1
'కుజ్మా' తాత తన మనమరాలు 'వర్వరా'తో కలిసి ఓ గ్రామంలో ఉండేవాడు. కారడవిని ఆనుకుని ఉండేది ఆ ఊరు.
అది చలికాలం. దట్టమైన మంచుతో, చలి గాలులతో, వణికించే చలితో గడగడలాడిస్తున్నది వాతావరణం. మంచు కూడా గడ్డ కట్టి ఉంది. రాత్రి వేళల్లో అడవిలో తోడేళ్ళ అరుపులు హోరెత్తిస్తున్నాయి.
“ఆ తోడేళ్ళు చూడమ్మాయ్! మనుషుల్లాగే ఇళ్ళల్లో ఉండాలని, వాళ్లలాగే పొయ్యి ముందు కూర్చొని చలి కాచుకోవాలని ఎలా అరుస్తున్నాయో!?” అనేవాడు చలికి వణుకుతూ తాత.
సరిగ్గా అట్లాంటి సమయంలోనే తాత దాచుకున్న ముక్కుపొడుం అంతా అయిపోయింది. ఆయన వల్లమాలిన దగ్గుతో బాధ పడుతున్నాడు. దగ్గుతూ దగ్గుతూ మధ్యలో 'ముక్కుపొడుం పీలిస్తే బావుండు, మామూలు మనిషినవుతాను' అంటున్నాడు.
తాత బాధ చూడలేని వర్వరా ఒక ఆదివారంనాడు బయలుదేరి సంతకి వెళ్ళింది- ముక్కుపొడుం తీసుకు రావడానికి. పొడుం కొనుక్కుని రైల్వేస్టేషన్‌కి తిరిగైతే వచ్చింది గానీ ఇంకా రైలు రావడానికి సమయం ఉంది- దాంతో ఆ పాప ఫ్లాటుఫారం మీదే అటూ ఇటూ తిరగసాగింది. అక్కడ టీ షాపుకి దగ్గరగా ఇద్దరు సైనికులు కూర్చుని ఉన్నారు. వాళ్ళల్లో ఒకతనికి గడ్డం పెరిగి ఉంది. అతని కళ్ళు చాలా దయగా ఉన్నాయి.
వర్వరా వాళ్ళ ప్రక్కనుండి నడుస్తుండగా ఒక రైలు బండి వేగంగా దూసుకుపోయింది. అది చిమ్మిన మంచు వాళ్ళని కప్పివేసింది.
“జాగ్రత్తమ్మాయ్, ఆ రైలు నిన్ను ఎగరేసుకుపోకుండా చూసుకో" అని గడ్డమతను అరిచాడు. వర్వరా అక్కడున్న దీప స్తంభాన్ని గట్టిగా పట్టుకుని కళ్లు మూసుకుంది.
రైలు దాటిపోయాక వర్వరా వైపు చూస్తూ "నీ చేతిసంచీలో ఏం ఉంది? నస్యం కాదు కదా?!” అడిగాడు గడ్డపు సైనికుడు కొంచెం ఆశగా.
“అవును, నస్యమే!" అంది వర్వరా.
“దయచేసి దానిలో కొంత నాకు అమ్ముతావా? -కొంచెం చాలు!" అడిగాడు అతను.
“తాత అలా అమ్మవద్దంటాడు. నీకు కొంచెం కావాలంటే తీసుకో, డబ్బులేమీ అక్కర్లేదు" అంటూ సంచీలోంచి కొంత పొడి తీసి ఇచ్చింది. గట్టిగా ముక్కునిండా పొడుముని పీల్చుకున్న అతని కళ్ళు సంతోషంతో మెరిసిపోయాయి.
“అమ్మాయీ, దీనికి బదులుగా నేను నీకు ఈ ఉక్కు ఉంగరం ఇస్తున్నాను- తీసుకో" అన్నాడు.
“వద్దండీ" అంది వర్వరా.
గడ్డమతని ప్రక్కన కూర్చుని ఉన్న రెండవ సైనికుడు "తీసుకో, ఇతను చాలా గొప్పవాడు. ఇతనిచ్చే ఆ ఉంగరం నీకు అదృష్టాన్ని తీసుకురాగలదు" అన్నాడు.
గడ్డమతను నవ్వుతూ "అవును అమ్మాయీ, ఇది అద్భుతమైన ఉంగరం. దీన్ని నువ్వు మధ్యవేలికి ధరించావనుకో, మీ ఇంట్లో వాళ్లంతా ఆరోగ్యంగా ఉంటారు. ఉంగరంవేలికి పెట్టుకుంటే ఎంతో సంతోషాన్ని పొందుతారు. చూపుడువేలికి ధరిస్తే ఇక ప్రపంచంలోని అందాలన్నీ కనిపిస్తాయి!" అన్నాడు.
