అనగా అనగా చాలా చాలా సంవత్సరాల క్రితం‌ ఓ పెద్ద కొండ అంచున ఓ చిన్న ఊరుండేది. ఆ రోజుల్లో ఎవరికీ ఏ తొందరా ఉండేది కాదు. ఆ పని- ఈ పని చేస్తూ పెద్దవాళ్లు, ఆటపాటలతో పిల్లలు హాయిగా కాలం గడుపుతూండేవాళ్ళు.
ఆ ఊరి పిల్లవాడు మల్లి. మల్లికి కూడా మిగతా చాలామంది పిల్లల్లాగే కొండమీద ఉన్న అడవిలోకి గొర్రెల్ని తోలుకువెళ్లి మేపటం‌ అంటే చాలా ఇష్టంగా ఉండేది. అయితే ఊళ్ళో పెద్దవాళ్లెవ్వరూ అటువైపుకు కూడా పోయేవాళ్ళు కాదు. ఆ కొండను అందరూ "రాక్షసుడి నోరు" అని పిలిచేవారు. "రాక్షసుడేడి, నోట్లో ఏముంది?" అని పిల్లలు అడిగితే "ఏమో మాకు తెలీదు. మా పెద్దవాళ్ళు మాకు చెప్పారు, మేం మీకు చెబుతున్నాం. అటువైపుకు మటుకు పోకండి" అనేవాళ్ళు వాళ్ళు.
మామూలుగా పశువుల్ని తోలుకునే అడవి ఊరికి ఇంకా దిగువన, దూరంగా ఉండేది. అక్కడికంటే కొండమీదే ఎక్కువ పచ్చగడ్డి ఉండేది. అయినా కొండ చుట్టూ ఎవరో వేసి పెట్టిన ముళ్ళ కంచెను దాటి పోయేందుకు పెద్దలు ఎవ్వరూ సాహసించేవాళ్ళు కాదు. వాళ్ళని చూసి పిల్లలూ ఏదో 'వెళ్ళామంటే వెళ్ళాం' అన్నట్లు కొండ దిగువనుండే వెనక్కి తిరిగి వచ్చేసేవాళ్ళు.

ఒకరోజున మల్లి గొర్రెల్ని మేపుకుంటూ కొండవైపుకు వెళ్ళాడు. ఉత్సాహం కొద్దీ కొంచెం కొంచెంగా కొండ ఎక్కుతూ అడవిలో తను అంతకుముందు ఎన్నడూ చూడని ఓ ప్రాంతానికి చేరుకున్నాడు. వాతావరణం ప్రశాంతంగా ఉంది. పక్షులు సందడిగా కూస్తున్నాయి. కొండమీదినుండి 'బుడ-బుడ'మంటూ ఏవో శబ్దాలు వస్తున్నాయి. మల్లికి మొదట కాసింత భయమేసింది. "అయినా పక్షుల అరుపులు గందరగోళంగా లేవు. ప్రమాదం లేదు" అని ధైర్యం తెచ్చుకున్నాడు. "ఈ శబ్దాలు ఎక్కడినుండి వస్తున్నాయో తెలుసుకోవాలి" అని కొండమీదికి ఎక్కసాగాడు. పైకి పోతున్న కొద్దీ బుడబుడ శబ్దాలు ఇంకాస్త గట్టిగా వినబడసాగాయి.
పర్వత శిఖరం మీదకు చేరుకున్న మల్లికి అక్కడ నీటి చెలమలు కొన్ని కనిపించాయి. చెలమల్లో నీళ్లన్నీ మరుగుతున్నాయి. "బుడబుడ శబ్దాలు అ వేడినీళ్లు చేస్తున్నవే! అక్కడ ఏ దయ్యాలు, భూతాలు లేవు!" దాంతో మల్లికి భయం పోయింది. చెలమలో నీళ్లు ఎంత వేడిగా ఉన్నాయోనని జాగ్రత్తగా చెయ్యి పెట్టి చూశాడు- "అబ్బో! చాలా వేడిగా ఉన్నాయి!"
దాంతో మల్లికి ఇంకో ఆలోచన వచ్చింది: "ఈ నీళ్లను నేరుగా తమ ఊరి వైపుకు మళ్లిస్తే ఎలా ఉంటుంది?!" అని. "ఇక వేడి నీళ్ళ కోసం చెట్లను కొట్టవలసిన పనే ఉండదు!"
కొండ దిగి పోయాక తను చూసిందంతా స్నేహితులకు చెప్పాడు మల్లి. పిల్లలంతా కలిసి కొండ ఎక్కి చూశారు. "నిజమే. ఈ నీళ్ళు క్రిందికి అందితే ఇక ఊళ్ళో వేడి నీళ్లకోసం చెట్లను కొట్టవలసిన అవసరమే ఉండదు" అనిపించింది అందరికీ. అయితే పిల్లలు ఈ సంగతిని ఊళ్ళో చెప్పగానే పెద్దవాళ్ళు చాలామంది "అమ్మో! రాక్షసుడి నోరు! దాన్ని ముట్టుకుంటే నాశనమే" అంటూ అక్కడినుండి పారిపోయారు. అయితే పిల్లలందరూ నచ్చజెప్పిన మీదట, ఊరి పెద్ద ఒక్కడూ పిల్లల వెంట ధైర్యంగా వచ్చి కొండ ఎక్కి చూశాడు. "పిల్లలు చెప్పినది నిజమే- ఇవి ఊరంతటికీ సరిపోయేన్ని నీళ్ళు!"
ఆయన సహకరించేసరికి మల్లి-మిత్రులు అందరూ వెదురు గొట్టాలతో పని మొదలుపెట్టారు. కొద్ది రోజుల్లోనే కొండ దిగువన ఉన్న గుంటలోకి వేడినీళ్ళను రప్పించగలిగారు. మొదట్లో దూరంగా ఉన్న ఊరి జనాలంతా కూడా మెల్లగా ఆ వేడినీళ్ళలో స్నానాలు చేసేందుకు రావడం మొదలయింది. ఇప్పుడు ఇక ఆ ఊళ్ళో నీళ్లు కాచుకోవడానికి కట్టెలు మండించాల్సిన పనే లేదు. దాంతో చెట్లను కొట్టేసే అవసరం చాలావరకు తగ్గింది.

