ఒకసారి తన తల్లిదండ్రుల నుంచి దూరం అయ్యాక, బాల కార్మికుడిగా వ్యవసాయ పనులు చేయడం మొదలుపెట్టాడు ఓం ప్రకాశ్. పొలం దున్నడం, పశువులు కాయడం, విత్తు నాటడం, పురుగుల మందులు చల్లడం - ఒకటేమిటి అన్ని పనులూ చేసేవాడు. మరి ఇంతా చేస్తే, రెండు పూట్ల భోజనమే తప్ప, కనీసం కూలీ అన్నా ముట్టేది కాదు. పైగా ఏ చిన్న తప్పు చేసినా శిక్ష మాత్రం పెద్దదేనట. అలా మూడేళ్ళ పాటు కష్టాలు పడ్డాడు.

తరువాత, "బచ్పన్ బచావో ఆందోళన్" వారి కంటబడ్డాడు. "బచ్పన్ బచావో ఆందోళన్" అన్నది బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కంకణం కట్టుకున్న ఒక సంస్థ. 'కైలాష్ సత్యార్థి' అనే ఆయన స్థాపించారు దీన్ని. అలావెలుగుబాట పట్టిన వారిలో ఓం ప్రకాశ్ గుర్జార్ ఒకడు. కూలి పనుల్లో ఉన్న పిల్లలకు తగిన ఆధారం కల్పించి, వాళ్లు బడిలో చేరి చదువుకునేలా చేస్తుంది యీ సంస్థ.

సహజంగా తెలివిగల కుర్రవాడైన ఓం ప్రకాశ్ స్కూల్లో చేరి, చక్కగా చదువుకున్నాడు, అంతే కాకుండా తమ సొంత ఊరిలో పిల్లలని చాలా మందిని స్కూలులో చేర్పించాడు. 'బాల ఆశ్రమ్' వారి సహకారంతో తన ఊరిని "బాలమిత్ర" గ్రామంగా తీర్చిదిద్దాడు. బాలమిత్ర గ్రామాలుఏర్పడేందుకు కృషి చేసాడు. అలాంటి అనేక బాలమిత్ర గ్రామాల్ని కలిపేందుకు కృషి చేసాడు. పుట్టిన ప్రతి బిడ్డకీ జనన ధృవీకరణ పత్రం (బర్త్ సర్టిఫికేట్) ఉండాలని ప్రచారం చేశాడు. 'బాలల హక్కుల పరిరక్షణకు, వారి భద్రతకు ఈ చర్య మొదటి మెట్టు' అని అతని అభిప్రాయం.

ఓం ప్రకాశ్ కృషికి గుర్తింపుగా అతనికి 2006 లో అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతి లభించింది. ఒకప్పటి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత- క్లార్క్ చేతుల మీదుగా అతను తన బహుమతిని అందుకున్నాడు. అవార్డు లభించే నాటికి ఓం ప్రకాశ్ తన తల్లిదండ్రుల్ని మళ్ళీ కలుసుకోగలిగాడు. అయినా వారి పేదరికం వల్ల, తిరిగి ఆశ్రమంలోనే ఉంటూవచ్చాడు. 'చదువుకోవడం పిల్లలకి ప్రాథమిక హక్కు' అని అతని విశ్వాసం. ఈ విషయమై పిల్లలకి, పెద్దలకి అవగాహన కలిగించడం కోసం కృషి చేస్తున్నాడతను. ఇందుకోసం బాలకార్మికుడిగా తన అనుభవాల గురించి అందరికీ చెబుతూ, దాని వల్ల కలిగే పరిణామాల గురించి అవగాహన కలిగిస్తున్నాడట అతను. అతని చొరవ కారణంగా వాళ్ళ కుటుంబంలోని పిల్లలందరూ ఇప్పుడు స్కూల్లో చేరి చదువుకోవడం మొదలుపెట్టారు -కూలి పనులకి వెళ్ళడం మానేసారు.

ఓం ప్రకాశ్ లో మరొక కోణం కూడా ఉంది. అతనికి నాటకాల్లో నటించడం అన్నా, పాటలు పాడడం అన్నా, క్రికెట్ అన్నా కూడా ఇష్టమే. "క్రికెట్ ఫర్ పీస్" అన్న పేరుతో 'ఇండియా-పాకిస్తాన్' క్రికెట్ మ్యాచ్ ఒకటి జరిగితే, మనవాడు అందులో కూడా పాల్గొన్నాడు! 'పిల్లల చదువు-బాల కార్మిక వ్యవస్థ' గురించి జరిగిన అంతర్జాతీయ కాంగ్రెస్‌లో పాల్గొనడానికి ఒకసారి రాజస్థాన్ నుండి ఢిల్లీ దాకా- ముప్ఫై ఆరు గంటలు సైకిల్లో వెళ్ళాడట! కలెక్టర్ కావాలనీ, బాలల హక్కుల కోసం కృషి చేసి బాల కార్మిక వ్యవస్థ లేకుండా చేయాలనీ అతని ఆశయమట- నేను చదివిన ఈ వార్త మూడేళ్ళ నాటిది:

అప్పటికి అతను ఇంకా ఇంటర్ చదువుతున్నాడు. బహుశ: కలెక్టర్ అయ్యే లక్ష్యం దిశగా అతను ముందుకు సాగుతూ ఉండి ఉంటాడు ప్రస్తుతం.