అంజమ్మ ఒక పేదరాలు. ఆమె భర్త తాగుడుకు బానిసై, ఆరోగ్యం చెడి చనిపోయాడు. ఆమె ఒక్కగానొక్క కూతురు అమ్మూ. అంజమ్మ కూలీ-నాలీ చేసి ఎలాగో అమ్మూను చదివిస్తున్నది. అమ్మూ ఇప్పుడు ఏడో తరగతికొచ్చింది. బళ్ళోని ఇతర పిల్లలతో తనను పోల్చుకుంటుంది- రోజూ తల్లిని వేధించటం మొదలు పెట్టింది: "అందరిలాగా నాకూ మంచి బట్టలు కావాలి; నాక్కూడా అవీ-ఇవీ కావాలి' అని పోట్లాట, అంజమ్మతో. 'కూతురికి తమ పరిస్థితి ఇంకా అర్ధం కాలేదే' అని అంజమ్మ ఇంకా బాధ పడుతుండేది.

ఊళ్ళో మూలగా పురాతనమైన శివాలయం ఒకటి ఉండేది. ఆ శివాలయానికి రాబడి తక్కువ, పని ఎక్కువ. అందుకని దాని పట్ల ఎవ్వరూ పెద్ద శ్రద్ధ చూపేవాళ్ళు కాదు. అయితే 'దైవసేవ!'అని అంజమ్మ ఆ శివాలయాన్ని ఊడ్చే బాధ్యతను నెత్తిన వేసుకున్నది. శివాలయం శుభ్రం చేసేప్పుడంతా 'నా పేదరికపు కష్టం కంటే మా పాప గొడవ ఎక్కువ కష్టంగా ఉన్నది దేవుడా! నా బిడ్డకు మంచి బుధ్ధి ప్రసాదించు చాలు" అని దేవుడితో మొరపెట్టుకునేది.

ఒక రోజు ఉదయాన్న ఆమె గుడికి వెళ్ళే సరికి అక్కడ రావి చెట్టు క్రింద ఓ సన్యాసి కూర్చొని కనబడ్డాడు. అంజమ్మ అతనికి మ్రొక్కి, గుడి ప్రాంగణాన్నంతా ఊడ్చి శుభ్రం చేసింది.

సన్యాసి ఆమెకేసి చూస్తూ "మనుషుల ఆకలి ఓ వింత తల్లీ! నీకూ ఆకలి ఉంటుందిగా, నీకు ఇవిగో- ఈ గుమ్మడి గింజలు సరిపోతాయనుకుంటాను; చూడు!" అని తన జోలెలోంచి కొన్ని గుమ్మడి గింజలు తీసి అంజమ్మకు ఇచ్చాడు. అంజమ్మ వాటిని ఓ కాగితంలో పొట్లం కట్టుకొని ఇంటికి తెచ్చుకున్నది.

ఎప్పటిలాగానే ఆరోజు కూడా ఇల్లు చేరిందో లేదో-'ఆకలి ' అంటూ అరిచింది అమ్మూ. "ఉండు తల్లీ! వస్తున్నా.." అంటూ తను తెచ్చుకున్న గుమ్మడి గింజల పొట్లం తెచ్చి కూతురు చేతిలో పెట్టింది అంజమ్మ- "ఇవి తింటే ఆకలీ తీరుతుంది; బలమూ వస్తుంది! గుమ్మడి పండులా ఒళ్ళు గట్టి పడుతుంది!"అంటూ.

అమ్మూకు అరికాలి మంట నెత్తి కెక్కింది- "అందరూ ఎంచక్కా గారెలూ, బూరెలూ, ఇడ్లీలూ, పెసరట్లూ తింటారు. అవేమన్నా పెట్టావా, ఒక్కనాడైనా?! ఎప్పుడూ ఇట్లాగే- విత్తనాలూ, గింజలూ తెచ్చి నాముఖాన కొడతావ్! ఇట్లాంటివి నాకు వద్దే వద్దని ఎన్ని సార్లు చెప్పాలి?!" అని అరిచి, అయినా కోపం పట్టలేక వాటిని కిటీకీలోంచి బయటికి విసిరి కొట్టింది.

అంజమ్మకు కూడా కోపం వచ్చేసింది- "అమ్మూ! 'ఆకలికి రుచి తెలీదు, నిద్రకు సుఖం తెలీదు' అంటారు పెద్దలు. నీకు నిజంగా ఆకలైతే ఏదో ఒకటి తినాలి- అంతే! మనమేమన్నా భాగ్యవంతులమా, గారెలూ బూరెలూ వండుకు తినేందుకు? మీ నాయన ఎన్నడో చనిపోతే, నేనే ఏదో కూలీ-నాలీ చేసి చదువు చెప్పిస్తున్నానని నీకు తెలీదా? ఇవాళ్ళ గుళ్ళో ఊడుస్తుంటే ఒక సన్యాసి కనబడి ఈ గింజలు ఇచ్చాడు. వీటిని తింటేనన్నా నీకు బలమూ, బుద్ధీ వస్తాయని ఆశ పడ్డాను. నువ్వే గొప్పదానివన్నట్టు అన్నీ విసిరి కొట్టావు!" అంటూ బయటికి వెళ్ళి దొరికిన గుమ్మడి విత్తనాలన్నీ ఏరుకొచ్చింది.

