ఒక ఊళ్ళో ఏడుగురు అన్నదమ్ములూ, వారికి ఒక్కగానొక్క చెల్లెలు జాంబవతీ, నివసిస్తూండేవారు. వారు చాలా పేదవారు. అన్నలంతా రోజూ పొలానికి వెళ్ళి
పనులు చేసేవారు. చివరి వాడైన రాజేష్ మాత్రం కుంటివాడు- అందువల్ల అతడు ఇంటి దగ్గరే ఉండేవాడు. చదువు నేర్చుకొని ఎప్పుడూ అనేక రకాల పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. చెల్లెలు జాంబవతి ప్రతి రోజూ రాగిముద్దలు చేసుకొని, పొలంలో పనిచేసే అన్నలకు తీసుకెళ్ళేది. ఇదిలా ఉండగా ఒకనాడు రాజేష్ వాళ్ల అన్నలతో ’ఇక నుండీ నేను కూడా పనికి వస్తాన’న్నాడు. అన్నలు సరేనన్నారు.

అప్పుడు జాంబవతి చెప్పింది: "అన్నలూ! మన ఇంట్లో ఉండే ఒకే ఒక్క పాత్రలో నేను మీకు ప్రతీ రోజూ సద్ది తెస్తున్నాను. ఆ పాత్రలో ఆరు ముద్దలే పడతాయి. రాజేష్ కూడా వస్తే అతనికి భోజనం తీసుకు రావడానికి మరొక పాత్ర లేదు!" అని. అప్పుడు రాజేషన్నాడు: ’చెల్లీ! నాకు ముద్ద వద్దు. కానీ, చివరన మిగిలే ’మాడు’ మాత్రం కొంచెం తీసుకురా చాలు’ అన్నాడు.

’సరే’నని జాంబవతి రోజూ వారికి సద్దిని తీసుకొని పొలానికి వెళ్ళేది.
ఒకనాడు జాంబవతి అన్నలకు సద్ది తీసుకుపోతూండగా, దారిలో ఒక పెద్ద ఎలుగుబంటి ఎదురయింది. దాన్ని చూసిన జాంబవతి చాలా భయపడిపోయి, తన పనయిపోయిందనుకుంది. కానీ ఆ ఎలుగుబంటి, జాంబవతిని సమీపించి, ’జాంబవతీ! నువ్వు నాకు రోజూ ఒక రాగిముద్ద ఇస్తానంటే నేను నిన్ను ఏమీ చేయను. ముద్దంటే నాకు చాలా ఇష్టం. పైగా ముద్దలో చాలా మంచి పోషకాలుంటాయట! దాన్ని తింటే మంచి బలం కూడా వస్తుందట కదా! అందుకే నేను ముద్దనే కోరుకుంటున్నాను. సరేనా! ఇస్తావా?’ అని అడిగింది. జాంబవతి సరేనన్నది. ఎలుగుబంటికి ఒక ముద్దను ఇచ్చి, పరుగు పరుగున అక్కడినుండి పొలానికి వెళ్ళింది. జరిగినదంతా అన్నలతో చెప్పింది.

ఎలుగుబంటి పీడను వదిలించడానికి అన్నలు ఒక ఉపాయం ఆలోచించి, దాన్ని జాంబవతికి చెప్పారు. మరునాడు, అన్నలు చెప్పినట్టుగానే ఒక నున్నటి రాతి గుండుకు పైపైన రాగిముద్దను పూసి, ఎలుగుకు ఇచ్చి, అక్కడినుండి వేగంగా వెళ్ళిపోయింది జాంబవతి. ’అది ముద్దేనేమో’ అని గట్టిగా కొరికిన ఎలుగుబంటికి పళ్ళన్నీ ఊడిపోయాయి. జరిగిన మోసాన్ని తెలుసుకున్న ఎలుగుబంటి, మరునాడు దారిలో కాపు కాసి, జాంబవతిని ఎత్తుకు పోయింది. ఎంతకీ చెల్లెలు సద్ది తీసుకు రానిది చూసి, ఎలుగుబంటే తమ చెల్లెలును ఎత్తుకు పోయుంటుందని గ్రహించిన అన్నలు అడవివైపు పరిగెత్తారు. రాజేశ్ కూడా వారిని వెంబడించాడు పడుతూ లేస్తూ.

అంతలో వారికి ఒక గాడిద కనిపించింది. ఆ గాడిదను పట్టుకోమన్నాడు రాజేష్. అన్నలంతా ’నీకేమైనా పిచ్చా? చెల్లెలు ఏమయిపోయిందో ఆలోచించక, గాడిదను పట్టుకొమ్మంటావేమిటి?’ అని రాజేష్ ను తిట్టారు. వారంతా రాజేష్ ను అక్కడే వదిలి వెళ్ళిపోయారు. రాజేష్ మాత్రం శ్రమపడి ఆ గాడిదను పట్టుకొని, అడవిలోకి వెళ్ళాడు. అంతలో అతనికి ఒక ఖాళీ రేకు డబ్బా కనిపించింది. అతను దాన్ని కూడా తీసుకొని ముందుకు సాగాడు. ఇంతలో అతనికి తమ చెల్లెలికోసం అటూ ఇటూ అడవంతా తిరిగి అలసిపోయిన అన్నలంతా కనిపించారు. వారు , ఎలుగుబంటి ఎక్కడున్నదీ కనుగొనలేక పోయారు.

ఎలుగుబంట్లు గుహలలో నివసిస్తాయని వారికి తెలియజెప్పి, రాజేశ్ వారందరినీ తన వెంట రమ్మన్నాడు. అందరినీ కొండమీద గుహలుండే చోటికి తీసుకవెళ్ళాడు. ఎలుగుబంట్లు తేనె పట్టులను తింటాయనీ, అవి ఉండే గుహ దగ్గర చీమలు ఉంటాయనీ, దాన్ని బట్టి, ఎలుగుబంటి ఉండే గుహ ఏదో కనుక్కోవచ్చని చెప్పాడు. అంతలోనే వారికి చీమల దండ్లున్న గుహ ఒకటి కనిపించింది. వారంతా గాడదను అక్కడికి తోలుకెళ్ళారు. దాని తోకకు డబ్బాను కట్టి, డబ్బాలోకి చిన్నచిన్న గులక రాళ్ళు వేసి, ఆ గాడిదను గుహలోకి అదిలించారు. డబ్బాలోని రాళ్ళు ’డబడబ’ అనగానే, బెదిరిన గాడిద గట్టిగా ఓండ్ర పెడుతూ గుహలోకి పరుగెత్తింది. ఆ శబ్దానికి కొండంతా మారుమోగిపోయింది. గుహలోని ఎలుగుబంటి బెదిరి పరుగున బయటికి వచ్చింది. బయట వేచి ఉన్న అన్నలంతా కలసి తమ పనిముట్లతో ఎలుగుబంటిని చంపేసి, గుహలోని తమ చెల్లెల్ని విడిపించుకున్నారు. అందరూ రాజేష్ తెలివిని మెచ్చుకున్నారు. చదివి విజ్ఞానం గడించటంవల్ల ఎన్ని లాభాలున్నాయో అందరికీ తెలిసి వచ్చింది.