అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక ఊరు. ఆ ఊరిలో ఒకాయన తన ఇద్దరు భార్యలు- అమల,కమల లతో నివసిస్తూ ఉండేవాడు. వారిద్దరూ ఒకేసారి గర్భవతులయ్యారు, ఒకేసారి ప్రసవించారు కూడా. పెద్ద భార్య అయిన అమలకు మగపిల్లాడు పుట్టాడు. రెండవ భార్య అయిన కమలకు ఆడపిల్ల పుట్టింది.
ఆ రోజుల్లో కూడా కొడుకంటేనే అందరికీ ప్రీతి. కమల తనకు ఆడపిల్ల పుట్టటాన్ని భరించలేకపోయింది. "తనకే మగ పిల్లాడు పుట్టాడు, కానీ అమల పిల్లలను మార్చి తనకొడుకును కాజేయజూస్తున్నద"ని గొడవ మొదలు పెట్టింది. ఈ సమస్య రానురాను పెద్దదైపోయింది. ఎవ్వరికీ దీని పరిష్కారం తెలీలేదు.
చివరికి సమస్య మర్యాద రామన్నగారి దగ్గరకు చేరుకున్నది. మర్యాద రామన్న ఆ ఇద్దరినీ పిల్లలను తీసుకొని రాజభవనానికి రావలసిందిగా ఆదేశించాడు. రామన్నగారి ఆజ్ఞ ప్రకారం వారిద్దరూ పిల్లలను తీసుకొని కచేరీకి వెళ్ళారు. అక్కడ రామన్న "అబ్బాయి ఎవరికి కలిగాడు" అని అమలను అడిగాడు. "తనకే బాబు పుట్టాడ"ని చెప్పింది అమల. అంతలోనే కమల "లేదు లేదు, బాబు నాకే పుట్టాడు!" అని గట్టిగా ఏడుస్తూ మొత్తుకున్నది. సభలోని వారందరూ రామన్నఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడోనని కుతూహల పడ్డారు.
అప్పుడు రామన్న కొంచెం ఆలోచించి, అన్నాడు- "సరే! మీరిద్దరూ బాబు మీవాడే అంటున్నారు కదా! బాబు మీ ఇద్దరికీ దక్కాలి. అలా ఇద్దరికీ దక్కాలంటే వేరే మార్గం లేదు. ఆ అబ్బాయిని రెండు ముక్కలు చేస్తే సరిపోతుంది. చెరొక ముక్కా తీసుకోవచ్చు" అని తన కత్తిని ఒర నుండి బయటికి లాగాడు. సభ అంతా నివ్వెరపోయింది. మరుక్షణంలో అమల గట్టిగా అరిచింది: "వద్దు, వద్దు! నా బాబును ఏమీ చేయకండి! కావాలంటే బాబును కమలకే ఇచ్చేయండి. ఎక్కడున్నా నాబాబు క్షేమంగా ఉంటే నాకంతే చాలు" అని గట్టిగా ఏడ్చింది.
రామన్న కమల వైపుకు చూశాడు. తలవంచుకున్న కమల మారుపలకలేదు. "నిజమైన తల్లి ఎవరైనా కొడుకు మరణాన్ని భరించదు. ఎక్కడున్నా తన కొడుకు బాగుండాలనే కోరుకొంటుంది. అమల కూడా అదే చేసింది. కాబట్టి ఆ అబ్బాయి అమల కొడుకే" అని తేల్చిచెప్పాడు రామన్న. అవాక్కైన కమల తన తప్పును ఒప్పుకుంది.
తప్పూ తేలింది; న్యాయమూ జరిగింది; రామన్నగారి ఖ్యాతీ పెరిగింది.