వాటిని శుభ్రంగా కడిగి "నువ్వు తింటావా, నన్ను తినెయ్యమంటావా?!" అడిగింది అమ్మూను. ఏమనుకుందో ఏమో కానీ అమ్మూ వాటిని తీసుకుని, ఒలిచి నోట్లో వేసుకున్నది. వాటిని నములుతుంటే అవి చాలా తియ్యగా అనిపించాయి. అటుపైన ఆ పాప మారాం మానేసి, గింజలన్నిటినీ తీసుకొని తినేసి, ఆటలాడుకునేందుకు పోయింది.

మరుసటి రోజున ఉదయం అంజమ్మ ఇంటి చుట్టూ ఊడ్చేందుకు వెళ్ళినప్పుడు చూసింది: కిటికీ అవతలగా తీగ ఒకటి మొదలై, వాళ్ల గుడిసె పైకంటా పాకి ఉన్నది! చూస్తే అది ఒక గుమ్మడి తీగ. ఆ తీగకు నిండా పెద్ద పెద్ద గుమ్మడి కాయలు కాసి ఉన్నాయి- ఒక్కో కాయా ఒక్కో కుండంత సైజులో ఉన్నది! అన్నీ బంగారు రంగులో మెరుస్తున్నాయి!

అంజమ్మ తన కళ్ళను తానే నమ్మలేక పోయింది. "అమ్మూ! ఓ అమ్మూ ! ఇటు వచ్చి చూడు! మన ఇంటిమీద ఈ గుమ్మడితీగా, దానికి బానలంత సైజు గుమ్మడి కాయలు! ఇదేదో‌ మంత్రం లాగే ఉంది అమ్మూ!" అని అరిచింది. వెళ్ళి చూసిన అమ్మూ కూడా ఆశ్చర్య-పోయింది- "అమ్మా! నిన్న నువ్వు గుడినుండి తెచ్చానన్నావే, వాటిల్లో గింజ ఒకటేదో ఇక్కడ పడి మొలిచి ఉండాలి! అయినా ఒక్కరోజులో గుమ్మడి చెట్లు ఎందుకొస్తాయి?" అంది.

ఆ రోజు వాళ్లింట్లోనే కాదు, ఇరుగు-పొరుగుల ఇళ్ళలో కూడా గుమ్మడికాయ కూర అద్భుతంగా కుదిరింది. మరుసటి రోజున అమ్ము, అంజమ్మ ఇద్దరూ‌ కలిసి మిగిలిన గుమ్మడి కాయలన్నింటినీ కోసి, క్రిందికి దింపి, సంతలో అమ్మారు. నిగనిగలాడే గుమ్మడి కాయలు ఎన్నడూ లేనంత ధరకు అమ్ముడయ్యాయి!

ఆ తర్వాతి రోజున కూడా ఆమె ఇంటి పెరడునంతా శుభ్రం చేసి, మరిన్ని కూరగాయ గింజలు, ఆకు కూర గింజలు తెచ్చి నాటింది. చిత్రం ఏమో గానీ, అన్నీ మొలవటమే కాదు; ఏ రోజుకారోజు చాలా వేగంగా పెరగసాగాయి కూడా! గుమ్మడికాయ కాత చాలా నెలల పాటు కొనసాగింది. ఆలోగా సొరకాయలు, బీరకాయలు, కాకర కాయలు, చిక్కుడు కాయలు- ఇలా రకరకాల కూరలు కాపుకొచ్చాయి. ఇప్పుడిక ప్రతిరోజూ ఉదయాన్నే అంజమ్మతో‌బాటు అమ్ము కూడా వాళ్ళ పెరటి తోటలో‌ పనిచేయసాగింది: ఇద్దరూ కలిసి మొక్కలకు నీళ్ళు పోసేవాళ్ళు, ఎరువు తెచ్చి వేసేవాళ్ళు, కాయలు కోసేవాళ్ళు. అమ్ము బడికి వెళ్ళాక, అంజమ్మ వాటిని తీసుకెళ్ళి అమ్మేది. శ్రమించటం అలవాటయిన అమ్మూ అల్లరి తగ్గింది, బాధ్యతగా తయారైంది- పొదుపు, తృప్తి అలవడ్డాయి. కుటుంబంలోకి శాంతి-సుఖాలు ప్రవేశించాయి.

"చూశావా అమ్మూ! గుప్పెడు గుమ్మడి గింజలతో మన జీవితాలు ఎలా మారిపోయాయో?! ఆ సన్యాసి ఎవరో కాదు- నిజంగా ఆ శివుడే! "అనేది అంజమ్మ, రోజూ ఓసారైనా.