అనగనగా వెంకటప్ప, గుర్రప్ప, రామయ్య, కిట్టయ్య అనే నలుగురు వేటగాళ్లు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రతిరోజూ వేటకు వెళ్ళేవాళ్ళు. అడవిలో కనీసం రెండు మూడు జంతువులనైనా చంపేసేవాళ్ళు.
చాలా జంతువులు వాళ్లను గుర్తు పట్టేవి- అట్లా గుర్తు పట్టిన జంతువులన్నీ, పాపం, ఆ వేటగాళ్లను చూడగానే పారిపోయేవి. మరీ భయపడిన జంతువులైతే కొన్ని ఆ ప్రాంతాన్ని విడిచి వేరొక ప్రాంతానికి వెళ్ళి-పోయినై కూడా. వేటగాళ్లను గుర్తు పట్టలేని జంతువులు, ముసలి జంతువులు, చిన్న పిల్లలు- ఇవి మాత్రం వాళ్ల చేతికి చిక్కేవి.
అట్లా రోజూ ఒకటి రెండు జంతువులు చనిపోతూండేసరికి, మిగిలిన జంతువులన్నీ చాలా కంగారుపడ్డాయి. అన్నీ ఒకచోట చేరి, "మనం ఇట్లానే ఊరుకుంటే, కొన్నాళ్ళకు ఎవ్వరం బతికి ఉండం. కాబట్టి మనమంతా కలిసి ఏదో ఒకటి చెయ్యాలి; మనల్ని మనం కాపాడుకోవాలి. ఏదో ఒక విధంగా ఈ వేటగాళ్ళు లేకుండా చెయ్యాలి" అనుకున్నాయి.
"కానీ ఎలాగ?" అడిగింది కోతి.
"ఏదైనా ఉపాయం ఆలోచించండి. 'అపాయాలు ఎదురైనప్పుడు ఉపాయం ఆలోచించాలి'అంటారు పెద్దలు. మనుషుల్ని గెలవాలంటే ఒట్టి శారీరక బలం ఉంటే చాలదు- బుద్ధిబలం కూడా తోడవ్వాలి" అన్నది సింహం.
"మన అడవిలో పెద్ద బావి ఉంది కదా, ఇప్పుడు అందులో చాలా నీళ్లున్నాయి. అందులో మన మొసళ్ళు దాక్కోవాలి. వేటగాళ్ళను ఏదో ఒక విధంగా తెచ్చి అందులో‌ పడేట్లు చేస్తే మన లక్ష్యం నెరవేరుతుంది" అన్నది కుందేలు.
"అవునవును..అయితే వాళ్ళని వచ్చి అందులోకి దూకమంటే దూకరు!" అంది పిల్లి. దానికి కుందేలు అంటే ఇష్టం లేదు.
"మనం ఎదుర్కొంటున్న సమస్య చాలా పెద్దది. ఎవ్వరూ వెటకారంగా మాట్లాడి చర్చను తప్పుదారి పట్టించకండి. కుందేలు చెప్పింది బానే ఉంది- అయితే వాళ్ళని మన బావిలో పడేట్లు చేయటం ఎలాగో ఆలోచించండి అందరూనూ" అధికారంతో‌ కూడిన స్వరంతో చెప్పింది సింహం.

"మనమంతా నాలుగు గుంపులుగా విడిపోదాం. ఒక్కొక్క గుంపూ అడవిలో ఒక్కొక్క వైపు వెళ్తుంది. వేటగాళ్ళు ఏ గుంపు దగ్గరికి వస్తారో తెలీదు. ఎవరి దగ్గరికి వస్తే ఆ గ్రూపు వాళ్ళు పరుగు లంకించుకోవాలి.. అడవిలోని పెద్ద బావి మీదినుండి దూకుతూ రెండో వైపుకు పరుగు పెట్టాలి.." అన్నది తోడేలు, కొంచెం ఆలోచించి. ఆ ఆలోచన జంతువులన్నిటికీ‌ నచ్చింది. అన్నీ గందరగోళంగా మాట్లాడుకొని, చివరికి 'అవును- అలా చేద్దాం' అనుకున్నాయి. జంతువులు అట్లా అనుకున్న రోజు రాత్రే వేటగాళ్ళ గుంపు అడవిమీద పడ్డది. కాగడాలు, వలలు, త్రాళ్ళు, కొడవళ్ళు, కత్తులు, బల్లాలు- ఇవన్నీ పట్టుకొని వేటగాళ్ళు జంతువుల వేటకై బయలుదేరారు. వాళ్ళకి ఆ రోజున చాలా జంతువులు ఎదురయ్యాయి- అన్నీ గుంపులు గుంపులుగా ఉన్నాయి. అయితే వాళ్లు కనబడగానే అన్నీ పరుగు పెట్టసాగాయి. వేటగాళ్ళు వాటిని వెంబడించారు. మామూలుగా అయితే వెనకబడి ఉన్న ఒకటోరెండో జంతువుల్ని పట్టుకొని సంతోషపడేవాళ్ళే. కానీ ఒక్కసారిగా అన్ని జంతువులు కనబడేసరికి వాళ్లకు ఆశ పుట్టింది. ఎవరికి వాళ్ళు గుడ్డిగా వాటి వెంట పడిపోయారు.
ఆ చీకట్లో ఎవరెటు పోతున్నారో తెలీలేదు: కొద్ది సేపటి తర్వాత నలుగురూ బావిలో పడి అందులో ఉన్న మొసళ్లకు ఆహారం అయిపోయారు!
వేటగాళ్ల బెడద తప్పిపోవడంతో జంతువులన్నీ సంతోషంతో పండగ చేసుకున్నాయి.