అనగనగా ఓసారి పశ్చిమాఫ్రికాలో‌ మళ్ళీ కరువొచ్చింది. ఒక్క చుక్క వాన లేదు; ఒక్క మొక్కా బ్రతకలేదు. పంటలన్నీ ఎండి పోయాయి. పశువులన్నీ ఎముకల గూళ్లయ్యాయి. ఎవ్వరికీ త్రాగేందుకు నీళ్ళు దొరకని పరిస్థితి. ఆకలితో అందరి కడుపులూ వెన్నెముకలకు అంటుకుపోయాయి.

అందరితోబాటు అనాన్సీ, అతని కుటుంబం కూడా అలమటిస్తున్నది.

అనాన్సీ కొడుకు క్వేకుజిన్- అడవిలో అంతటా తిరుగుతూ‌ వెతుకుతున్నాడు- 'తినగలిగేది ఏది దొరికినా చాలు'అనుకుంటున్నాడు.

త్వరలోనే అతని చూపులు ఎండిపోయిన ఓ తాటి టెంక మీద వ్రాలాయి- తాటి టెంక అక్కడే ఓ చెట్టు మొదట్లో పడి ఉన్నది.

"ఈ టెంకను పగలగొడితే లోపల కొంత తాటి కొబ్బరి దొరకచ్చు, తినేందుకు" అనుకున్నాడు క్వేకుజిన్, బరువైన రాయిని ఒకదాన్ని ఎత్తి దాని మీదికి వేస్తూ. అయితే మరుక్షణం- ఆ టెంక ఎగిరి వెళ్ళింది! దగ్గర్లోనే ఉన్న ఓ చెట్టు తొర్రలోకి దూరింది!

చెట్టు తొర్ర నేలకు దగ్గరగానే ఉంది. క్వేకు దానిలోకి చెయ్యి పెట్టి చూశాడు- టెంక కనబడలేదు గానీ, తొర్ర క్రింద గుంత ఏదో ఉన్నట్లున్నది. ఒక్క క్షణం వాడికి భయం వేసింది- అందులో భూతాలేమైనా ఉంటాయేమోనని. కానీ‌ వాడికి ఆ సమయంలో ఆకలే ఎక్కువ బలంగా ఉన్నది- భయం కంటే! అందుకని వాడు మెల్లగా తొర్రలోంచి వంగి గుంతలోకి చూశాడు.

తొర్రలోపల అంతా చీకటిగా ఉన్నది... గుంత లోతుగానే ఉన్నట్లున్నది. చేతులు పెట్టి తడిమితే గుంత అడుగు ఏమీ తగలలేదు. దాంతో వాడు లేని ధైర్యం తెచ్చుకొని, కాళ్ళు లోనికి జొనిపి గుంతలోకి దిగేందుకు ప్రయత్నించాడు- "గుంత లోతు ఎంత?- అనుకునేంతలో- "-సర్రు...!"మని వాడు కాస్తా గుంతలోకి జారిపోయాడు!

కనీసం ఒక నాలుగైదు సెకనులైనా పట్టి ఉండాలి- గుంత అడుక్కు చేరుకుని దబ్బున పడేందుకు- వాడి ఒళ్ళు కొంచెం రాసుకు పోయింది; మనస్సు జారిపోయింది.. నడుము పట్టుకొని లేచి నిలబడి, నిక్కరు దులుపుకున్నాడు వాడు.

వాడి కళ్ళు చీకటికి కొంచెం అలవాటు పడే సరికి ఆశ్చర్యం! వాడి కళ్ళ ముందు ఏదో వెలుగు పొర- ..పొర కాదు- అక్కడొక ఊరే ఉన్నది!! ఊళ్ళో రోడ్లున్నాయి, భవనాలున్నాయి; అక్కడక్కడా లాంతర్లు వెలుగుతున్నాయి- కానీ ఊరంతా నిర్మానుష్యంగా ఉంది- ఎక్కడా ఎవ్వరూ ఉన్నట్లు లేరు!

"ఎవరున్నారండీ, ఇక్కడ? ఎవరున్నారు?" అని అరుచుకుంటూ వాడు ఆ ఊరి వీధుల్లో‌ పడి తిరిగాడు. వాడికి ఇప్పుడు ఆకలి దహించుకు పోతున్నది. దానికి తోడు, వెనక్కి ఎట్లా వెళ్ళాలన్న ఆక్రోశం!

చివరికి, అక్కడ ఓ‌ తోట మధ్యలో చిన్న గుడిసె, దాని ముందు బెంచి మీద కూర్చొని ఓ ముసలమ్మ, కనబడ్డారు!

