ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. పెళ్ళిళ్ళు, గృహ ప్రవేశాలవంటి సమయాలలో మంత్రాలు చదవటానికి వెళుతూ వచ్చిన సొమ్ముతో జీవిస్తుండేవాడు. అతని భార్య ఒక గయ్యాళి. ఆమెతో వేగలేక చచ్చేవాడు పాపం బాపనాయన. వారికి పిల్లలు మాత్రం లేరు.

బాపనాయనికి తను పెద్ద ధనవంతుడైపోవాలని చాలా కాలం నుంచీ కోరిక. కానీ రాబడి తక్కువగా ఉండటంతో ఆ కోరిక ఎంతకీ తీరకుండా ఉన్నది. దాంతో ఆయన నిరుత్సాహపడుతూండేవాడు. కానీ, ఎప్పటికైనా తను ఒక పెద్ద ధనవంతుడవ్వాల్సిందేనని అతనికి నమ్మిక. కొంచెం తీరిక దొరికిందంటే చాలు- తను ధనవంతుడైనట్లు కలలు కనేవాడు.

ఒకసారి ఆయనకు ఒక పేదవాని ఇంట్లో పెళ్ళికి పౌరోహిత్యం దొరికింది. దక్షిణగా ఆ పేదవాడు ఒక బానెడు పాలిచ్చాడు బాపనాయనికి.

బాపనాయన ఆ బానెడు పాలనూ తీసుకొని ఇంటికి పయనమయ్యాడు. అప్పటికే బాగా ఎండయ్యింది. దారిలో కొంచెంసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టుకింద కుండను దింపి, తన పక్కనే ఆ పాల బానను ఉంచుకొని , నిద్రపోయాడు. నిద్రలో ఎప్పటిలానే బాపనాయన్ని ధనవంతుడిని చేసే కలలు రావడం మొదలయ్యాయి.

ఆయన తన దగ్గర ఉండే పాలను అమ్మి, కొన్ని కోడి పిల్లలను కొన్నాడు. పిల్లలు పెద్దవయ్యాయి. అవన్నీ ఇక గుడ్లు పెట్టి, పొదిగాయి. గుడ్లన్నీ పిల్లలయ్యాయి. అవన్నీ పెరిగి పెద్దవయ్యాయి. వాటికి పిల్లలయ్యాయి. అవిపెద్దవయి, వాటికి పిల్లలు, మళ్ళీ వాటికి పిల్లలు....ఇలా తన దగ్గర ఇప్పుడు చాలా కోళ్ళున్నాయి.

ఇక బాపనాయన ఆ కోళ్లన్నిటినీ అమ్మేశాడు. మేకలు కొన్నాడు. ఆ మేకలకూ పిల్లలు పుట్టాయి. వాటికి అన్నిటికీ మళ్ళీ పిల్లలు!. అలా పేద్ద మేకల మంద తయారైంది.

బాపనాయన ఇక వాటిని అన్నింటినీ అమ్మేశాడు. గొర్రెలు కొన్నాడు. గొర్రెలు పెద్దవయ్యాయి. వాటికి పిల్లలు పుట్టాయి. అవీ పెద్దయి, వాటికి కూడా పిల్లలు పుట్టాయి. గొర్రెలన్నీ ఎక్కువై, పెద్ద మంద తయారయ్యాక, బాపనాయన వాటిని అన్నింటినీకూడా అమ్మేశాడు.వాటిని అమ్మి , ఈసారి ఆవులను కొన్నాడు. ఆవులకు దూడలు, ఆ దూడలు ఆవులయి, ఆ ఆవులకు మళ్ళీ దూడలు. ఆ దూడలు ఆవులయి వాటికి మళ్ళీ దూడలు. ఇప్పుడతని దగ్గర వందల కొద్దీ ఆవులూ , దూడలూ ఉన్నాయి.

ఆవులన్నీ ఇచ్చే పాలతో పెరుగూ, వెన్నా, నెయ్యీ అన్నీ తయారవుతున్నాయి. చాలా తొందరగానే అతను ఒక పెద్ద ధనవంతుడయిపోయాడు. ఇప్పుడతనికి కావలసినవన్నీ ఉన్నాయి. అతను ఊరికే కూర్చున్నా , అన్నీ తన ముందుకే వచ్చేంత ధనవంతుడు అయిపోయాడు.

ఎన్ని ఉన్నా ఏం లాభం, తన భార్య గయ్యాళిది! అయినా ఇప్పుడు తనకేమి? తను గొప్ప ధనవంతుడు! మరో పెళ్ళి చేసుకున్నాడు. రెండవ భార్యతో సుఖంగా ఉంటున్నాడు. అప్పుడు మొదటి భార్య తన దగ్గరకు వచ్చింది. బజారుకెళ్ళి, కూరగాయలు తెమ్మంది! "నా అంతటి వాడిని,
బజారుకెళ్ళి కూరగాయలు తెమ్మంటావా?" అని కోపంగా అరిచాడు బాపనాయన. తనను అంతగా అవమానించిన ఆ గయ్యాళికి బుద్ది చెప్పదలచాడు. ఎత్తి, కాలితో ఒక్క తన్ను తన్నాడు. ’ఢబాలు’మని పెద్దగా శబ్దం వచ్చింది.

బిత్తరపోయిన బాపనాయన గబుక్కున లేచాడు. చూస్తే తనున్నది అడవిలో చెట్టుకింద! తను తన్నింది పాల కడవను! తనకున్నది ఆ కడవెడు పాలు మాత్రమే.. అవీ ఇప్పుడు నేలపాలయ్యాయి. తన తన్ను తాపుకు బాన పగిలి , పాలన్నీ నేలపాలయ్యాయి.

పాలకుండ పగిలి పోయింది. పాపం, బాపనాయని కల చెదిరిపోయింది.