అనగా అనగా ఒక ఊళ్లో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఏడుగురు భార్యలు. ఆ ఏడుగురు భార్యలకూ ఏడుగురు కూతుర్లున్నారు గానీ ఒక్క కొడుకూ లేడు. రాజు గారు వాళ్ల నాన్నకి ఒకటే విచారం వేసింది- "అయ్యో! ఒక్క మగపిల్లాడన్నా ఉంటే బాగుండు కదా, వీడి తర్వాత రాజ్యాన్ని పరిపాలించేది ఎవరు?" అని.
ఆయన రాజుతో అన్నాడు యీ మాటే దాంతో రాజుగారు కూడా విచారపడ్డారు. విచారం ఇప్పుడు ఇద్దరికి వేయటం మొదలెట్టింది.
అప్పుడింక రాజుగారు రాణుల దగ్గరికి పోయి, చెప్పారు-"నాకు చాలా విచారంగా ఉంది అమ్మాయిలూ, మనకి ఏడుగురు ఆడపిల్లలున్నారు గానీ ఒక్క మగపిల్లాడన్నా లేడే! నా తర్వాత రాజ్యం అంతా వేరే ఎవరికి ఇవ్వాలో ఏమో!" అని. దాంతో ఏడుగురు రాణులకూ విచారం మొదలైపోయింది. అట్లా ఇపుడు విచారం తొమ్మిది మందికి వేయసాగింది.
రాణులు ఊరికే ఉండరు కదా, వాళ్లంతా ఎవరికి వాళ్లు వాళ్ల చెలికత్తెలకు చెప్పారు విచారంగా. "చూడే, ఎన్నడూ లేనిది ఇవాళ్ల రాజుగారు కూడా విచారపడ్డారు! నాకు ఒక్క మగపిల్లాడన్నా పుడితే బాగుండును కదా, ఆయన విచారం పోగొట్టేందుకు!" అని. దాంతో పాపం చెలికత్తెలు కూడా విచారపడటం మొదలు పెట్టారు. అట్లా విచారం ఇప్పుడు 16 మందికి వేయసాగింది. ఆ చెలికత్తెలందరూ పోయి వాళ్ల భర్తలకి చెప్పారు "పాపం, రాజుగారు. ఎంత కష్టం వచ్చిందో చూడండి. ఏడుగురికి ఏడుగురు ఆడపిల్లలే. ఒక్క మగపిల్లాడన్నా కష్టం తీరుపోవును కదా" అని. "పాపం" అని విచారపడ్డారు భర్తలందరూ. దాంతో విచారం ఇప్పుడు మొత్తం 24 గురికి వేయటం మొదలుపెట్టింది.
ఆ లోపల 24మందీ మరో 24తో చెప్పుకున్నారు. ఆ మొత్తం 48మందీ మరో 48 తోటి. ఆ మొత్తం 96 మందీ మరో 96 తోటి ఆ మొత్తం మందీ మరో 192 మంది తోటి. ఆ మొత్తం మందీ మరో 384 తోటి.
అట్లా ఆ 768మందీ -ఆ 1536మంది- ఆ 3072మంది- ఆ 6144- మళ్లీ వాళ్లంతా మరో 12288మంది తోటి -ఆ 24576 మందీ కలిసి -ఆ 49152 మందీ కూడా మళ్లీ -మొత్తం 98304మందీ కలిసి -1,96,608 మంది- ఘోరంగా విచారపడి పోవటం మొదలెట్టారు.
అట్లా విచారం ఊళ్లు ఊళ్లనీ మింగేస్తూ పోయి చివరికి సంతోషవరానికి కూడా చేరుకున్నది. ఆ ఊళ్లో కూడా ఒకరు, ఇద్దరు, నలుగురు, ఎనిమిది మంది-పదహారు-ముప్ఫై రెండు ఇట్లా ఎక్కువెక్కువ మంది విచారపడి పోవటం మొదలెట్టారు. "అయ్యో! రాజుగారికి ఒక్క మగపిల్లాడూ లేడే! ఇక రాజ్యం ఎలాగ?” అని.
అయితే ఆ ఊళ్ళో ఆనందలక్ష్మి అని ఓ చిట్టి పాప ఉండేది. ఆ పాపకి సంగతి అర్థమైంది గానీ, విచారం మటుకు అస్సలు వెయ్యలేదు! "ఏముంది, మగ పిల్లాడు లేకపోతే?! అంత మంది ఆడపాపలున్నారు గదా, రాజ్యాన్ని వాళ్లకే అప్పజెబితే పోయే!" అనేసింది అలవోకగా.
"అవునే! ఈ సంగతి మనకు ఎందుకు తట్టలేదు?" అని అందరూ నోళ్లు వెళ్లబెట్టారు.
మన విచారాలన్నీ కూడా చాలా వరకు ఇట్లానే ఉంటాయి. ఏవో కొన్ని ఊహలతో మొదలై అవి అందరికీ అంటుకుంటూ పోతాయి. విచారం వల్ల నిజానికి ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ. పరిష్కారాలు దొరికించుకోవటమే వాటికి మందు!