రామాపురంలో నివసించే సోమయ్య, రంగమ్మ ఒట్టి ఆశపోతులు. వాళ్లలాగానే తయార-య్యాడు వాళ్ల కొడుకు జంపన్న కూడా. ముగ్గురూ రోజూ కూర్చొని పగటికలలు కంటూ ఉండేవాళ్ళు. ఇంట్లో వంటదినుసులు అయిపోయిన రోజున ముగ్గురూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చుకునేవాళ్ళు. వాటిని అమ్మితే వచ్చే డబ్బు మూడు రోజులకు సరిపోయేది. వీళ్ళు మూడు రోజులు కలలు గని, నాలుగో రోజున, డబ్బులన్నీ అయిపోగొట్టుకున్నాక- మళ్ళీ గొడ్డళ్ళు చేత పట్టుకొని అడవికి బయలుదేరేవాళ్ళు.
ఆశపోతులు కదా, అందుకని వీళ్ళకు చెట్లన్నీ ఒకేలాగా కనబడేవి- డబ్బులకోసం ఏ చెట్టునైనా కొట్టేందుకు సిద్ధపడేవాళ్ళు వీళ్ళు. ఎంత పచ్చటి చెట్టునైనా నరికేసేవాళ్ళు. వీళ్ళలాంటివాళ్ళు ఎందరు కట్టెలు కొడుతున్నారో గానీ, చూస్తూండగానే అడవిలో చెట్లన్నీ తగ్గిపోవటం మొదలెట్టాయి. చివరికి అడవి జంతువులకు ఆహారం తక్కువై, రోజూ రాత్రిపూట ఊళ్ళ మీదికి పడటం మొదలయింది.
ఒకరోజు వీళ్ళు ముగ్గురూ అడవిలో కట్టెలు కొడుతుండగా అడవి దేవత ప్రత్యక్షమైంది: "సోమయ్యా, రంగమ్మా! మీలాగే మీ కొడుకును కూడా ఆశపోతుగానే మార్చిన-ట్లున్నారే?! చూడండి, మీరు యీ చెట్లు నరకటంవల్ల నాకు ఎన్ని గాయాలయ్యాయో! నామీద ఆధారపడి జీవించే జంతువులన్నీ ఊర్ల పై పడ్డాయి. అందువలన మీరు కట్టెలు కొట్టటం మానేయండి, ప్లీజ్!" అన్నది.
సోమయ్య, రంగమ్మ తెలివిగా ఆలోచించారు. "ఇదే సమయం, ఈ తల్లి దగ్గరనుండి ఏదైనా రాబట్టితే మనం ఒక్కసారిగా ధనికులం అయిపోవచ్చు" అనుకున్నారు. బయటికి మాత్రం వినయం నటిస్తూ "అయ్యో, తల్లీ! అంతకంటేనా? కానీ కట్టెలు కొట్టితే తప్ప మా పొట్ట గడవదు గదా? మేం కట్టెలు కొట్టటం మానేస్తే బ్రతికేదెలాగ?" అన్నారు.
"మీరు ఏదైనా ఒక్క వరం మటుకు కోరుకోండి , నేను ఆ కోరిక తీరుస్తాను" అన్నది అడవి దేవత.
సోమయ్య, రంగమ్మ మురిసి పోయారు. ఇద్దరూ గుసగుసలాడుకున్నారు. జంపన్న చెవిలోనూ ఏదో ఊదారు. వాడూ నవ్వు ముఖం పెట్టాడు.
అప్పుడు సోమయ్య అడవి తల్లితో గట్టిగా "సరేనమ్మా! నీ మాట కాదని మేం ఏం చేయగలం? అట్లానే కానివ్వు. మాకొక మాయ సంచీ ఇవ్వు, చాలు.
మేము ఏది అడిగినా ఇవ్వాలి అది!" అన్నాడు. రంగమ్మ, జంపన్న కూడా 'సరిగ్గా అడిగావ'న్నట్లు తల ఊపారు.