"అవ్వా!‌ ఓ అవ్వా!" అరిచాడు వాడు, తోట బయటినుండే.

"ఎవరు నాయనా, నువ్వు? ఇక్కడికెలా వచ్చావు?" వెనక్కి తిరిగి నిలబడుతూ అన్నది అవ్వ. అవ్వ ముక్కు సన్నగా, పొడుగ్గా ఉంది. ఒళ్ళు ముడతలు పడి ఉన్నది. ఆఫ్రికాలో పెద్ద మనుషులు వేసుకునే పొడవాటి అంగీ ఒకటి వేసుకొని ఉన్నది ఆమె.

"నేను పైనున్న భూమి నుండి వచ్చానవ్వా, మా దగ్గర తినేందుకు అస్సలు ఏమీ దొరకట్లేదు. ఈ ఖాళీ కడుపును నింపుకునేందుకు రవంత తిండి ఏమైనా దొరుకుతుందా, మీ ఊళ్ళో?" అడిగేశాడు క్వేకుజిన్, సిగ్గును పక్కన పెట్టేసి.

"ఓఁ దానికేం‌ భాగ్యం?! తప్పకుండా దొరుకుతుంది. అయితే ముందు నువ్వు కొంచెం‌ పని చెయ్యాల్సి ఉంటుంది- ఇదిగో, ఈ‌ ఇంటి వెనక ఉన్న తోటలోకి పో. అక్కడ చిలకడ దుంపల కయ్య ఒకటి ఉంది. నువ్వు ఆ కయ్య దగ్గరికెళ్ళి, జాగ్రత్తగా ఆ చిలకడ దుంపలు ఏమంటున్నాయో విను- "రా! నన్ను త్రవ్వి తీసుకెళ్ళు!" అనే చిలకడ దుంపల్ని మటుకు నువ్వు అస్సలు పట్టించుకోకు. కొంచెం సేపు వెతికి ఐనా సరే, "నన్నేం చెయ్యకు! నన్ను త్రవ్వి తీసుకెళ్ళకు!" అని మొత్తుకునే చిలకడ దుంపని ఒకదాన్ని మటుకు త్రవ్వి, నా దగ్గరికి తీసుకురా. పో!" అని పంపించింది.

క్వేకు జిన్ మెల్లగా ఆ చిలకడ దుంపల కయ్య దగ్గరికి వెళ్ళాడు. బాగా లావుగా, బలంగా, నిగనిగలాడుతూ ఊరిన ఆ చిలకడ దుంపల్ని చూసే సరికి వాడికి ఇక ఆగలేనంత ఆకలి వేసింది. అయినా, వాడు మంచి పిల్లాడు కాబట్టి, కొంచెం తమాయించుకొని తనకు కావలసిన చిలకడ దుంపని ఎట్లా దొరికించుకోవటమా అని ఆలోచించాడు.

నిజంగానే ఆ కయ్యలో ఉన్న చిలకడ దుంపలన్నీ‌ మంచి మాటకారులు! క్వేకు జిన్ ను చూడగానే అవన్నీ "రా! నన్ను త్రవ్వి తీసుకెళ్ళు!" అని అరవటం మొదలు పెట్టాయి. వీడు వెతకగా వెతకగా ఒక్కటి మాత్రం "వద్దు! వద్దు! నన్నేం చెయ్యకు! నన్ను త్రవ్వి తీసుకెళ్ళకు!" అని మెల్లటి గొంతుతో అరుస్తూ కనబడ్డది!

క్వేకు జిన్ దాన్ని ఒక్కదాన్నీ‌ త్రవ్వి తీసుకెళ్ళి నేరుగా అవ్వ చేతిలో‌ పెట్టాడు. అవ్వ అన్నది "తెచ్చావా, సరే. ఇప్పుడు ఈ చిలకడ దుంప పొట్టు ఒలువు. లోపల తెల్లగా ఉండేదాన్నంతా పడెయ్యి. పొట్టుని మటుకు ఇదిగో, ఈ కుండలో వేసి, బాగా ఉడికించి పట్టుకురా!" అని.

"ఇదేదో చాలా వంకర టింకర ఆదేశం లాగా ఉన్నదే?!" అని పిల్లవాడు కొంచెం ఆశ్చర్యపోయాడు గానీ, ఖచ్చితంగా ఆమె చెప్పినట్లే చేశాడు.

చిలకడ దుంపని ఒలిచి, ఆ తొక్కుని మటుకు కుండలో వేసి బాగా ఉడికించి తెచ్చి అవ్వ చేతికిచ్చాడు. "ఇదిగో అవ్వా!" అని.

