దిలీపుడు పిన్నవయసులోనే అంగరాజ్య సింహాసనం అధిరోహించవలసి వచ్చింది. అతని తండ్రి వేటకు వెళ్లి సింహాల బారిన పడి మరణించాడు. దాంతో పందొమ్మిదేళ్లకే దిలీపుడు రాజయ్యాడు.

ఇంకా చిన్నవాడే- రాజుగా వైభోగాలను అనుభవిస్తూ విలాసవంతంగా జీవిస్తున్నాడు. అనుభవం లేదు. అయితే అతని అదృష్టం కొద్దీ నమ్మకస్తులైన సైన్యాధిపతులు, విశ్వాసపాత్రులైన మంత్రులు లభించారు. మహామంత్రి వివేకవంతుడు అపర చాణక్యుడు. అన్నీ‌ తానై రాజ్యాన్ని నడిపేస్తున్నాడు.

ఏళ్ళు గడిచాయిగానీ మంత్రిగారినుండి దిలీపుడు ఏమంత నేర్చుకోలేదు- వయస్సుతోబాటు గర్వం తలకెక్కింది. 'నా విష్ణు: పృథివీ పతే: - రాజే దేవుడు' అనుకున్నాడు. వ్యవహారంలో మొరటుదనం వచ్చేసింది. చుట్టూ స్వార్థపరులు, భట్రాజులు చేరారు. చివరికి అతను ఆజ్ఞలు కూడా జారీ చేశాడు- "నా విగ్రహాలను గుళ్లల్లో ప్రతిష్ఠింప చేయండి. పూజలు చేయించండి" అని.

గమనిస్తున్న పౌరులకు, మంత్రులకు 'చివరికి మన రాజ్యం ఏమవుతుందో" అని చింత మొదలైంది. హనుమాన్‌పల్లెలో పూజారి హనుమంతుడు తెలివైనవాడు. "రాజుగారికి పాఠం చెప్పాల్సిందే" అనుకున్నాడు.

ఓ రోజు రాజుగారి దర్బారుకు వెళ్ళాడు. రాజుగారి ముందు నిల్చుని వినయంగా చెప్పాడు- "మహారాజా! హనుమాను పల్లె ప్రజలు మిమ్మల్ని శరణు వేడుతున్నారు" అని.

"ఏంటి విషయం?" విసుగ్గా అడిగాడు దిలీపుడు.

"మూడు సంవత్సరాలుగా వానలు లేవు- పంటలు పండటం లేదు- తాగేందుకు మంచినీళ్లు కూడా కరువై పోయాయి" విన్నవించుకున్నాడు.

"దానిదేముంది, మంత్రి గారికి చెప్పి ఊళ్ళో చెరువులు తవ్వించుకో" ఆనతిచ్చారు రాజుగారు.

"అదీ అయ్యింది ప్రభూ! ఎన్ని చెరువులు తవ్వినా, బావులు త్రవ్వినా చుక్క నీరు పడలేదు. ఆఖరికి ప్రజలు కప్పల పెళ్ళిళ్లు చేసి ఘనంగా ఊరేగించారు కూడా" చెప్పాడు హనుమంతుడు.

"మూర్ఖ ప్రజలు! కప్పలకు పూజ చేస్తే ఏమొస్తుంది? కనీసం నా విగ్రహానికి పూజ చేసి ఉన్నా వర్షాలు కురిసేవి" చెప్పాడు రాజు. "అది కూడా అయింది ప్రభూ! మీరు ఆగ్రహించకపోతే మనవి చేసుకుంటాను- మీ విగ్రహానికి నిగ్రహంతో ఎన్నో పూజలు చేశాము. కానీ వర్షాలు కురవటం అటుంచి ఉన్న కొన్ని బావులూ ఎండిపోయాయి!" చెప్పాడు.

"ఊఁ.. మీ పూజల్లో ఏదో లోపం ఉంటుంది. సరే, మహామంత్రీ! రోజూ ఎద్దుల బళ్ళల్లో కడవల నీళ్లను పంపించండి వీళ్ళ ఊరికి" ఆదేశించాడు రాజు.

"చిత్తం, మహారాజా! తమరి ఆజ్ఞ శిరోధార్యం! అలాగే చేస్తాం, కాని ఎన్ని దినాలు చేయగలం?" మహామంత్రి సందేహం వ్యక్తపరిచాడు. "వర్షాలు పడేదాకా" తేలిగ్గా చెప్పాడు దిలీపుడు.

"కానీ వానలు పడే సూచనలు కనిపించడం లేదు ప్రభూ!" మహామంత్రి చెప్పగా అవునన్నట్లు తలాడించాడు హనుమంతుడు. దాంతో దిలీపుడికి కోపం వచ్చేసింది. "ఓరీ మూర్ఖా! అట్లా అయితే ఇక చేయగలిగిందేమీ లేదు. మీ ఊళ్ళో వాళ్లంతా కట్టగట్టుకొని వేరే ఎక్కడికన్నా వలస పోండి!" హనుమంతుడిని ఉద్దేశించి కోపంగా చెప్పాడు దిలీపుడు.

