ఒక ఊళ్ళో ఇద్దరు దంపతులు ఉండేవారు. వాళ్లొకసారి కొట్లాడినారు. ఇద్దరూ ఒకరితో ఇంకొకరు మాట్లాడకుండా ఉన్నారు. పెండ్లాముకేమో వక్కాకు (తాంబూలం) వేసుకునే అలవాటుంది. సరిగ్గా అప్పుడే ఆమె దగ్గర సున్నం అయిపోయింది. వక్కాకేసుకుందామని ఆకు తీసి, సున్నంకోసం చూస్తే సున్నం డబ్బా ఖాళీ అయిపోయింది. అప్పుడు ఆమె తన మొగుణ్ణి అడగకుండా సున్నం కోసం వెదికింది. సరిగ్గా అప్పుడే ఒక కొంగ, పైన ఆకాశంలో పోతూ పోతూ రెట్ట వేసింది. అది తెల్లగా సున్నంలా ఉంది. అదొచ్చి వీళ్ల గోడమీద పడింది. అది సున్నమేనేమో అనుకున్నది ఆ భార్య. ఆమె దాన్ని తీసుకొని ఆకుతో కలిపి నమిలింది. కొన్నాళ్లకు ఆమె గర్భవతి అయ్యింది. ఇంకొన్నాళ్లకు ఆమె ఒక కొంగను ప్రసవించింది!

దాంతో ఆ దంపతులిద్దరూ హతాశులయ్యారు. కానీ ఏమి చేయగలరు? తమకు పుట్టిన బిడ్డాయె! అందరూ వారికి పుట్టిన ఆ కొంగను చూసి వాళ్లను ఎగతాళి చేసేవారు. అయినా చేసేది లేక వాళ్ళా కొంగనే పెంచుకోసాగారు. కొన్నాళ్ళకు ఆ కొంగ పెరిగి పెద్దదయింది. సరిగ్గా అప్పుడే ఆ ప్రాంతంలో పెద్ద కరువు వచ్చింది. మనుషులకు పుట్టిన ఆ కొంగకు గొప్ప గొప్ప శక్తులు వచ్చాయి. అది ఆకాశంలోకి ఎగిరి, దూర ప్రాంతాలలో దొరికే మంచి మంచి పళ్ళూ, కూరగాయలూ వాళ్ల అమ్మా-నాన్నలకు తెచ్చి ఇచ్చేది. అయినా వారికి తీరని బెంగ కొంగ సంతానం. ఆ బెంగతోటే కొంగవాళ్ల అమ్మ మంచాన పడింది. కొంగకు అది చాలా బాధను కలిగించింది. ’అందుకు కారణం తనేకదా’ అని, అది ఆకాశంలో చాలాచాలా ఎత్తుకు ఎగురుకుంటూ పోయి, చివరికి చందమామ దగ్గరికి చేరుకొని తన కష్టాన్ని చెప్పుకొంది.

చందమామ దాన్ని ఊరడించి, దాన్ని తనలో కలుపుకున్నాడు. మనం జాగ్రత్తగా చూస్తే నిండు చందమామలో కొంగ కనబడేది అందుకే.