అనగనగా ఒక అడవిలో ఓ తోడేలు ఉండేది. ఆ సంవత్సరం అస్సలు వానలు పడలేదు. అడవిలో గడ్డంతా ఎండిపోయింది. చిన్న చిన్న జంతువులన్నీ ఎక్కడెక్కడో దాక్కున్నై. పాపం, తోడేలుకు ఆహారం దొరకటమే కష్టం అయిపోయింది.
ఒకరోజున అది వేటాడుతూ వేటాడుతూ ఓ పొలం దగ్గరికి వచ్చింది. దానికి తెలుసు- "పొలాల దగ్గర ప్రమాదం!" అని. అందుకని అది ఓ పొద మాటున నక్కి కూర్చుని, ముక్కు పుటాలు ఎగరేసింది-
అంతలో దాని ముందు ఓ జంతువు ప్రత్యక్షం అయ్యింది- "భౌ! భౌ!"మని వింతగా అరుస్తూ.
తోడేలు అంతకు ముందెన్నడూ ఇలాంటి జంతువుని చూసి ఉండలేదు. తనలాగానే ఉన్న ఈ జంతువుని చూస్తే దానికి ముచ్చటేసింది.
"భౌ!భౌ!" అంది కుక్క మళ్ళీ.
"తమ్ముడూ, నువ్వెందుకు, అట్లా అరుస్తున్నావు? మనం, తోడేళ్లం, అట్లా ఎన్నడూ అరవమే?" అడిగింది తోడేలు దానికేసి ప్రేమగా చూస్తూ.
"నేను నీ తమ్ముడిని కాను- కుక్కను. ఏవైనా జంతువులు పొలం దగ్గరికి వస్తే మేం "భౌ!"మని అరుస్తాం" అన్నది కుక్క, దానికేసి చూస్తూ.
"ఏమో! మనిద్దరం ఒకేలాగా ఉన్నాం కదా, ఏదో బంధుత్వం ఉండే ఉంటుంది" అన్నది తోడేలు- బొద్దుగా, ముద్దుగా ఉన్న కుక్క శరీరాన్ని మెచ్చుకుంటూ.
"ఏమో, ఉండొచ్చు మరి" తల ఊపింది కుక్క, తోడేలు స్నేహాన్ని అంగీకరిస్తూ.
"ఒక సంగతి చెప్పు తమ్ముడూ! నేను ఇంత ఆకలిగా ఉన్నానే, మరి నువ్వు అంత లావుగా ఎలా ఉన్నావు?" అడిగేసింది తోడేలు, ఉండబట్టలేక.
"నేను పనిచేస్తాను కదా! పొలం దగ్గరికి వచ్చిన జంతువులను తరిమేస్తాను. అందుకుగాను, మా యజమాని తను తినగా మిగిలిన ఆహారాన్నంతా నాకే పెడుతుంటాడు!" గర్వంగా చెప్పింది కుక్క.
తోడేలుకు ఆశ్చర్యం వేసింది. "అంటే నువ్వు ఆహారం కోసం అడవిలో అంతా తిరిగి వేటాడనక్కర్లేదా?" అడిగిందది.
"ఉహుఁ. నాకేం పని?! నేనెప్పుడైనా వేటాడితే అది కేవలం వినోదానికే!" అన్నది కుక్క.
"తమ్ముడూ! మీ యజమాని ఇంకొకరిని కూడా ఏమైనా పనిలో పెట్టుకుంటాడా?...నేను కూడా జంతువులను తరమగలను" అన్నది తోడేలు.
"తెలీదు. పద, పోయి మా యజమానినే అడుగుదాం" అన్నది కుక్క, లేచి యజమాని ఉండే పాక వైపుకు దారి తీస్తూ.
కుక్క శరీరమంతటా మెత్తటి బొచ్చు ఉన్నది. కానీ దాని మెడ మీద మటుకు జుట్టు ఒత్తుగా లేదు. కుక్క, తోడేలు రెండూ పూరి పాక దగ్గరికి చేరుకునేసరికి, కిటికీలోంచి వచ్చిన వెలుతురు వాటి మీద పడ్డది. ఆ వెలుతురులో కుక్క మెడ మరీ బోసిగా అనిపించింది తోడేలుకు.