"పోవచ్చు ప్రభూ! కానీ దాని వల్ల అక్కడి స్థానికుల నుండి వ్యతిరేకత వస్తుంది కదా. వాళ్ల ఆస్తుల్ని మేము కాజేసినట్లు వాళ్ళూ అనుకుంటారు. పైగా పుట్టి పెరిగిన ఊరు, ఆస్తిపాస్తులు వదులుకొని ఇంకో ఊరికి వలసపోవడానికి మా ఊరి వాళ్ళు కూడా ఇష్టపడరు కదా ప్రభూ" హనుమంతుడు నిదానంగా విన్నవించాడు.

"నువ్వు అనేదీ నిజమే! ప్రజలు మూర్ఖులు! 'ఈ గాలి, ఈ నేల , ఈ సెలయేరు' అంటూ ఉన్న చోటే పాతుకుపోతారు. మరి ఏం చెయ్యాలి?" అడిగాడు రాజు, కిరీటం సర్దుకుంటూ.

"తమరు దైవం కంటే ఎక్కువ. తమరు అజ్ఞాపిస్తే ఆ వరుణదేవుడు వచ్చి వర్షాలు కురిపించి వెళతాడు. మా ఊరి ప్రజలు కరువు తొలగిపోతుంది" సన్నగా విన్నవించుకున్నాడు హనుమంతుడు.

"ఓహో! మేము దేముళ్లమయి ఉండి కూడా, వర్షాల కోసం మరొకరిని దేబిరించాలా?! వరుణుడికి ఎంత కండకావరం! మా రాజ్యంలోని గ్రామంలోనే వర్షాలు కురిపించడా?! మహామంత్రీ! వెంటనే వరుణదేవుడిని హెచ్చరించండి! రెండు రోజుల్లోగా వర్షాలు కురిపించాలి- లేకపోతే అతన్ని శిక్షిస్తామని చెప్పండి!" ఆజ్ఞాపించాడు దిలీపుడు, సభ చాలించి వెళ్లిపోతూ.

వెంటనే వేద శాస్త్ర పారంగతుల్ని, విద్యా విశారదులను, భట్రాజులను, భజంత్రీలను అందరినీ తీసుకొని మహామంత్రి హనుమాను పల్లెకు చేరుకున్నాడు. అక్కడ శాస్త్ర ప్రకారం యజ్ఞం నిర్వహించాడు- హనుమంతుడిని, మరికొందరు గ్రామస్తులను కూర్చోబెట్టుకొని.

అదృష్టమో, లేక కాకతాళీయమో! రెండో రోజుకల్లా భళ్లున వర్షాలు కురవటం మొదలెట్టాయి. బావులు నిండాయి. చెరువులు నిండాయి. పిల్లకాలవలు నిండాయి. పొలాలు తడిశాయి. ప్రకృతి పులకించిపోయింది.

వర్షాలు పడ్డాయని తెలిసి దిలీపుడు మీసాలు మెలివేశాడు. తన ఆజ్ఞకు భయపడి వరుణుడు పరుగెత్తుకుంటూ వచ్చాడని భావించాడు. దాంతో అతనిలో అహం ఇంకా పెరిగిపోయింది.

నెల తరువాత హనుమాన్ పల్లెలో మళ్లీ వర్షాలు. ఈసారి అవి విపరీతంగా పడ్డాయి- చివరికి వరదలు ముంచుకొచ్చాయి. ప్రాణ నష్టం, ధననష్టం, ఆస్తి నష్టం.

హనుమంతుడు దిలీప మహారాజు సమక్షంలోకి వచ్చి ఫిర్యాదు చేశాడు మళ్ళీ. "వరుణదేవుడు తమరి ఆజ్ఞనే ధిక్కరిస్తున్నాడు ప్రభూ! యింకోసారి వర్షాలు కురిపించడమే కాకుండా, వరదలు కూడా తెప్పించి మా గ్రామస్తులను చాలా ఇబ్బందులపాలు చేస్తున్నాడు. ఎంతో ఆస్తి నష్టం జరిగింది; ధన నష్టం జరిగింది. అయినా నాకు పెద్దగా విచారం లేదు- ప్రజల డబ్బుదేమున్నది, ప్రజల ఆస్తులదేమున్నది?!

కానీ, వరుణుడి కావరం చూడండి- సాక్షాత్తు మీ గుడిని- నిత్య పూజలు అందుకునే మీ విగ్రహం ఉన్న గుడిని- వరదలు ముంచెత్తాయి. విగ్రహం కాస్తా వరదల్లో కొట్టుకుపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. అదే మా ఊరంతటికీ బాధాకరంగా ఉంది" అని.