అడవితల్లి చిరునవ్వు నవ్వింది. మనసులోనే ఏదో తలచుకొన్నది. మరుక్షణం ఆమె చేతిలోకి ఒక బట్ట సంచీ వచ్చింది. ఆమె ఆ సంచిని సోమయ్యకు ఇస్తూ చెప్పింది: "ఇదిగో, ఈ సంచీని జాగ్రత్తగా కాపాడుకోండి. సంచిని చేత పట్టుకొని, నన్ను తలచుకొని, మీకేం కావాలో చెప్పండి. మీరు కోరిందల్లా ఈ సంచిలో ప్రత్యక్షమౌతుంది. అయితే ఒక సంగతి గుర్తుపెట్టుకోండి: 'ఈ సంచికి అస్సలు చిల్లి పడకూడదు! ఎంత చిన్న చిల్లి పడినా సరే- మీరు కోరుకున్నది అంతా మట్టిలా మారిపోతుంది. తెలివిగా, ఆలోచిం-చుకొని వాడుకోండి" అని చెప్పింది. సోమయ్య, రంగమ్మ ఆ సంచీని అందుకొని సంతోషంగా నమస్కరించారు ఆమెకు. ఆమె వాళ్ళను ఆశీర్వదించి "మరొక్కమాట- ఈ సంచీని గ్రహించటం వల్ల ఈ అడవికి మీతో రుణం తీరిపోయింది. అందువల్ల ఇక మీరు ఇటువైపుకు రానే కూడదు. ఇంకోసారి ఈ అడవిలోకి వచ్చారంటే మీరు కూడా చెట్లలాగా మారిపోతారు- జాగ్రత్త!" అని చెప్పి సాగనంపింది.
సోమయ్య కుటుంబం ఆ సంచిని చేతబట్టుకొని సంతోషంగా ఇంటికి బయలుదేరింది. "భలే వరం కోరాం! ఈ ఒక్కవరంతో మన గొప్ప ధనికులం అయిపోవచ్చు!" అనుకుంటున్నా-రందరూ. పోతూ ఉంటే జంపన్నకు ఒక ఐడియా వచ్చింది: "నాన్నా! అడవితల్లి చెప్పింది కదా, ఈ సంచికి చిన్న రంధ్రం పడినా పని చేయదని? అందుకని ముందుగా మనం ఒక పని చేద్దాం. ఈ సంచిని ప్రార్థించి, ఇలాంటి మాయ సంచినే మరొకటి ఇవ్వమందాం! అలాగైతే ఈ సంచి పోయినా మనకు ఎంచక్కా మరో సంచి ఉంటుంది కదా!" అన్నాడు.
"అవునవును" అని సోమయ్య సంచిని ప్రార్థించి, "నీలాంటి మాయ సంచీనే మరొకటి ఇమ్మ"న్నాడు. ఆ తర్వాత సంచీలో చేయి పెడితే ఖచ్చితంగా దాని లాగానే ఉన్న సంచీ మరొకటి దొరికింది! రంగమ్మ, జంపన్న ఇద్దరూ హాయి హాయిగా నవ్వారు. ఆ సరికి ముగ్గురూ ఇల్లు చేరుకున్నారు.
"చెప్పు, మనం ఈసారి ఏం కోరుకుందాం? నీకు ఏమేం కావాలి?" అన్నాడు సోమయ్య.
"కూరగాయలు, పప్పులు-ఉప్పులు, ధాన్యం, బంగారం" అన్నది రంగమ్మ.
"కూరగాయలు పెట్టుకునేందుకొక ఫ్రిజ్, కూలర్లు, ఫ్యాన్లు, పెద్ద డాబా ఇల్లు..." జత చేసాడు జంపన్న.
"అవునవును, అన్నీ కావాల్సిందే" అని సంచీని అన్నీ అడిగాడు సోమయ్య.
అంతే, సంచీ కాస్తా చినిగిపోయి, వంద ముక్కలైంది- అంత చిన్న సంచీలో ఇవన్నీ పట్టవు గదా?!
"ఒక్క వరం కూడా కోరకనే సంచీ చినిగిపోయిందే!" అని బాధ పడుతున్న రంగమ్మను ఓదారుస్తూ జంపన్న "ఇది పోతే మాత్రం ఏమి, మన దగ్గర మరొక మాయ సంచీ ఉన్నదిగా? మన ముందు జాగ్రత్త ఇలా అక్కరకొచ్చింది" అన్నాడు.
అయితే వెళ్ళి చూసే సరికి అక్కడ సంచీ లేదు- మట్టి కుప్ప ఉన్నది. సంచీకి చిల్లి పడే సరికి అది సృష్టించినవన్నీ మట్టి కుప్పలయ్యాయి, రెండో సంచీతో సహా!
ఆశపోతు కుటుంబానికి ఉన్న కాస్తంత ఆధారమూ పోయినట్లయింది. వాళ్ళిప్పుడు అడవికి వెళ్ళి కట్టెలూ కొట్టుకు రాలేరు!
చేసేదేమీ లేక ముగ్గురూ వేరే ఊరుకు వలస పోయారు- 'కనీసం ఇక్కడన్నా బాగా కష్టపడి పనిచేద్దాం- మనకొద్దు ఈ మాయలూ మంత్రాలూ' అనుకుంటూ.