“అవునా, చాలా సంతోషం. మా తాత ఆరోగ్యం బాగా లేదు. అందుకని నేను ఇప్పుడు దీన్ని నా మధ్య వేలికి పెట్టుకుంటాను" అంటూ ఉంగరాన్ని తీసుకుని మధ్యవేలికి పెట్టుకుంది వర్వరా. అంతలో తన ఊరు పోయే రైలు రావడంతో వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకుని రైలు ఎక్కింది.
2
చలిగాలి శరీరాన్ని చీరేస్తోంది. వేలికి ఉన్న ఉంగరాన్ని తిప్పుకుంటూ, దాని మెరుపు చూసుకుంటూ, సీట్లో ఓ మూలగా ముడుక్కుని కూర్చుంది వర్వరా.
అంతలోనే రైలు వాళ్ళ ఊరు చేరింది. రైలు దిగి ఊళ్ళోకి నడుస్తుండగా ఆమెకు ఒక ఆలోచన తట్టింది: "గడ్డం సైనికుడు చిటికెన వేలు గురించి చెప్పడం మరిచాడే?! ఉంగరాన్ని ఆ వేలికి పెట్టుకుంటే ఏమవుతుంది?!" అని. వెంటనే ఉంగరాన్ని మధ్యవేలి నుంచి తీసి చిటికెన వేలుకి మార్చబోయింది గభాల్న. సరిగ్గా ఆ సమయానికి ఆమె ఓ చిన్న లోయ ప్రక్కగా నడుస్తోంది. అకస్మాత్తుగా ఉంగరం ఆమె వేలినుండి జారి, క్రింద లోయలో పడిపోయింది!
వర్వరా లోయలోకి దిగి, చేతులతో మంచుని అడ్డు తొలగిస్తూ వెతికింది చాలా సేపు. చలికి ఆమె వేళ్ళు నీలంగా మారాయి కానీ ఉంగరం మాత్రం కనపడలేదు.
వర్వరా కన్నీటి పర్యంతం అయింది. 'అయ్యో! ఇప్పుడు తాత ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేది ఎలా? నేను ప్రపంచంలో వింతలను చూసేది ఎలా?” అనుకుని దిగులు పడింది. కన్నీళ్లు ఆమె బుగ్గల మీదకి జారి గడ్డ కడుతున్నాయి. "మంచు కాలం పోయాక మళ్ళీ వచ్చి ఉంగరాన్ని వెతకాలి" అనుకున్నది. "అప్పుడు దొరుకుతుంది ఉంగరం, ఖచ్చితంగా". ఈ ఆలోచన రాగానే కళ్ళు తుడుచుకుని ఉంగరం పడిన ప్రాంతంలో గుర్తుగా ఒక మొక్కను నాటింది.
ఇంటికి వెళ్ళి తాతకి ముక్కు పొడుముని ఇచ్చింది. తాత దాన్ని కొద్ది కొద్దిగా పీలుస్తూ శరీరాన్ని వెచ్చబరుచుకున్నాడు.
మంచు తుఫాను గ్రామాన్ని ముంచెత్తింది. ఇళ్ళు, చెట్లు మంచుతో కప్పబడిపోయాయి. కుజ్మా తాతకి దగ్గు ఎక్కువయింది. ఇప్పుడు మరీ అతని పడక క్రింద నిప్పుల కుంపటి విడవకుండా ఉంచవలసి వస్తోంది. ఎప్పుడూ త్రాగడానికి వేడిగా ఏదైనా ఇవ్వమంటున్నాడు. నీళ్ళు వేడి చేసి నోట్లో పోస్తే త్రాగుతున్నాడు. ఘనపదార్థమేదీ మింగలేకపోతున్నాడు.
"ఉంగరం ఉన్నట్లయితే తాత ఆరోగ్యం బాగుపడేది. తొందరపాటుతో ఆ ఉంగరాన్ని ఎట్లా పోగొట్టుకున్నానో చూడు!" అని వర్వరా తన్ను తాను తిట్టుకుంటూ, దిగులుగా సూర్యుడి కోసం ఎదురు చూడసాగింది.
