చిన్నారి చింటుకు చెట్లంటే చాలా ఇష్టం. "చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తాయి; రకరకాల పూలను, పళ్ళను ఇస్తాయి; నీడను ఇస్తాయి; పక్షులకు ఆశ్రయం ఇస్తాయి; వాతావరణాన్ని చల్లబరుస్తాయి" అని వాళ్ళ మాష్టారు చెప్పిన పాఠం విన్నాక, చింటుకు చెట్టే సరస్వం అయిపోయింది. ఆనాటినుండి ఊరవతల ఉన్న అడవిలోంచి రకరకాల విత్తనాలను సేకరించి తెచ్చి, తమ ఊరి ప్రక్కనే ఉన్న బంజరుభూమిలో నాటడం మొదలుపెట్టాడు వాడు. కనబడ్డ జనాలందరికీ చెట్ల వల్ల కలిగే ఉపయోగాలను వివరించి చెప్పటం మొదలు పెట్టాడు కూడా. అంతా వినేవాళ్ళే, కానీ ఎవ్వరూ ఒక్క మొక్కను నాటనూ లేదు; ఒక్క చెంబెడు నీళ్ళు పోయనూ లేదు.
అయినా చింటు తన పని మానుకోలేదు. బంజరు భూమిలో అంతా విత్తనాలు పెట్టేశాడు. వేరే ప్రాంతంలో విత్తనాలు నాటటం మొదలు పెట్టాడు. బంజర్లో అంతటా మొక్కలు మొలిచాయి. కొన్ని చనిపోయినా, మిగతావన్నీ పెరుగుతూ పోయాయి. కొన్ని సంవత్సరాలలో ఆ భూమి అంతా ఒక పచ్చని తోట మాదిరి తయారయ్యింది.
ఒకసారి చింటు విత్తనాలకోసం అడవిలోకి వెళ్ళినప్పుడు, ఆశ్చర్యంగా అక్కడ ఒక ఏనుగు పిల్ల కనబడింది. మొదట్లో దాన్ని చూసి భయపడ్డాడు చింటూ. అయినా, కాసేపటికి అది లేవలేకపోతూండటం గమనించాక, దాని దగ్గరికి వెళ్ళి చూశాడు: పాపం, ఏనుగు పిల్ల కాలికి బలమైన గాయం తగిలింది. అందువల్ల, అది పైకి లేవలేక పోతోంది! చింటు వెంటనే ఊళ్ళోకి వెళ్ళి, వాళ్ల నాన్నను, ఇంకా కొంతమంది ఊరి జనాలను అక్కడికి తీసుకు వచ్చాడు. అందరూ కలిసి ఏనుగు కాళ్ళకు కట్లు కట్టారు. చింటూ రోజూ దానికి దగ్గరుండి గడ్డి, నీళ్ళు పెట్టాడు. కొన్నాళ్ళు గడిచేసరికి ఏనుగు పిల్ల కాలి గాయం తగ్గింది. దాంతో పాటే అది జనాలకి మచ్చికయింది కూడా. చింటు అంటే దానికి ఎంత ప్రేమో! చింటును తన వీపుపై ఎక్కించుకుని అది అడవంతా తిప్పేది.
ఇప్పుడు ఊళ్ళోని పిల్లలంతా రోజూ అడవికి వెళ్ళి ఏనుగుపిల్లతో ఆడుకోవటం మొదలు-పెట్టారు. పిల్లల సందడితో అడవంతా మారుమ్రోగసాగింది. పిల్లలు వెతుక్కునేం-దుకు ఇప్పుడు అక్కడ ఎన్నో తీగలు, పూలు, కాయలు, పండ్లు దొరుకుతున్నాయికూడా.
అయితే, చింటు తన పనిని మాత్రం మరువలేదు. బంజరుతోబాటు అడవినీ పెద్దది చేస్తూ పోయాడు. చింటును జాగ్రత్తగా గమనించిన ఏనుగు కూడా ఇప్పుడు తన తొండతో గుంటలలోని నీళ్లను తీసుకొని వచ్చి మొక్కలకు పొయ్యడం మొదలుపెట్టింది. పిల్లల ద్వారా విషయం తెలుసుకున్న ఊరి జనాలందరూ గ్రహించారు: "త్వరలోనే తమ ఊరి బంజరు, అడవి ఒక్కటి కాబోతున్నాయి. తమ ఊరి బంజరు అడవిమాదిరి పచ్చగా తయారైంది. తమ సుఖ శాంతులకు దోహద-పడుతున్నది!" ఈ భావనతో జనంలో మార్పు వచ్చింది.
ఇప్పుడు ఆ ఊరి వాళ్లంతా చెట్లను నాటుతున్నారు. వాటికి నీళ్ళు పోసి సంరక్షిస్తున్నారు. మన దేశాన్నంతా పచ్చగా చేసేందుకు నడుం బిగించారు!