అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆయన మంచివాడే, కానీ తన చుట్టూతా ఉన్న ఉద్యోగులను గుడ్డిగా నమ్మేవాడు. దాంతో ఆయన నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని ఉద్యోగులంతా కూడా తమకు నచ్చినట్లు చేస్తూ పోయేవాళ్ళు. రాజుగారి దగ్గరికి ఎవరైనా సాయం కోసం వస్తే, వాళ్లని రాజుగారి దగ్గరికి పోనిచ్చినందుకు, ఆయనకు వాళ్లగురించి మంచిగా చెప్పినందుకు, లంచం తీసుకునేవాళ్ళు.

తమకు అట్లా లంచాలు ఇవ్వని వాళ్లను, పేదవాళ్లను రాజోద్యోగులు లోపలికి పోనిచ్చేవాళ్ళు కాదు. రాజుగారు భోం చేస్తున్నారనో, వేటకెళ్ళారనో, లేరనో- ఏదో ఒకటి చెప్పి త్రిప్పి పంపించేసేవాళ్ళు.

ఇవేమీ తెలీని రాజు తనవరకూ చేరిన కవులకు, కళాకారులకు బహుమానాలిస్తూ తనేదో వాళ్లందరినీ ప్రోత్సహిస్తున్నట్లు భావించేవాడు.

ఆ రాజ్యంలో నివసించే రామశర్మ అనే పండితుడు చాలా పేదవాడు. అనేక సంవత్సరాలపాటు కష్టపడ్డాక, ఇక పూట గడవని పరిస్థితిలో ఊరు వదలి, రాజుగారి సాయం కోరదామని వచ్చాడు అతను. దూర ప్రాంతం నుండి నడచి రావటంలో అతను చాలా అలసి పోయాడు; బట్టలన్నీ కూడా మట్టికొట్టుకొని పోయి ఉన్నాయి. శోష వస్తున్నది- ఇక రాజోద్యోగులకు ఏమివ్వగలడు? అతన్ని, అతని వేషాన్ని చూడగానే ద్వారపాలకులు 'రాజుగారు లేరు' అని చెప్పేసారు.

రాజధాని శివార్లలో ఉన్న ఓ తోటలో ఆగి, స్నానం కానిచ్చి, బట్టలు ఉతుక్కొని, మరుసటిరోజున అలాగే ఉత్తచేతులతో రాజాస్థానానికి చేరుకున్నాడు రామశర్మ. "రాజుగారు వేరే ఎవరితోటో మాట్లాడుతున్నారు" అని ఆ రోజూ లోపలికి పోనివ్వలేదు ద్వారపాలకులు.

ఆ తర్వాతి రోజునా ఇట్లాగే జరిగింది. అయితే ఆ రోజున ఉద్యోగులకు లంచాలు ఇచ్చినవాళ్ళని కొందరిని లోనికి పంపించటం గమనించాడు రామశర్మ.

'వాళ్లని ఎందుకు పంపుతున్నారు?' అని పోట్లాడాలనిపించింది గానీ, 'మొదటికే మోసం వస్తే ఎలాగ?' అని ఊరుకున్నాడు. అంతలో మంచి మంచి దుస్తులు ధరించిన వర్తకులు కొందరు గుర్రపు బళ్ళలో రావటం, ఉద్యోగులు వాళ్లకు సలాములు చేసి, ఆ బండ్లతో సహా లోనికి వదలటం చూసాడు. అట్లా వదిలిన వాళ్ళు బయటికి వస్తూ రాజోద్యోగులకు ఏ ఉంగరాలో, బంగారు నగలో‌ బహుమానంగా ఇస్తూన్నారు కూడా.