3
ఒకరోజు ఉదయం నిద్ర లేచేసరికి కిటికీ ద్వారా లోపలకి వస్తున్న సూర్య కిరణాలు కనిపించాయి- దిగ్గున లేచి పరిగెత్తుకుంటూ బయటకి వెళ్ళింది. వెచ్చటి గాలి ఆమె కళ్ళని తాకింది హాయిగా- "వసంతకాలం వచ్చేసింది తాతా!" అని అరుచుకుంటూ చెప్పింది తాత దగ్గరికి పరుగెత్తి. తాత కళ్ళు తెరిచి నవ్వాడు.
ఇళ్ళ కప్పుల నుండి మంచు కరిగి శబ్దం చేస్తూ క్రిందికి జారుతోంది. అడవిలోని చెట్ల కొమ్మలన్నీ తడిసి పోయి ఉన్నాయి. కొండ వాగులు పొంగి పొర్లుతున్నాయి. జలపాతాల హోరులు, పక్షుల కిలకిలలు కమ్మగా వినిపిస్తున్నాయి. అప్పుడే పూలచెట్లు కూడా పుష్పించడానికి ఆయత్తమవుతున్నాయి.
ఉంగరం పోగొట్టుకున్న చోట తను నాటిన చిట్టిమొక్క కూడా మంచు నుండి బయటపడింది కొద్ది రోజుల్లో. వర్వరాకి ఆ చెట్టును చూసి చాలా సంతోషం వేసింది. గబగబా వెళ్ళి ఆ మొక్క చుట్టూ ఉన్న పాత ఆకులు, పుల్లలు అన్నీ తొలగిస్తూ ఉంగరం కోసం వెతికింది. ఒక ఆకు క్రింద మెరుస్తూ కనిపించింది ఉంగరం!
“ఆహా! నా ఉంగరం దొరికిందోచ్!" అని అరుస్తూ అక్కడే కూలబడి దాన్ని చేతులోకి తీసుకుంది వర్వరా.
ఉంగరం ఏ మాత్రం తుప్పుపట్టలేదు. కొంచెంసేపు దాన్ని మురిపెంగా చూసుకున్నాక "తాత ఆరోగ్యం బావుండాలి" అని కోరుకుంటూ ఉంగరాన్ని మధ్యవేలుకి ధరించి ఇంటికి వచ్చింది వర్వరా. ఆ సరికి కుజ్మా తాత ఇంటి ముందున్న తిన్నె మీద కూర్చుని ఉన్నాడు! ఇన్ని రోజులుగా బయటికే రాని తాతని అట్లా ఇంటి బయట చూసి వర్వరా ఆశ్చర్యపోతూ ఆయన దగ్గరకి పరిగెత్తింది.
"చూడు అమ్మాయీ, నువ్వు గెంతుకుంటూ మన ఇంటి తలుపు కూడా వేయకుండా వెళ్ళావు. బయట నుండి మంచి వెచ్చని గాలి లోనికి వచ్చింది. దాంతో నా రోగం ఎగిరిపోయింది! రా, త్వరగా పొయ్యి వెలిగించు! రొట్టెలు చేసుకుని తిందాం, ఆకలిగా ఉంది" అన్నాడు తాత ఆమెని చూడగానే, నవ్వుతూ.
వర్వరా నవ్వింది. తాత దగ్గరికెళ్ళి కూర్చొని, నెరిసిపోయిన వెంట్రుకలని చక్కచేస్తూ "ఉంగరం నీ ఆరోగ్యాన్ని బాగు చేసింది!" అంది సంతోషంగా.
“అవును, వెచ్చని వాతావరణపు ఉంగరం నా శరీరాన్ని చుట్టుకుని నన్ను బాగు చేసింది" అన్నాడు ఉంగరం సంగతి ఏమీ తెలియని కుజ్మా తాత.
వర్వరా ఆ రోజంతా ఆ ఉంగరాన్ని మధ్యవేలికే పెట్టుకుంది. రాత్రి పడుకునేటప్పుడు మాత్రం దాన్ని ఉంగరపు వేలికి మార్చింది. "ఇప్పుడు నాకు సంతోషం కలగాలి" అనుకున్నది; కాని అది వచ్చినట్లు ఏమీ సూచన కనిపించలేదు. "బహుశా నిదానంగా వస్తుందేమోలే" అనుకుంటూ నిద్రలోకి జారిపోయింది.
ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసింది; తాతకి స్నానం చేయించి తను కూడా తలారా స్నానం చేసింది; మంచి దుస్తులు ధరించింది; కూరలు, పండ్లు తెచ్చుకోవడానికి అడవిలోకి వెళ్ళింది.