"అదేమీ పరవాలేదులే! మీ గ్రామంకోసం నా విగ్రహమూర్తి మరొకదాన్ని క్రొత్తగా పంపిస్తాను. మీరంతా నిర్విఘ్నంగా పూజలు చేసుకోవచ్చు" అనునయించాడు దిలీపుడు.

"సమస్య అదికాదు మహారాజా! సాక్షాత్తు దేవదేవుడయిన తమరి విగ్రహాన్నే వరదలు తస్కరించాయే, ఇక సామాన్యులం, మా బ్రతుకులెంత? 'తమరు దేవుడైతే మరి తమరి దివ్యమూర్తిని ఈ సామాన్య వరదలు ఏల ముంచెత్తాయి?' అని నాస్తికులు ప్రచారం మొదలుపెట్టారు ప్రభూ! వారి కూటమి బలం పుంజుకుంటున్నది అప్పుడే" రెచ్చగొట్టాడు హనుమంతుడు.

దిలీపుడు ఇప్పుడు పరువు సమస్యలో పడిపోయాడు.

"ఏమంటారు మహామంత్రీ?!" అడిగాడు దిలీపుడు. మహామంత్రి కిమ్మనకుండా కూర్చున్నాడు.

"వరుణదేవుడు మిమ్మల్ని ధిక్కరించాడు మహారాజా! దీన్ని యింతటితో వదలకూడదు! 'పోనీలే, పాపం' అని వదిలేస్తే రేపు అతను యింకేమైనా చేయచ్చు. చెడిపోయిన ఇతన్ని చూసి చిల్లర దేవతలు యింకేమైనా ఘోరాలు చెయ్యచ్చు. అందుకని ప్రజలకు తమరిపైనున్న భక్తివిశ్వాసాలు నిలబడే మార్గం ఆలోచించండి" అని సెలవు పుచ్చుకున్నాడు హనుమంతుడు- మహారాజు గుండెల్లో పొగబెట్టి.

"మన తక్షణ కర్తవ్యం ఏమిటి మహామంత్రీ?!" అడిగాడు దిలీపుడు.

"మహారాజా! విషయం చిన్నది కాదు. జటిలమైనది. కాబట్టి దీన్ని పరిష్కరించడానికి ఒక సంఘాన్ని నియమిద్దాం!" పాము చావకుండా-కర్ర విరగకుండా సలహా ఇచ్చాడు వివేకవంతుడు. వెంటనే మహారాజు దానిని ఆమోదించాడు.

ఆరు నెలలు గడిచాయి. అంగరాజ్యంలో ఎక్కడా ఒక్క చుక్క కూడా వర్షం పడలేదు: ఎండలు మండి పోయాయి. చెరువులు, బావులు ఎండిపోయాయి. నీటికి కటకట ఏర్పడింది. వ్యవసాయం కుంటుపడింది. పశుగ్రాసం తగ్గిపోయింది. పశువులను కబేళాలకు తరలిస్తున్నారు. నిత్యావసరాలకు కూడా కరువు ఏర్పడింది. దాంతో రాణిగారికి కూడా మహారాజు పైన కోపం వచ్చింది- "ఇంత సువిశాల సామ్రాజ్యానికి మహారాజులు! అయినాఏం ఉపయోగం? కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకడం లేదు!" అని ఆక్షేపించింది.

దాంతో మహారాజుకు కోపం వచ్చింది. మంత్రులను సమావేశ పరచి "మహామంత్రీ! ఏమిటి ఈ దారుణం?! గత వంద సంవత్సరాలుగా- ఆ మాటకొస్తే చరిత్రలో ఎప్పుడూ- ఇటువంటి దారుణం లేదు! త్రాగు నీళ్లకు కూడా కటకటలాడాల్సి వస్తున్నది. ఎందులకీ పరిస్థితి?" అని అడిగాడు.

"ఏముంది మహారాజా! తమరు వరుణదేవుడిని శిక్షిస్తారని భయపడి అతగాడు మన దేశం వదిలి పారిపోయాడు" చెప్పాడు మహామంత్రి.

"పిరికిపంద! దాని వల్ల శిక్ష రెట్టింపవుతుందని అతనికి అర్థం కాలేదు" వ్యాఖ్యానించాడు సైన్యాధిపతి.

"మహామంత్రీ! వరుణదేవుడిని సగౌరవంగా ఆహ్వానించండి! 'మేం అతన్ని క్షమిస్తున్నాం. అతనిని దండించం' అని చాటించండి" మహారాజు చెప్పాడు.