రామశర్మకు పరిస్థితి అర్థమైంది. తర్వాతి రోజున అతను ఊళ్ళో ఉన్న ఒక నాటకాల కంపెనీకి వెళ్ళి తన బాధలన్నీ వెళ్లబోసుకున్నాడు: "నాకు ఒక్క మంచి పంచె, ఉత్తరీయమూ, ఓ నాలుగు గిల్టునగలూ, గుర్రమూ ఇవ్వండి. వెనక్కి రాగానే మీ కిరాయి తప్పక చెల్లిస్తాను" అని.

అట్లా గొప్పగా తయారై, ఒంటినిండా విభూది పూసుకొని అపర మహేశ్వరుడిలాగా గుర్రమెక్కి కోటద్వారం చేరుకున్నాడు.

రాజోద్యోగులు అతన్ని గుర్తు పట్టలేదు. "రాజుగారు ఏం చేస్తున్నారు?" అని రామశర్మ గుర్రం మీదినుండే గంభీరంగా అడిగేసరికి వాళ్ళంతా అతనెవరో రాజుగారి మిత్రుడే అనుకున్నారు. "భోం చేస్తున్నారండి. కొంతసేపు అతిథిగృహంలో విశ్రాంతి తీసుకుంటారా?" అన్నారు గౌరవంగా.

"లేదు- మాకంత సమయం లేదు. వెంటనే కలిసి వెళ్ళిపోవాలి" అని గుర్రాన్ని నేరుగా భోజనశాల వైపుకే నడిపాడు రామశర్మ. అతని ఠీవినీ, దర్జానీ చూసిన రాజోద్యోగులు ఇక అతన్ని ఆపలేదు.

రాజుగారు ఆ సమయానికి నిజంగానే భోజనం చేస్తున్నారు. రామశాస్త్రిని చూడగానే ఆహ్వానిస్తూ "రండి! రండి! ముందు మాతో బాటు భోజనం చేయండి" అన్నారు.

రామశాస్త్రి సరేనని ఆయనతోబాటు కూర్చున్నాడు. సేవకులు రకరకాల పదార్ధాలు వడ్డించాక, వాటిని తను తినకుండా బట్టలకు తినబెడుతూ "ఇదిగో నా పట్టు ధోవతీ, లడ్డూ తిను. బాగుంది! ఇదిగో నా తలపాగా, పాయసం!" అనసాగాడు.

కొంచెంసేపు ఊరుకున్న రాజుగారు ఇక ఆగలేక అడిగేశారు- "ఏమది శాస్త్రిగారూ! మీ బట్టలకు ఆకలవుతున్నదటనా?" అని. "ఏం చెయ్యమంటారు ప్రభూ! ఈ బట్టలు కిరాయి బట్టలు. వీటిని వేసుకువస్తేనేకదా, తమరి దర్శనం దొరికింది?! మామూలుగా వస్తే నన్ను లోనికే అడుగు పెట్టనివ్వలేదు మీ పరిచారకులు. ఇప్పుడైనా వాళ్ళు రానిచ్చింది వీటినే గనుక, తమరిచ్చే పదార్థాలను తినే యోగ్యత కూడా‌ వీటిదే!" అనేశాడు ధైర్యంగా.

రాజుగారు గట్టిగా నవ్వారు.

దాంతో రామశాస్త్రి మరింత ధైర్యం‌ తెచ్చుకొని "నిజమైన పేదవారికి తమరి దర్శనం దొరకటం దుర్లభంగా ఉంది ప్రభూ! పేదవారు ఎవరూ మీ వరకూ రాలేక పోతున్నారు. తమ పరిచారకులకు వడపోత బాధ్యతను అప్పగించటం భావ్యమా? తమరు ప్రజలకు మరింత దగ్గర ఎందుకు కారాదు?" అని అడిగేశాడు.

రాజుగారు ఒక్క క్షణం ఆలోచించి, లంచగొండులైన ఉద్యోగులను శిక్షించారు. రామశర్మకు బహుమానం ఇవ్వటమే కాక, తనను సందర్శించ వచ్చేవారిని వడపోసే అధికారిగా నియమించారు!