పచ్చని గడ్డి భూమి అంతటా పరుచుకుని ఉంది. అడవి పూల చెట్లు పుప్పొడి రజనును నేల మీదికి విదిలిస్తున్నాయి. పిట్టల కిలకిలలు అడవంతా మారుమ్రోగుతున్నాయి. అడవిలో కలియ తిరుగుతూ పండ్లు సేకరించుకుంటున్న వర్వరాకి సంతోషం కట్టలు త్రెంచుకున్నది. అడవి అంతా ప్రతిధ్వనించేట్లు అరిచింది పిట్టలని అనుకరిస్తూ. అవి మళ్ళీ ఆమెకి బదులివ్వసాగాయి. పెద్దగా నవ్వుకుంటూ, అరుచుకుంటూ, గెంతుకుంటూ ఇంటికి వచ్చింది వర్వరా.
తర్వాతి రోజున తాత కూడా ఆమెతోపాటు అడవిలోకి వచ్చాడు షికారుగా. “ఆహా! వర్వరా! ఈ వాతావరణం నాకెంత సంతోషాన్ని కలిగిస్తున్నదో తల్లీ!” అన్నాడు.
తాత తలని నిమిరింది వర్వరా. నెరిసిన ఆ జుట్టును పైకి తోస్తూ “అవును తాతా! ఉంగరం నీకు సంతోషాన్ని కలిగిస్తున్నది" అంది.
“అవునమ్మా, వసంతం అడవి తల్లికి ఇచ్చిన పచ్చని ఈ ఉంగరం నాకు సంతోషాన్ని కలిగిస్తున్నది" అన్నాడు తాత.
4
రోజులు గడిచే కొద్దీ వసంతం ఇంకా క్రొత్త అందాల్ని సంతరించుకుంటున్నది.
"ఇప్పుడు ఇంక ప్రపంచంలోని వింతలన్నీ చూస్తాను" అనుకున్నది వర్వరా. దానికిగాను ఆ రోజు రాత్రి ఉంగరాన్ని తన చూపుడు వేలికి మార్చింది. అయినా ఆమెకు ప్రత్యేకంగా ఏమీ వింతలు కనిపించలేదు. "బహుశ: రేపు కనిపించచ్చు" అనుకున్నది. తరువాతి రోజు ఉదయాన్నే ఆ సంగతి మర్చిపోయి తాతతో కలిసి అడవిలోకి వెళ్ళింది.
ఆ రోజున తాత వర్వరాని అడవిలోనే ఒక లోయ ప్రాంతానికి తీసుకెళ్ళాడు. లోయ లోతుల్లోంచి అసంఖ్యాకమైన చెట్లు ఎత్తుగా, పర్వతాల్లాగా పెరిగి ఉన్నాయి. లోయ చుట్టూ పైవైపున గట్టులాగా చిన్న చిన్న దుబ్బలు, రకరకాల ముళ్ళ చెట్లు- వాటికి ఊదారంగు పువ్వులు- గుత్తులు గుత్తులుగా! ఎన్ని పూలున్నాయో లెక్కలేదు- అన్ని పువ్వులు! ఆ పువ్వులతో నిండిన లోయంతా ఊదారంగు తివాచీ పరిచినట్లుగా ఉంది. అంత గాఢమైన సౌందర్యాన్ని ఆమె ఇంతకు మునుపెన్నడూ చూసి ఎరగదు.
“ఆహా! ఏమి వింత, ఈ శోభ!" అన్నాడు తాత తన్మయుడైపోతూ. ఉన్నచోటే నిలబడిపోయి మత్తెక్కినట్లు చూస్తున్న తాత దగ్గరకి వచ్చి, అతని నెరిసిన వెంట్రుకలని సవరిస్తూ "అవును తాతా, ఉంగరం వింతలను చూపిస్తున్నది" అంది వర్వరా.
“అవునమ్మా, తన చుట్టూ ఊదారంగు పూల ఉంగరాన్ని ధరించిన లోయ మనకి వింతలు చూపుతోంది" అన్నాడు తాత.
“ప్రపంచంలోని వింతలు కూడా కనపడాలిగా తాతా" అంది వర్వరా.
ఈసారి తాత తన మనమరాలి భుజాన్ని తట్టి “ఆ సమయం వచ్చినపుడు అవీ చూద్దువు గానీలే తల్లీ, కానీ అసలు మనం పుట్టిన గడ్డలో కనిపించే వింతలను మించినవి ఇంకెక్కడ ఉంటాయి చెప్పు?!” అన్నాడు మైమరచిపోతూ.
'అవును, నిజమే!' అనుకుంది వర్వరా. కొమ్మల మధ్య నుండి వాలుతున్న సింధూరపు రంగు కిరణాలు ఆమె ఉంగరం మీద పడి మరో కొత్త వన్నెని సంతరించుకున్నాయి.