పాండ్య దేశపు మధుర పట్నం
పెద్ద కోవెల అక్కడున్నది
దాని పొంతన పావురమ్ముల
జంట ఒకటుండెన్!
నేల మీదను ఆడుతుండగ
డేగ ఒక్కటి వాని చూసెను
పావురంబును ఒక్క దానిని
తన్నుకొని బో జూచెనోయ్!
గుడికి ముందర మనుషులుండిరి
చూసి వారల డేగ బెదిరెను
అయిన నాడుది డేగ ఉనికిని
చూసి భయపడెను!
గుడికి ముందుగ గుంపు గుంపులు
మనుషులే మరి లేకయుండిన
బతుకు డేగకు బలైపోదా?
కాపురమ్మిక సమసి పోదా?
డేగ చేతికి చిక్కకుండగ
కాలమే మరి కలిసివచ్చెను
సొంత యత్నము లేక కాలము
ఎంత వరకోపున్?
పంతమూనియు రేపొ-మాపో
గృథము మళ్ళీ రాక మానదు
మరో చోటికి వెళ్లిపోదము
రమ్ము రమ్మనె ఆడపక్కి!
పోరుటకు మన శక్తి చాలదు
బలగమా ఇట మనకు లేదు
అల్ప జీవులమైన మనకిట
రక్ష లేదనె ఆడ పక్కి!
బక్క చిక్కిన ముసలి గ్రద్దను
నాదు ముక్కున యముని వద్దకు
అంపి చూపెద భయము వలదని
మగడు గొప్పలు జెప్పుకొనియెను!
రెండు రోజులు గడిచినంతట
డేగ వాలెను గోపురాన
పావురమ్ముల పట్టి గొనిపో
బొంచి యుండిందోయ్
గోపురమ్మున సూర్య తేజము
నిట్టనిలువుగ కాంతులీనెను
పావురమ్ములు ఆవలింతల
బయల్వెడలెను రెక్కచాపగ
కంటి రెప్పలు తెరచులోగా
డేగ రివ్వున దూకె ముందుకు
క్రూర నఖముల పావురమ్ముల
మగని గ్రుచ్చుక నింగికెగసెను!
బీరమాడిన మగని ప్రాణము
లొక్క పెట్టున బాసి పోయెను
తెలిసి చేసిన పాపమిది యని మ్రో-
లెత్తి ఏడ్చెను ఆడుపక్షి
కీడు ఎంచుము పోరునందు
మేలు ఎంచుము కలిమియందు
వాస్తవమ్మే ఎపుడు నిలచును
ఒట్టి బీరము పుట్టి ముంచును!