మగధ రాజ్యపు మంత్రి మాధవుడు తెలివైన వాడే కాక, మంచి సంగీత విద్వాంసుడు కూడా. చక్రవర్తికి ఆంతరంగికుడుగా అతన్ని అందరూ గౌరవించేవాళ్ళు; చాలా మర్యాదగా మాట్లాడేవాళ్ళు. అతని మంత్రిత్వాన్నే కాక, అతని సంగీతాన్ని కూడా చుట్టూ ఉన్నవాళ్ళంతా అమితంగా పొగిడేవాళ్ళు. ఎవ్వరూ అతన్ని విమర్శించేంత సాహసం చేసేవాళ్ళు కాదు.
అయితే విమర్శ బొత్తిగా లేకపోవటం అనేది ఏనాటికైనా చేటే- రానురాను మాధవుడికి గర్వం తలకెక్కింది. తనతో ఎవ్వరూ పోటీ పడటం లేదంటే వాళ్లందరికంటే 'తనే గొప్ప' అని అనుకోసాగాడు.
"ఈ భూప్రపంచంలో నన్ను మించిన సంగీత విద్వాంసుడే లేడా?! ఇంక నాతో ఎవ్వరూ పోటీయే పడరా? ఒకసారి నాచేత ఓడితే మాత్రం ఏమి? ఓసారి రండి- మీరు ఓడితే నేను ఏమీ అననులే" అని అందరినీ పోటీకి ఆహ్వానిస్తూండేవాడు. అయితే అతని తత్వం తెలుసు గనక, ఎవ్వరూ అతనితో పోటీకి వచ్చేవాళ్ళు కాదు- అతని మానాన్ని అతన్ని వదిలేసి, తమ పని తాము చేసుకొని పోయేవాళ్ళు.
మగధకు పొరుగునే ధర్మపురి రాజ్యం ఉండేది. ఆ రాజ్యపు మంత్రి ధర్మకీర్తి మంచివాడు, సంగీత ప్రియుడున్నూ. ఎవరు పాట పాడతానన్నా స్వయంగా వెళ్ళి మరీ వినేంత పాటల పిచ్చి అతనిది. మాధవుడి గురించి తెలియగానే అతను ఉత్సాహంగా కబురు పంపాడు- "తమరు గొప్ప సంగీత విద్వాంసులని విని ఉన్నాను. తమరి గానం విని తరించాలని ఉన్నది. తమరు సరేనంటే నేను వీలు చేసుకొని తమ వద్దకు వస్తాను" అని.
అయితే మాధవుడు అతని అభ్యర్థనను నేరుగా తిరస్కరించాడు. "పోటీకి రావాలంటే రండి. ఊరికే వినేవాళ్ళు చాలామందే ఉంటారు-వాళ్ళకేం తక్కువ?" అని.
అది విని ధర్మకీర్తి "అయితే సరే. నేను పోటీకి సిద్ధం" అని కబురు పంపాడు. అట్లా కబురంపటమే కాక, ఒక వారం రోజులకు తానే ప్రయాణం కట్టాడు మగధకు.
మగధ చేరగానే అతను మాధవమంత్రిని కలిసి మర్యాద పూర్వకంగా నమస్కరించాడు. మాధవుడు తను కూర్చున్న పీఠం మీదినుండి లేవకనే ధర్మకీర్తితో "ఓహొ! నువ్వేనా నాతో పోటీ పడేందుకు వచ్చింది! నిజంగానే నువ్వు సాహసవంతుడివి! ఇప్పటివరకూ ఎవ్వరూ నాతో తలపడి గెలవలేదు మరి" అన్నాడు.
ధర్మ సేనుడు నవ్వుతూ "అదేమీ లేదు మంత్రి గారూ! నేనేమీ మీ అంత గొప్ప విద్వాంసుడిని కాదు. కాకపోతే నాకు చిన్ననాటినుండి పాట అంటే ఇష్టం. మీరు గొప్పగా పాడతారని, మంచి సంగీత విద్వాంసుడని విని, ఇట్లా అయినా మీ పాట వినే భాగ్యం కల్గుతుందని ఇలా వచ్చాను. మీ గానాన్ని వింటూ, నా పాటలోని దోషాలను గుర్తించే ప్రయత్నం చేస్తాను. నాకు నా సామర్థ్యం ఏపాటిదో తెలుస్తుంది. అంతే తప్ప మరో ఉద్దేశం లేదు" అన్నాడు వినయంగా.
