రాజోలులో నివసించే జోత్స్నకు 'నా' అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ పాప అక్కడా ఇక్కడా పనులు చేసుకుంటూ ఒంటరిగా బ్రతికేది.
ఒకసారి ఆ పాప రోడ్డు మీద పోతూ ఉంటే చెత్తకుండీ చుట్టూ తిరుగుతూ, ఆకలికి అరుస్తున్న పిల్లి పిల్ల ఒకటి కనిపించింది. జ్యోత్స్నకు దాన్ని చూసి చాలా జాలి వేసింది. దాన్ని ఇంటికి తీసుకొచ్చి పెంచసాగింది.
అట్లాగే ఒకసారి ఆమెకో కుక్క పిల్ల కనిపించింది. అదీ ఇంటికి చేరుకున్నది. అట్లా ఒకదాని తర్వాత ఒకటి అనేక జంతువులు జ్యోత్స్న దగ్గరికి చేరుకున్నాయి.
జ్యోత్స్న వాటికి తనతోపాటు కొంచెం వండి పెట్టేది; అవికూడా ఆ పాపకు భారం కాకుండా తమ ఆహారాన్ని తాము సంపాదించుకొని తినేవి.
అట్లా ఉండగా ఒకసారి పిల్లికి జబ్బు చేసింది. జ్యోత్స్న తనకు తోచిన ఆకులు, అలములతో వైద్యం చేసింది; చివరికి దాన్ని పశువుల ఆసుపత్రికి తీసుకుపోయింది. వాళ్ళు దానికి మందు ఇచ్చి "చూడు పాపా, దీనికి వచ్చిన జబ్బు అంటు వ్యాధి. దీనితోపాటు ఉంటే ఇది నీకు కూడా సోకే ప్రమాదం ఉంది. దీన్ని ఎక్కడైనా వదిలి పెట్టేయి. ఇది చచ్చిపోతుంది ఎలాగూ" అన్నారు.
జ్యోత్స్నకు పిల్లిని వదిలి పెట్టటం అస్సలు ఇష్టం కాలేదు. పిల్లి మీద మమకారంతో దాన్ని తనతోబాటే ఉంచుకొని సపర్యలు చేసింది. కొద్ది రోజులు గడిచేసరికి పిల్లి రోగం మరింత పెరిగింది. ఇప్పుడది జ్యోత్స్నకూ అంటుకున్నది!
జ్యోత్స్నకు భయం వేసింది: "ఇప్పుడా రోగం మిగిలిన జంతువులకు అంటుకుంటే ఎలాగ?" అని రోగంతో ఉన్న పిల్లిని వెంటబెట్టుకొని అడవిలోకి పోయింది.
ఆ తర్వాత ఒక్కరోజుకే వాళ్లిద్దరి రోగమూ మరింత పెరిగిపోయింది. "నేను చనిపోయినా పర్లేదు- ఈ పిల్లి బ్రతికితే చాలు" అనుకుంటూన్న జ్యోత్స్నకు ఇక చివరి ఘడియలు సమీపించాయి అనగా వనదేవతలు ప్రత్యక్షం అయ్యారు.
"జ్యోత్స్నా, నీ మంచి మనసు మాకు చాలా నచ్చింది. తర్వాతి జన్మలో నువ్వొక యువరాణిగా పుడతావు. నీతోపాటు ఉన్న ఈ పిల్లి మటుకు ఇప్పుడే పూర్తిగా ఆరోగ్యవంతురాలౌతుంది. పిల్లుల రాణిగా ఈ అడవిలో గౌరవాన్ని అందుకుంటుంది" అని చెప్పి మాయం అయిపోయారు వాళ్ళు.
వాళ్ళన్నట్లే జ్యోత్స్నకాస్తా చనిపోయి గంధర్వ రాజు కూతురు జ్యోతిర్మయిగా పుట్టింది. పిల్లేమో రోగం తగ్గి, ఆరోగ్యవంతురాలైంది; అడవిలోనే బ్రతుకుకొనసాగించింది.
ఎందుకనో తెలీదుగానీ, జ్యోతిర్మయికి చిన్నప్పటినుండీ భూమి అంటే చాలా ఇష్టంగా ఉండేది. నెలకొక్కసారన్నా ఆ పాప, తన స్నేహితులతోపాటు భూమిమీదికి వచ్చి విహరిస్తూ ఉండేది.
ఒకసారి వాళ్ళంతా ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా పెద్దపులి ఒకటి వాళ్ల మధ్యకి దూకింది. పిల్లలందరూ చెల్లా చెదరయ్యారు. జ్యోతిర్మయి కూడా వేగంగా పరుగు పెట్టింది. ఆ పాపవెంట పెద్దపులి!
పరుగెత్తీ పరుగెత్తీ అలిసిపోయింది జ్యోతిర్మయి. అంతలోకే అటుగా వచ్చిన పిల్లి ఆ పాపను చూసి గుర్తుపట్టింది. దానికి అడవిలో ఉన్న జంతువులన్నీ పరిచయమే. వెంటనే అది పెద్దగా హెచ్చరించింది పులిని- "ఈ పాప మన స్నేహితురాలు- ఈమెని ఏమీ చెయ్యకు!" అని.
దాన్ని గౌరవించిన పులి కూడా, జ్యోతిర్మయిని ఊరికే వాసన చూసి వదిలేసింది. తనను కాపాడిన పిల్లిని జ్యోతిర్మయి గంధర్వ రాజ్యానికి ఆహ్వానించింది. తల్లిదండ్రులకు పరిచయం చేసింది. తమ దేశం అంతా త్రిప్పి చూపింది.
అటుపైన వాళ్ళిద్దరూ మూగ ప్రాణుల సంక్షేమం కోసం కృషి చేసారు.