"తెచ్చావా, సరే! ఇప్పుడు నేను నా భోజనం చేస్తాను- అయితే నువ్వు అటు తిరిగి కళ్ళు మూసుకో. నేను భోంచేస్తుండగా చూడకు!" అన్నది అవ్వ, కుండని అందుకుంటూ.

"సరే అవ్వా!" అని క్వేకు జిన్ అటు తిరిగి చేత్తో కళ్ళు మూసుకున్నాడు.

అవ్వ మెల్లగా తినటం పూర్తి చేసి, క్వేకు జిన్‌ని పిలిచింది "ఇదిగో, బాబూ! మళ్ళీ ఓసారి ఇంటి వెనక తోటలోకి వెళ్ళి, అక్కడినుండి ఈసారి ఒక డప్పును ఎంచుకొని తీసుకురా! అయితే చూడు, 'డబ్ డిబ్' అనే డప్పు పనికిరాదు- 'డిబ్ డబ్' అనే డప్పునే తేవాలి, అర్థమైంది కదా?" అన్నది.

క్వేకు జిన్ తల ఊపి, అట్లాగే వెళ్ళి చూశాడు. అక్కడ చాలా డప్పులు ఉన్నాయి. వాటిలో అంతటా వెతికి "డిబ్ డబ్" అనే డప్పుని పట్టుకొచ్చి అవ్వకిచ్చాడు.

"సరేలే, ఇప్పుడింక దీన్ని తీసుకొని మీ ఇంటికెళ్ళు. నీకు ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు ఈ‌ డప్పును వాయించు- సరిపోతుంది" అన్నది అవ్వ దాన్ని తిరిగి వాడి చేతికే ఇస్తూ, "ఓహోఁ ఇంటికి వెళ్ళే దారి తెలీదు గదూ, నీకు? ఏముంది, ఈ కాకర తీగను పట్టుకొని పైకెక్కితే సరి!" అన్నది అవ్వ.

క్వేకు జిన్‌కి ఇదంతా ఆశ్చర్యం అనిపించింది గానీ, "అవ్వ చెప్పినట్లు చేస్తే పోలా?" అని వాడు అవ్వకి ధన్యవాదాలు చెప్పుకొని, డప్పును జాగ్రత్తగా తన నడుముకు కట్టుకొని, ఆ కాకర తీగను పట్టుకొని పైకెక్కాడు.

చూడగా మళ్ళీ‌ వాడు తను క్రిందికి పడ్డ చెట్టు తొర్ర గుంత ప్రక్కకే వచ్చి ఉన్నాడు!

వాడింక ఆలస్యం చేయకుండా ఇంటికి పరుగెత్తాడు. వాడి ఆకలి, మధ్యలో ఎక్కడికి పోయిందో గాని, ఇప్పుడు మటుకు విపరీతంగా ఉన్నది మరి! వాడి సంతోషాన్ని చూసి, ముందు వాళ్ల ఇంట్లో వాళ్ళు అందరూ వాడికి ఏదో‌ గొప్ప ఆహారం దొరికిందనుకున్నారు. అయితే అవ్వ ఇచ్చిన బహుమతిని వాడు తమ ఇంటి మధ్యలో పెట్టి దానిముందు కూర్చునే సరికి, అందరూ వాడికి పిచ్చి పట్టిందని జాలిపడ్డారు.

అంతలో క్వేకుజిన్ ఆ డప్పుని "డిబ్ డబ్- డిబ్ డబ్- డిబ్ డబ్!" అని మూడుసార్లు వాయించాడో లేదో, ఎక్కడా లేనన్ని అద్భుతమైన వంటలు అక్కడ ప్రత్యక్షం అయ్యాయి!

తనకు దొరికిన దాన్ని అందరితోటీ‌ పంచుకోకుండా‌ ఉండలేడు క్వేకుజిన్. ఆ రోజున తమ కడుపు నిండాక, మిగిలిన ఆహారాన్ని చుట్టు ప్రక్కల వాళ్లకు అందరికీ‌ పంచాడు వాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి తమ ఊరివాళ్లను అందరినీ‌ ఒక చోటికి పిలిచి, మళ్ళీ ఓసారి డ్రమ్మును వాయించాడు. ఈసారి గొప్ప విందుకు సరిపడ భోజనం ప్రత్యక్షమైంది అక్కడ. దాంతో అందరి ఆకలీ తీరేట్లు భోజనాలు పెట్టాడు క్వేకుజిన్.

ఒక పదిహేను రోజులు ఇట్లా గడిచేసరికి, ఊళ్ళో అందరూ బాగైనారు. అందరూ తమ తమ పనులు మొదలు పెట్టుకున్నారు.

(తర్వాత ఏమైందో వచ్చే మాసం...!)