"ఓహొ! ఊరికే సమయాన్ని వృధా చేసేందుకు వచ్చాడన్నమాట" అనుకున్న మాధవమంత్రి పైకి మటుకు "లేదు ధర్మసేనా, నేను అయితే ఇలా మాట్లాడను- ఏ పోటీకైనా వెళ్తే గెలిచి తీరాలి- లేకుంటే అసలు వెళ్లనే కూడదు. గెల్చేందుకు పాడకపోతే ఇదంతా వృధా" అని హితవు పల్కాడు. "నీకు చాలా సాధన అవసరం అనుకుంటాను. ఇవాళ్ల రాత్రి అంతా నీ సాధనకు సమయం ఇస్తున్నాను" అని ముగించాడు.
ఆ రోజంతా తాను పోటీలో పాడనున్న పాటను సాధన చేసుకుంటూ గడిపాడు మాధవమంత్రి. ధర్మసేనుడు మటుకు మగధ దేవాలయాల్లో జరిగే సంగీత కచేరీలకు హాజరై అర్థరాత్రి వరకూ సంగీతాన్ని ఆస్వాదించి వచ్చాడు.
మరునాడు పోటీలో మాధవమంత్రి "లేరు నాకెవరు సాటి!" అని పాడితే అందరూ "ఆహా! ఓహో!" అన్నారు. మాధవుని సంగీతం ధర్మసేనుడికి చాలా నచ్చింది. "అద్భుతంగా పాడారు! మీకెవరూ సాటి లేరు, నిజంగానే" అని మెచ్చుకున్నాడు- "నేను ఓటమిని అంగీకరిస్తున్నాను- గానగంధర్వులైన మీ ముందు గొంతు విప్పేందుకు కూడా ధైర్యం చాలట్లేదు నాకు" అంటూ. మాధవుడు అతని భుజం తడుతూ "పరవాలేదు- ఊరికే కొంచెం పాడు. నువ్వు గెలుస్తావని మేము ఏనాడూ అనుకోలేదులే, అసలు!" అని నవ్వాడు గర్వంగా.
సరే, అని త్యాగరాజ కీర్తన అందుకున్నాడు ధర్మసేనుడు- "ఎందరో మహానుభావులు- అందరికీ వందనములు" అని. ఆ మాధుర్యానికి అందరూ పరవశించిపోయారు. "సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువారెందరో మహానుభావులు" అని అనేసరికి సభలోని వారంతా వంగి వంగి నమస్కారాలు చేయటం మొదలు పెట్టారు. చక్రవర్తితో పాటు, రాణులు, ఆటలాడే పిల్లలనుండి మొదలుపెట్టి, రాజుగారి ఉద్యానవనంలో విహరించే జింకలు అన్నీ పరుగు పరుగున సభకు చేరుకున్నాయి పాట వినేందుకు. "హొయలు మీర నడలుగల్గు సరసుని సదా కనుల జూచుచును, పులక శరీరులై యానంద పయోధి నిమగ్నులయి ముదంబునను యశము గలవారెందరో మహానుభావులు" అని ధర్మసేనుడు పాడితే అక్కడ చేరినవారి శరీరాలు పులకరించి ముదంతో నిండిపోయాయి. "త్యాగరాజాప్తులైన వారెందరో మహాను-భావులు -అందరికీ వందనములు" అని ధర్మసేనుడు ముగించేసరికి అందరి కళ్ళూ ఆనందంతో చెమర్చాయి.
మాటలు రాని సంతోషం ముప్పిరిగొనగా ధర్మసేనుడిని కౌగలించుకున్నాడు మాధవ- మంత్రి.
"సెహబాస్" అని ప్రశంసా రత్నాలతో అభిషేకించారు చక్రవర్తి. సభికులంతా "ఇంతగొప్ప పాటని విని మా జన్మ ధన్యమైంది" అని హర్షధ్వానాలు చేశారు.
"అణకువ, భక్తి, గౌరవం, ప్రేమ, కరుణ- నాదప్రియుడైన భగవంతునికి ఇన్ని రూపాలున్నాయి. ఆయన ప్రపంచంలో గర్వానికి, అతిశయానికీ తావులేదు. నేను నాలోని ఈ శత్రువులను జయించేందుకు గట్టి ప్రయత్నం చేస్తాను. నా అహంకారాన్ని వదిలించుకుంటాను" అని సభాముఖంగా ప్రతిజ్ఞ చేశాడు మాధవమంత్రి.