అయితే ఒకరోజున గుంటలో నీళ్లు మామూలు కన్నా మరీ ఎక్కువ వేడిగా అనిపించాయి. గ్రామస్థులంతా అదే విషయాన్ని అనుకుంటుండగా విన్న ఓ ముసలి తాత తను చిన్నతనంలో విన్న సంగతి ఒకటి చెప్పాడు: "మా తాతలనాడు ఓసారి ఈ రాక్షసుడి నోరు ఎక్కడ లేనన్ని మంటలు క్రక్కిందట! ఆ మంటల్లో ఎంతలేసి జనాలూ మాడి మసైపోతారు. అయితే అది మంటలు క్రక్కేందుకు ఒకటి రెండు రోజులముందు ఇట్లా కొండ మీద నీళ్ళు వేడెక్కుతాయట-ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడింక మనం అందరం ఇక్కడనుండి చాలా దూరంగా వెళ్ళిపోవాలి వెంటనే- త్వరగా బయలుదేరండి. రెండు రోజుల్లో రాక్షసుడు నోరు తెరిచి బూడిద క్రక్కుతాడు. తర్వాత వాడు వేడి వేడిగా దేన్నో కక్కుతాడు. మండే ఆ ద్రవం అంతా దిగువకు ప్రవహిస్తుంది; ఊళ్లన్నిటినీ కప్పేస్తుంది. ఇదంతా మనకు దూరం నుండి కూడా కనబడుతుందట. అయితే కొన్నాళ్ళకు ఆ ద్రవం అంతా చల్లబడుతుంది; మనం మళ్ళీ ఇక్కడికి వచ్చి చేరుకోవచ్చు. అప్పటికి ఇక్కడ నేల మరింతగా సారవంతం అవుతుంది. దానిలో పంటలు మరింత బాగా పండుతాయి. ఇప్పుడైతే బయలుదేరండి త్వరగా" అని తాత చెప్పగానే, ఊరు ఊరంతా అక్కడినుండి కదిలింది. పశువులు, మనుషులు అందరూ రెండు రోజులపాటు ప్రయాణించి సురక్షిత ప్రాంతానికి చేరారు.

వెనక్కి తిరిగి చూస్తే, నిజంగానే తాత చెప్పినట్లు, మూడో రోజున కొండ పొగలు చిమ్మింది! దట్టమైన ఆ పొగలు ఆకాశాన్నంతా కప్పేశాయి. అంత దూరాన ఉన్నవాళ్ళకి కూడా ఊపిరి పీల్చుకోవటం కష్టం అయ్యింది. కొద్ది రోజులకల్లా కొండ మీదినుండి మండుతున్న ద్రవం ఒకటి క్రిందికి కారింది. వాళ్ళు ఉండిన ఊరు ఊరంతా ఆ ద్రవంతో కప్పబడిపోయింది!
దూరం నుండి చూసిన గ్రామస్థులంతా 'ఎంత ప్రమాదం తప్పింది!' అనుకున్నారు. గొట్టాలద్వారా నీళ్లను క్రిందికి తెచ్చుకోకపోతే కొండ మంటలు క్రక్కే సంగతి తెలిసేది కాదు!
ఆ విధంగా మెల్లగా మానవాళికి అంతటికీ అగ్ని పర్వతాలు అర్థం అయ్యాయి.