"కుక్కా! నీ మెడ ఎందుకంత బోసిగా ఉంది? ఒళ్ళంతా ఉన్న మెత్తని పట్టులాంటి కుచ్చు, మరి నీ మెడ దగ్గర లేదెందుకని?" అని అడిగిందది.
"ఓహ్ఁ అదా, కొన్ని రోజుల్లో నీకూ అలవాటైపోతుందిలే!" అన్నది కుక్క మామూలుగా.
"ఏది అలవాటవుతుంది?!" అడిగింది తోడేలు, ఒకింత అనుమానంగా.
"అదేమంత పెద్ద సంగతి కాదులే.. ఉదయం పూట నేను అటూ ఇటూ పరుగులు పెట్టటం మా యజమానికి ఇష్టం ఉండదు కదా, అందుకని, పగలంతా ఆయన నా మెడకో తాడు కట్టి ఉంచుతాడు. నేను ఆ తాడునేమైనా లాగాననుకో, అది నా మెడమీది బొచ్చుకు కొంచెంగా ఒరుసుకుంటుంది..కొంచెం నొప్పి పెడుతుంది. అయినా అదేమంత పెద్ద విషయం కాదు- సామాన్యంగా నేను పగలంతా ఊరికే పడుకొని నిద్రపోతుంటాను కదా! నీకూ అది సులభంగానే అలవాటైపోతుంది" అన్నది కుక్క.
తోడేలు ఆగిపోయి, వెనక ఉన్న అడవికేసి చూసింది. మళ్ళీ కుక్కను, మళ్ళీ అడవిని- ఇట్లా మార్చి మార్చి చూసింది కొంచెం సేపు.
ఆ తర్వాత మెల్లగా వెనక్కు అడుగులు వేస్తూ అంది కుక్కతో- "లేదులే తమ్ముడూ! నాకు అది ఏమంత సులభంగా అలవాటవ్వదులే. కాసింత అన్నం కోసం మరీ అంత పెద్ద మూల్యం చెల్లించటం నావల్ల కాదు. భోజనం కోసం ఎంత శ్రమ ఐనా పర్లేదు- ఎంచక్కా పరుగుపెట్టే వీలు ఉండటమే నాకు ఇష్టం!" అని.
కుక్క దానికి సర్ది చెబుతున్నట్లు అన్నది "అలా కాదన్నా! కొంచెం ఆలోచించు. నన్ను ప్రతిరోజూ కట్టేస్తే కట్టేస్తుండవచ్చుగాక, అయినా నేను నీకంటే చాలా స్వేచ్ఛగా బ్రతుకుతున్నాను. నాకు రోజూ వేటాడే బాధ లేదు; ఆ వేటలో ఏదైనా దొరుకుతుందో-దొరకదో అన్న ఆందోళన లేదు. భద్రంగా ఉండేందుకు నాకో మంచి ఇల్లు ఉంది, మా యజమాని పెట్టే మంచి బలమైన ఆహారం ఉంది.."అని.
"కానీ నువ్వు బ్రతికే బ్రతుకు మటుకు నీది కాదు! నాకు నా బ్రతుకు కావాలి!" అరిచింది తోడేలు, వెనక్కి పరుగు పెడుతూ.
బ్రిటిష్‌వారు రెండొందల ఏళ్ళ పాటు మనల్ని పరిపాలిస్తుంటే, ప్రతి దానికీ వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఆత్మను చంపుకున్న మనుషులు మనదేశంలో చాలామందే ఉన్నారు. అలా ఇతరుల కాళ్ళు పట్టుకోలేక, తమ బ్రతుకుల కోసం తెగించి పోరాటాన్నే ఎంచుకున్న తోడేళ్ళలాంటి వాళ్ళూ చాలామందే ఉన్నారు. అలాంటి వీరుల పోరాట ఫలితంగానే మనకొచ్చింది స్వాతంత్రం.
ఇప్పుడు, పరాయి దాస్య శృంఖలాలు మనకిక లేవు. ఇతరులకెవ్వరికీ లోబడి బ్రతుకు లాగాల్సిన అవసరం మనకిక లేదు.
మనకోసం మనం, స్వతంత్రంగా ఆలోచిద్దాం! కలిసి కట్టుగా పనిచేద్దాం! మన ప్రభుత్వాల్ని మనం నడుపుకుందాం. మన ఆత్మగౌరవాన్ని మనం నిలుపుకుందాం!
అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
కొత్తపల్లి బృందం