రాజుగారి ఆజ్ఞమేరకు ఊరూరా దండోరా వేశారు- వరుణదేవుడు రావాలని, అతనికి ఎటువంటి శిక్ష ఉండదని. ఆగమ శాస్త్రం ప్రకారం పండితులు, పూజారులు వరుణయాగం చెయ్యడం ప్రారంభించారు. గాడిదల ఊరేగింపులు, కప్పల పెళ్లిళ్లు చేశారు. వరుణ భజనలు చేశారు.

కానీ హనుమాన్ పల్లెలో హనుమంతుడు మటుకు యిందుకు భిన్నంగా దిలీపుడి విగ్రహానికే పాలాభిషేకం చేస్తున్నాడు! ఈ వార్త మహారాజుకు తెల్సి, అతన్ని పిలిపించాడు- "మూర్ఖా! అందరూ వరుణ పూజలు చేస్తూ ఉంటే నువ్వు మా విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్నావట? ఎందుకు?!" విస్మయంగా అడిగాడు.

"అవును ప్రభూ!ఈ రాజ్యానికి దేవుడు మీరే! మిమ్మల్ని కొలిస్తే మీరు అనుగ్రహించని దేముంది?" హనుమంతుడు అడిగాడు. "హనుమంతా! ఇసుమంత తెలివికూడా లేకుండా మాట్లాడుతున్నావు. మహారాజుల వారు సర్వశక్తిసంపన్నులయితే మరి వర్షాలు కురవకుండా ఎలా ఉంటాయి?" ఆగ్రహించాడు మహామంత్రి.

"మరి గ్రామ గ్రామానా మహారాజు గారి విగ్రహాలు, గుళ్ళు ఉన్నాయిగా, వాటి వల్ల ఉపయోగం లేదా?!" సూటిగా అడిగాడు హనుమంతుడు.

"అంత మాట ఎవరు అనగలరు?" సైన్యాధ్యక్షుడు అన్నాడు.

"మ్రొక్కిన వరమివ్వని దేవతను గ్రక్కున విడువంగవలయు కదా?!" అడిగాడు హనుమంతుడు.

"మూర్ఖా! నీకు దేశ బహిష్కారం కావిస్తున్నాను!" కోపంగా చెప్పాడు మహారాజు.

"మహాప్రసాదం! నేను అనుకున్నది అదే, తమరు అనుగ్రహించిందీ అదే!" వినయంగా చెప్పాడు హనుమంతుడు.

"అదేమన్నమాట?!" విస్మయంగా అడిగాడు దిలీపుడు.

"క్షమించాలి! పడవను నడిపే నావికుడు తెలివిగా నడపాలి! తెలివి తక్కువ తనంతో అటూ ఇటూ చేస్తే ప్రయాణీకులందరూ ఏట్లో పడతారు. సువిశాల సామ్రాజ్యానికి ప్రభువులైనవారు గొప్ప కార్యశూరులై, రాజ్యాన్ని సక్రమంగా నడిపించాలి! అలాకాక ప్రభువులు మూర్ఖులై రాజ్యాన్ని భ్రష్టు పట్టిస్తే ప్రజలు యిక్కట్ల పాలవుతారు. ప్రజలందరికీ మార్గం నిర్దేశించవలసిన మహారాజులే అహంకారంతో ఊదిపోతే ప్రజలందరూ మరింత మూర్ఖంగా తయారవుతారు" హనుమంతుడు చెప్పాడు ప్రశాంతంగా.

"అంటే మా మహారాజుగారు 'మూర్ఖులు, అహంకారులు' అనా, నీ అభిప్రాయం?!" సైన్యాధ్యక్షుడు. ఆవేశపడ్డాడు "మన్నించాలి! అశాశ్వతమైన శరీరాన్ని ధరించిన మనం దేవుళ్లం ఎలా అవుతాం? మన మనసుపైనే మనకు నియంత్రణ లేదు. అటువంటిది దేవుడినని అహంకరించడం గ్రుడ్డితనం కాక మరేమిటి? పరమాత్మను వదిలి ఒక మామూలు మనిషిని పూజించమనటం ఏమిటి?!" హనుమంతుడు ప్రశ్నించాడు ధైర్యంగా.

సైన్యాధ్యక్షుడు కోపంతో ముందుకు ఫోటోగా, మహారాజు అతన్ని ఆపాడు. "హనుమంతా! మా కళ్లు తెరిపించావు! అహంకరించి రాజ్యమంతటా మా విగ్రహాలు ప్రతిష్ఠింప-జేసుకున్నాము. అది తప్పే! వాటినన్నిటినీ తొలగించండి. నేను ఎంత అల్పుడినో నాకు అర్థమయింది!" అని మంచి మనసుతో కంట తడి పెట్టాడు.

ఎందుకో మరి, వెంటనే ఉరుములు, మెరుపులతో వర్షం మొదలయింది రాజ్యం అంతటా.