అనగనగా ఒక ఊరుండేది. ఆ ఊళ్ళో ఇద్దరు దంపతులు ఉండేవారు. వారు మాంసం అంటే చాలా ఇష్టం. ఒకనాడు వాళ్ళిద్దరూ కోడికోసం కోళ్ళ అంగడికి పోయి, ఒక కోడిపెట్టని తీసుకొని ఇంటికెళ్ళారు. అయితే అప్పటికే చీకటి పడింది. దాంతో మరుసటి రోజు తెల్లవారిన తరువాత కోడిని కొసుకోవచ్చుననుకొని, దాన్ని ఒక గంపకింద మూసి, నిద్రపోయారు.
అయితే ఆ కోడి గంపకిందనుండి చాలా తెలివిగా తప్పించుకొని వెళ్ళి, ఒక పెద్ద అడవిలోకి పారిపోయింది. అక్కడ ఒక చెట్టుపైకి ఎక్కి కూర్చొంది. సరిగ్గా అప్పుడే ఆ అడవిగుండా ఒక ఇటుకల బండి పోతూ ఉన్నది. ఆ బండిలోనుండి కొన్ని ఇటుకలు పడిపోయాయి. కోడిపెట్ట ఆ ఇటుకలను తీసుకొనిపోయి ఒక ఇంటిని కట్టుకొని, దానిలో మూడు గుడ్లను పెట్టింది. ఆ మూడింటినీ పొదిగింది. ఆశ్చర్యం! పొదిగిన గుడ్లు మూడింటినుండీ అందమైన అమ్మాయిలు ముగ్గురు పుట్టారు. ఇలా కొంత కాలం గడిచింది.
అమ్మాయిలు ముగ్గురూ పెరిగి పెద్దవారయ్యారు. వాళ్ళిప్పుడు చాలా అందంగా ఉన్నారు. పెద్దకూతురికీ, రెండవ కూతురికీ తమ తల్లి ఒక కోడి అని చెప్పుకోవడం ఇష్టం ఉండేదికాదు. చిన్న కూతురికిమాత్రం తల్లంటే చాలా ప్రేమ.
ఇలా ఉండగా మూడు రాజ్యాలకు చెందిన ముగ్గురు రాకుమారులు అడవిలోకి వేటకని వెళ్ళారు. వేటాడుతూ వాళ్ళు చాలా తిరిగారు. వారికి చాలా దాహం వేసింది. కానీ ఎక్కడా నీళ్ళు మాత్రం దొరకలేదు. చివరికి రాకుమారులు వేటకుక్కలపై ఆధారపడవలసి వచ్చింది. కుక్కలు ముందు నడవగా రాకుమారులు వాటి వెనకనే వెళ్ళి, కోడి పెట్ట ఇంటిని చేరుకొని, నీళ్ళు అడిగారు. ఇంట్లోనుండి ముగ్గురు అందమైన అమ్మాయిలు వచ్చి వారికి ముగ్గరికీ నీళ్ళిచ్చారు. వారి అందానికి ముగ్దధలైన రాకుమారులు వారిని ’పెళ్ళి చేసుకుంటామని, తమతో పాటు అంత:పురానికి తీసుకుపోతామ’ని అన్నారు. అందుకు ఆ అమ్మాయిలుకూడా ’సరే’నన్నారు.
పెద్ద కూతుళ్ళిద్దరూ వాళ్ల అమ్మను కూడా పట్టించుకోకుండా, రాకుమారుల వెంట వెళ్ళిపోయారు. మూడవ అమ్మాయి మాత్రం వాళ్ల అమ్మ వచ్చేంతవరకూ ఆగి, తనతో పాటు ఆ కోడిపెట్టనూ తీసుకెళ్ళింది. కొంతకాలం అయ్యాక , కోడిపెట్టకు తన పెద్దకూతుళ్లిద్దరినీ చూడబుద్దయింది. చిన్న కూతురు వద్దన్నా వినకుండా వారిని చూసి వస్తానని బయలుదేరింది. ముందుగా అది పెద్ద కూతురి ఇంటికి వెళ్ళింది. ఆమె ’నువ్వెవరివో నాకు తెలియదు పొమ్మం’టూ, కోడిమీదికి ఒక కట్టెను విసిరింది. కోడి కాలు విరిగిపోయింది. అది బాధతో రెండవ కూతురి దగ్గరకు వెళ్ళింది. రెండవ కూతురుకూడా కట్టెతో కొట్టింది. దానికి ఒక రెక్క విరిగిపోయింది. నిరాశచెందిన కోడిపెట్ట చాలా బాధతో తిరిగి చిన్న కూతురినే చేరుకున్నది. చిన్న కూతురు ఏడుస్తూ అమ్మను తన ఒడిలోకి తీసుకొంది.
కూతురు ఒడిలో నిస్సహాయంగా పడిఉన్న కోడిపెట్ట తన జీవిత గమనాన్ని ఒకసారి మననం చేసుకున్నది. ’జాలిలేని మనుషుల ప్రపంచం తనను ఒకసారి కసాయి అంగట్లో బలిగోరింది. విది వశాన తను తప్పించుకోగలిగింది. ఆ తరువాత మరోసారి దంపతుల బుట్టక్రిందినుంది పారిపోయి అడవితల్లి రక్షణపొంది, బ్రతికిపోయింది. అయినా తనకు మనుషుల బెడద తప్పలేదు: చివరికి తన సొంత బిడ్డలే మనుషులై, మనుషుల్ని మనువాడి, వారి సంపర్కంతో తామూ మానవ గుణాలను అలవరచుకొని, తనను అంతం చేస్తున్నారు! కాలగమనంలో మానవజాతికి ఇతర జంతువుల దు:ఖాన్ని అర్దం చేసుకునే శక్తి కలిగితే తప్ప తమ జాతికి నిష్కృతి లేదు.’
అంతే! కోడిపెట్ట చనిపోయింది. చనిపోయిన కోడిపెట్టను చిన్న కూతురు తమ తోటలో పాతిపెట్టింది. ఆమే, ఆమె భర్త ఇద్దరూ జంతువుల్ని, పక్షుల్ని మనసారా ప్రేమిస్తూ, వాటి రక్షణకై తమ శక్తి యుక్తుల్ని ఆసాంతం వెచ్చించారు.