తీసుకురా బాబూ" అని పది రూపాయలు చేతిలో పెట్టింది అమ్మ.
తనుష్ రోడ్డు దాటి కొట్టు దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ ఒక్కతే అటు ప్రక్కన నిలబడి ఉన్నది: అంతలో ఏమైందో ఏమో- అకస్మాత్తుగా అటు ప్రక్క నుండి లారీ ఒకటి వచ్చి గుద్దింది అమ్మను. ఆ శబ్దానికి వెనక్కి తిరిగి చూసిన తనుష్ 'అమ్మా' అని అరుస్తూ అమ్మ దగ్గరికి చేరుకున్నాడు.
అక్కడున్నవాళ్లంతా అమ్మ చుట్టూ గుమిగూడారు- "చాలా రక్తం పోయింది-వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తే బ్రతుకుతుంది" అంటున్నారు. తనుష్ వాళ్ల నాన్నకోసం చూశాడు- నాన్న ఆ దగ్గర్లోనే లేడు. తనుష్ వాళ్ళమ్మ తల ఒళ్ళో పెట్టుకొని ఏడిచాడు. అంత బాధలోనూ వాళ్లమ్మ కళ్ళు తెరిచి, "మీ నాన్న ఏదో ఒక సారా దుకాణంలో ఉంటాడు - చూసి పిల్చుకురా నాయనా, నాకేం కాదులేగాని" అన్నది.
తనుష్ ఆమెను అక్కడే వదిలేసి దుకాణాల్లో చూస్తూ పోయాడు. చివరికి వాళ్ళ నాన్న ఓ సారా దుకాణంలో కనబడ్డాడు. అప్పటికే నిషాలో ఉన్నట్లున్నాడు- తనుష్ చెప్పేది అతనికి కొంత సేపటి వరకూ అర్థమే కాలేదు. తీరా ఇద్దరూ వచ్చేసరికి తనుష్ వాళ్ళమ్మ చనిపోయి ఉన్నది!
ఆ తర్వాత గానీ తనుష్కి తెలియలేదు- వాళ్ల నాన్న బాగానే సంపాదిస్తాడు- కానీ సంపాదనంతా సారాకే ఖర్చుపెడతాడు. అంతే కాదు- రోజూ త్రాగివచ్చి, ఇంకా డబ్బులు ఇమ్మని తనుష్ వాళ్ళ అమ్మని పీడించేవాడు. ఇవ్వకపోతే కొట్టేవాడు. అమ్మ పాపం, మంచిది. ఇవన్నీ తనకు తెలియనివ్వలేదు: "హాస్టల్ లో ఉండు నాయనా, బాగా చదువు" అని మాత్రం చెబుతుండేది తనకు.
అమ్మ చనిపోయాక తనుష్కి కష్టాలంటే ఏమిటో తెలిసి వచ్చాయి. నాన్న వాడిని అస్సలు పట్టించుకునేవాడు కాదు. హాస్టలు ఖర్చులకి, చదువుకోటానికి, ఫీజులు కట్టటానికి- దేనికీ డబ్బులు అందించలేదు ఆయన. చూస్తూ చూస్తూండగానే తనుష్కి పిలుపు వచ్చింది- "నాన్న ఆరోగ్యం బాగా లేదు- ఆస్పత్రిలో ఉన్నాడు".
సారాయి వల్ల తనుష్ వాళ్ళ నాన్న కాలేయం పూర్తిగా చెడిపోయింది. కడుపునొప్పి, వాంతులు- అనారోగ్యంతో పోరాడి పోరాడి, చివరికి కన్నుమూశాడాయన.
అకస్మాత్తుగా తనుష్ ఒంటరివాడయ్యాడు.
ఆ సమయంలో తనుష్ వాళ్ల అత్త-మామ ముందుకు వచ్చి అతన్ని చేరదీసారు. "చూడు తనుష్, నీకు మేం సంరక్షకులంగా ఉంటాం. కానీ మేమూ పెద్దగా ఉన్నవాళ్ళం కాదు కదా, నీ అవసరాలకు తగినన్ని డబ్బులు నువ్వే, సెలవుల్లో పనిచేసి సంపాదించుకోవాలి" అన్నారు వాళ్ళు. "మీకెలాంటి కష్టమూ రానివ్వను మామయ్యా" అన్నాడు తనుష్ ధైర్యంగా.
మరుసటి సంవత్సరం వాడు గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష రాసాడు. బాగా చదివి ఉండటంతో వాడికి ఆ బడిలో సీటు దొరికింది. అక్కడ చదువులు, భోజనాలు, వసతి- అన్నీ ప్రభుత్వమే చూసుకున్నది. సెలవల్లో దుకాణాల్లో సరుకులు అందించే పని చేయటం మొదలు పెట్టాడు వాడు.
పన్నెండో తరగతి అయ్యేసరికి అతనికి ఐఐటీలో సీటు వచ్చింది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో వాడు ఐఐటీలో ఇంజనీరింగు చదివాడు. పేద పిల్లలకు ప్రభుత్వం వారు ఇచ్చే ఉపకార వేతనం వాడికి చాలా ఉపయోగపడింది. చదువు పూర్తయ్యేసరికి అతనికి ఒక ప్రైవేటు సంస్థలో ఉన్నతోద్యోగం కూడా లభించింది!
తనుష్ తన సంపదలో అధిక భాగాన్ని ఇప్పుడు పేద పిల్లల చదువులకోసం వెచ్చిస్తున్నాడు. సారాయి బారిన పడ్డవాళ్ల కుటుంబాలను ఆదుకోవటంలోను, మత్తు మందులకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలలోను ముందు నిలుస్తున్నాడు. త్రాగుడు వల్ల ఎంత నష్టమో అందరికీ చెబుతున్నాడు.