దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వొట్టిమాటలు కట్టి పెట్టోయి
గట్టి మేల్ తల పెట్టవోయి

పాడి పంటలు పొంగి పొర్లే
దారిలో నువు పాటు పడవోయి
తిండి కలిగితె కండ కలదోయి
కండ కలవాడేను మనిషోయి!

ఈసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుపడునోయి?
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరుకులు నించవోయి

అన్ని దేశాల్ క్రమ్మవలెనోయి
దేశి సరుకులనమ్మవలెనోయి
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయి

వెనక చూపిన కార్యమేమోయి?
మంచి గతమున కొంచెమేనోయి
మందగించక ముందు అడుగేయి
వెనకపడితే వెనకేనోయి!

పూను స్పర్థలు విద్యలందే
వైరములు వాణిజ్యమందే
వ్యర్థ కలహం పెంచబోకోయి
కత్తి వైరం కాల్చవోయి

దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయి
పూని యేదైనాను వొక మేల్
కూర్చి జనులకు చూపవోయి

ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చేసెనోయి
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయి

పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపికెక్కడ సుఖం కలదోయి?
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయి!

స్వంత లాభం కొంత మానుకు
పొరుగువాడికి తోడుపడవోయి
దేశమంటే మట్టి కాదోయి
దేశమంటే మనుషులోయి!

చెట్టపట్టాల్ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయి
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయి

మతం వేరైతేను యేమోయి
మనసునొకటై మనుషులుంటే
జాతమన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయి

దేశమనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయి
నరుల చెమటకు తడిసి మూలం
ధనం పంటలు పండవలెనోయి

ఆకులందున అణగిమణగీ
కవిత కోవిల పలకవలెనోయి
పలుకులను విని దేశమందభి-
మానములు మొలకెత్తవలెనోయి!