ఈ మాసపు పెద్దలు రాసిన కథల్లో భాగంగా మాతృదేశపు ఔన్నత్యపు సౌందర్యాన్ని దర్శింపజేసే రష్యన్ కథ జననీ జన్మభూమిని అందుకోండి. రాధ మండువ గారి అనుసృజన దీనికి చక్కని రూపాన్నిస్తే, శివ వేసిన చిత్రాలు మరింత గొప్ప సొబగులని అద్దాయి. వీరికి ఇద్దరికీ అభినందనలు, ధన్యవాదాలు.
సంపదని ఎలా ఉంచుకోవాలో, ఎలా పంచుకోవాలో మానవ సమాజానికి ఇంకా అర్థం కాలేదు. ఈ మాసపు కొత్త బేతాళం కథ పీడాంతకం తనదైన నేపథ్యంలో ఈ సమస్యని ప్రస్తావిస్తున్నది. 'అందరం శాంతి సౌఖ్యాలతో బ్రతకాలంటే స్వార్థానికి మందు కనుక్కోక తప్పదు' అని గుర్తుచేసేందుకు చూస్తుంది. చదివి చెప్పండి మరి.
ఆఫ్రికన్ పిల్లాడు క్వేకుజిన్ గొప్ప సాహసమే చేశాడు. చెప్పిన మాటల్లా విని ఎంత సాధించుకొచ్చాడో చూడండి, క్రూరజంతువుల కథ - మొదటి భాగంలో. దీని ఆంగ్ల మూలాన్ని అందించిన Berty స్టోరీ నోరీ డాట్ కాం -storynory dot com వారికి ధన్యవాదాలు. కథ ముగింపు అయితే, మరి వచ్చే మాసం.
కాకి నలుపుది, పావురం నీలంది. కాకిని చిన్నచూపు చూసిన పావురం తన తప్పుని ఎలా గుర్తించిందీ, తర్వాత అవి రెండూ కలిసి ఏం చేసిందీ స్నేహం విలువ లో చూడండి. జంతువుల్ని ప్రేమించటం గురించి హిమశ్రీ రాసిన ఓ గందరగోళం ఆప్యాయత మరి మీ పిల్లలకి నచ్చుతుందేమో చూడండి. 'తెలివి ఒకరి సొత్తు కాదు. అందరికీ తెలివి ఉంటుంది' అని చిన్నవాడైనా పెద్దలకు కూడా గుర్తు చేస్తున్నాడు అహ్మద్, తన తెలివి కథలో. చదివితే బలే కోణాలు బయటపడతై. చదవండి మరి. 'గౌరవం మనకా? మనం వేసుకునే బట్టలకా?' ఆలోచిస్తే చురకలాగా తగులుతుంది ఏడవ తరగతి పృథ్వీ గుర్తు చేసిన వేషం_గొప్ప కథ.
గురజాడ అప్పారావుగారు పోయి వందేళ్ళు నిండింది. ఆయన్ని స్మరించుకుంటూ పదోతరగతి జగదీష్ రాసిన పద్య గాధ గ్రద్ద-పావురం. స్వేచ్ఛగా పారే కవనంలోని మాధుర్యాన్ని మనకు గుర్తుచేసేందుకు వచ్చాయి, గురజాడవారి దేశమును_ప్రేమించుమన్నా , నండూరి రామకృష్ణమాచార్యులవారి తప్పు_నాది_కాదు లు రెండూనూ. వీటన్నిటినీ చదివి మీరుకూడా కథల్ని పాటలుగాను, పద్యాలుగాను చెప్పగలరేమో, ప్రయత్నించండి!
"మనం కృషి చేస్తాం, దేవుడు సాయం చేస్తాడు" అని తనదైన శైలిలో, ఆచరణలో అమలు చేసి చూసేందుకు వీలుగా రాశారు, దేవుని సాయం కథను, ఆదూరి హైమవతి గారు. ఇక వియోగి కలం నుండి వెలువడిన మరో తూటా, కనువిప్పు. విగ్రహాలకూ, వానలకూ ఏమైనా సంబంధం ఉందని అనుకుంటారా, మీరు?
గర్వం ఎంత అనవసరమో చెప్పేందుకు సంగీతం మాధ్యమంగా ప్రయత్నించాడు మల్లికార్జున, తన గర్వభంగం కథలో. అట్లాగే 'విచారం వద్దు- పరిష్కారాలు వెతకాలి' అంటున్నది నారాయణ విచారం.
ఇన్ని ఉన్నై, ఈ మాసపు కొత్తపల్లిలో. ఇవి కాక, ఈ మాసపు తెలుసుకుందాం! చదివి సూడాన్ దేశం గురించి కనుక్కోండి. దినపత్రికల్లో సూడాన్ గురించి వచ్చే సమాచారాన్ని అర్థం చేసుకునేందుకు దీన్ని ఉపయోగించుకోండి! ఇక పదరంగమూ, పదాల్ని వెతికి పట్టుకోవటమూ అయితే ఉండనే ఉన్నై!